పెద్దాయన పాలిటిక్స్ క్ ఎండ్ కార్డు పడిందా ?
ఇక 2019లో టీడీపీ తరఫున మరోసారి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసినా వైసీపీ ప్రభంజనంలో రాయపాటి ఓటమి పాలు అయ్యారు.;
గుంటూరు జిల్లాలో సీనియర్ మోస్ట్ లీడర్ గా ఆయన పేరే ముందు చెప్పాలి. ఆయనది దశాబ్దాల రాజకీయం. ఎన్నో అనుభవాలను చూశారు. దేశంలో ప్రముఖ నాయకులతో మంచి పరిచయాలు కలిగి ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో ఒక వెలుగు వెలిగారు. ఆయనే రాయపాటి సాంబశివరావు. ఆయన పార్లమెంట్ సభ్యుడిగా తనదైన శైలిలో రాణించారు. ఆయన రాజకీయాల్లోకి రావడంతోనే పెద్దల సభకే నేరుగా వెళ్ళారు. రాజ్యసభ మెంబర్ 1980 దశకంలో కాంగ్రెస్ తరఫున నెగ్గిన ఆయన ఇక రాజకీయగా వెనక్కి చూసుకోలేదు.
ఎంపీగానే ప్రస్థానం :
ఆయన ఆ తరువాత లోక్ సభకు పోటీ చేస్తూ గెలిచి వచ్చారు. అలా గుంటూరు ఎంపీగా వరసగా నాలుగు సార్లు గెలిచారు. నరసరావుపేట నుంచి మరోసారి గెలిచారు. ఈ లెక్కన చూస్తే పాతికేళ్ళకు పైగా పార్లమెంట్ లో ఉన్న సభ్యుడిగా తనదైన రికార్డుని సృష్టించారు. అయితే కాంగ్రెస్ లో మకుటం లేని మహారాజుగా ఉంటూ గుంటూరు జిల్లా రాజకీయాలను శాసించిన రాయపాటి 2014 విభజన సమయంలో తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపీ అయ్యారు కానీ ఆ జోరు మాత్రం చూపించలేకపోయారు.
ఓటమి తరువాత సైలెంట్ :
ఇక 2019లో టీడీపీ తరఫున మరోసారి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసినా వైసీపీ ప్రభంజనంలో రాయపాటి ఓటమి పాలు అయ్యారు. దాంతో ఆయన రాజకీయం ఒక్కసారిగా బ్రేక్ పడినట్లు అయింది. తన రాజకీయ వారసులను రంగంలోకి దించాలని చూసినా కుదరలేదు. ఎమ్మెల్యేగా కుమారుడు పోటీ చేయాలనుకున్న సత్తెనపల్లి సీటు లభించలేదు. నరసారావుపేట ఎంపీ టికెట్ కి వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు దక్కించుకున్నారు. దాంతో రాయపాటి కుటుంబం అయితే ప్రస్తుతం మౌనంగానే ఉంది.
వైసీపీలోకి వెళ్తారా :
ఆ మధ్యన అయితే రాయపాటి కుటుంబం వైసీపీలోకి వెళ్తుంది అని ప్రచారం సాగింది. కానీ అవి ఒట్టి పుకార్లుగా తేలిపోయాయి. మరో వైపు చూస్తే వృద్ధాప్యం కారణంగా రాయపాటి ఇక రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు అదే సమయంలో ఆయన వారసుల నిర్ణయం వారికే ఒదిలిపెట్టారని చెబుతున్నారు.ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళకు పైగా వ్యవధి ఉంది కాబట్టి అప్పటికి ఒక నిర్ణయం వారు తీసుకుంటారు అని అంటున్నారు.
తీరని కోరికగా :
ఇవన్నీ పక్కన పెడితే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేయాలని రాయపాటికి ఒక కోరిక ఉండేది, 2014 నుంచి 2019 మధ్యన ఆయన ఎంపీగా కూడా ఉన్నారు. అయినా సరే ఆయన అనుకున్నది అప్పట్లో జరగలేదు. ఇపుడు కూడా 2024 లో ప్రభుత్వం టీడీపీది రావడంతో మరోసారి రేసులో ఉన్నారని వినిపించింది కానీ అది కుదరలేదు, దీంతో ఆయన రాజకీయంగా పూర్తి విరామం ప్రకటించినట్లే అని అంటున్నారు.