రాయలసీమలో ఐటీ పార్కులు ఎందుకు పెట్టరు...రాయలసీమ సీఎంలు 42 ఏళ్ళ పరిపాలన !
రాయలసీమ ఈ రోజుకీ వెనకబాటుతనంతో ఉంది అంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే మొత్తం 42 ఏళ్ళ పాటు అక్కడ నుంచే ముఖ్యమంత్రులు వచ్చి ఏపీని కానీ ఉమ్మడి ఏపీని కానీ పాలించారు.;
రాయలసీమ రాజకీయ అధికారానికి ఎపుడూ దగ్గరగానే ఉంది. పదవులు ఎపుడూ రాయలసీమను వరిస్తూ వచ్చాయి. ఉమ్మడి ఏపీ అయినా విభజన ఏపీలో అయినా రాయలసీమ నుంచే ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. మొత్తం ఉమ్మడి ఏపీ విభజన ఏపీలో చూసుకుంటే 69 ఏళ్ళ పాలనలో 42 ఏళ్ళ కాలం వారిదే. అంటే రాయలసీమ నుంచే ఈ కాలమంతా సీఎంలు వచ్చారు. మూడింట రెండు వంతులు అధికారంలో ఉంటూ రాయలసీమ సీఎంలు పాలించారు. ఇది నిజంగా గొప్ప రికార్డు. ఒక రీజియన్ నుంచి ఇంత మంది సీఎంలు రావడం అంటే ప్రత్యేకంగా చూడాలి. అదే సమయంలో ఇంత ఎక్కువ కాలం పాలించిన సీఎంలు రాయలసీమకు చేసినది ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తుంది.
రాయలసీమకు ఏమి న్యాయం జరిగింది :
రాయలసీమ ఈ రోజుకీ వెనకబాటుతనంతో ఉంది అంటే ఆలోచించాల్సిందే. ఎందుకంటే మొత్తం 42 ఏళ్ళ పాటు అక్కడ నుంచే ముఖ్యమంత్రులు వచ్చి ఏపీని కానీ ఉమ్మడి ఏపీని కానీ పాలించారు. అయితే వారి హయాంలో రాయలసీమలో కర్మాగారాలు కానీ పరిశ్రమలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఎందుకు రాలేదు అన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. అంతే కాదు ఐటీ పార్క్ ని ఒక్కటి కూడా రాయలసీమలో ఎందుకు స్థాపించలేకపోయారు అన్నది కూడా మరో పెద్ద ప్రశ్న. రాయలసీమకు చెందిన వారు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కాకూడదా, లేక వారికి స్థానికంగా ఉపాధి అవకాశాలు రాకూడదా. ఇది సీఎమలో రగులుతున్న ఆవేదనగా ఉంది.
ఇదీ సీమ నుంచి వచ్చిన సీఎంల వరస :
నీలం సంజీవరెడ్డి
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి వేరుపడి పదకొండు జిల్లాలతో 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మూడేళ్ళు తిరగకుండానే ఆనాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని కలుపుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది. ఇక ఉమ్మడి ఏపీ తొలి సీఎం గా రాయలసీమకే చెందిన నీలం సంజీవరెడ్డి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన 1956 నుంచి 1960 దాకా పాలించారు. అంతే కాదు ఈయననే మరోసారి 1962 నుంచి 1964 దాకా మళ్ళీ సీఎం గా పనిచేశారు. ఈసారి ఆయన డోన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గి వచ్చారు.
దామోదరం సంజీవయ్య
ఇక నీలం సంజీవరెడ్డి తరువాత దామోదరం సంజీవయ్య 1960 నుంచి 1962 వరకూ రెండేళ్ళ పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన రాయలసీమలోకి కర్నూల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయి ముఖ్యమంత్రి అయ్యారు.
కోట్ల విజయభాస్కరరెడ్డి :
ఈయన కూడా రాయలసీమ కర్నూలు అసెంబ్లీ సీటు నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి సీఎం అయిన వారే. ఈయన 1982 నుంచి 1983 మధ్యలో ముఖ్యమంత్రి గా ఉమ్మడి ఏపీలో పనిచేశారు. తిరిగి 1992 నుంచి 1994 మధ్యలో రెండేళ్ళ పాటు కోట్ల ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేశారు. ఆయన పాణ్యం నుంచి ఎమ్మెల్యేగా ఆ సమయంలో గెలిచారు.
నారా చంద్రబాబునాయుడు :
ఇదే వరసలో చూస్తే నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి గా సుదీర్ఘ కాలం పనిచేసిన వారిగా తెలుగునాట కనిపిస్తారు. ఆయన ఉమ్మడి ఏపీలో ఏకంగా తొమ్మిదిన్నరేళ్ళ కాలం పనిచేశారు. రాయలసీమలోని చిత్తూరు జిల్లా కుప్ప నుంచి బాబు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం గా ఉమ్మడి ఏపీలో రెండు సార్లు విభజన ఏపీలో రెండు సార్లు అధికారం అందుకున్నారు. 1995 నుంచి 2004 వరకూ ఉమ్మడి ఏపీలో అలాగే 2014 నుంచి 2019 దాకా విభజన ఏపీలో తిరిగి 2024 నుంచి ప్రస్తుతం ఏపీ సీఎం గా బాబు కొనసాగుతున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత ఎదురులేని నాయకుడిగా ఉన్న చంద్రబాబు రాయలసీమ నుంచి అత్యధికాలం పాలించిన సీఎం గా ఉన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి :
రాయలసీమ నుంచి వచ్చిన మరో నాయకుడు వైఎస్సార్ గా ప్రసిద్ధి చెందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన 2004 నుంచి 2009 దాకా ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయిదుంపావు ఏళ్ళ పాటు వైఎస్సార్ సీఎం గా తిరుగులేని అధికారంతో పనిచేశారు. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నుంచి ఎమెల్యేగా సుదీర్ఘ కాలం పనిచేశారు.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి :
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2010 నుంచి 2014 మధ్యలో మూడున్నరేళ్ళ పాటు ఉమ్మడి ఏపీకి సీఎం గా పనిచేశారు. ఆయన ఉమ్మడి ఏపీకి చిట్ట చివరి సీఎం గా కూడా ఉన్నారు. ఆయన చిత్తూరు జిల్లా పీలేరు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయ్యారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి :
వైఎస్సార్ వారసుడిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చిన జగన్ వైసీపీని స్థాపించి విభజన ఏపీలో అధికారం అందుకున్నారు. ఆయన 2019 నుంచి 2024 మధ్యలో అయిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన కడప జిల్లా పులివెందుల నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు వైసీపీకి అధినేతగా ఉంటూ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి తనకు తిరుగులేదని చాటిన జగన్ సీమ బిడ్డ అని అంతా మరింత గట్టిగా చెప్పుకునేవారు.
ఎన్ టీ రామారావు
నందమూరి తారకరామారావు సీమకు దత్తపుత్రుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన దాదాపుగా ఎనిమిదేళ్ళ పాటు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన రాయలసీమ నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1983లో తిరుపతి నుంచి మొదటి సారి నెగ్గిన ఎన్టీఆర్ 1984 నుంచి 1989 దాకా అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తిరిగి ఆయన 1994 డిసెంబర్ నుంచి 1995 ఆగస్టు దాకా ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన హిందూపురం నుంచే మరోసారి నెగ్గి సీఎం పదవిని అందుకున్నారు.
నాలుగు దశాబ్దాలు పైగా ఏలినా :
ఇలా లెక్క చూసుకుంటే రాయల సీమ నుంచి గెలిచి సీఎంలు అయిన వీరంతా నాలుగు దశాబ్దాలకు పైగా ఏపీని ఏలినా రాయలసీమ అభివృద్ధి మాత్రం సాధ్యపడలేదని అంటున్నారు. ఈ రోజుకీ తాగు నీరు సాగునీరు సమస్య అలాగే ఉంది. సరైన పరిశ్రమలు లేవు. ఐటీ పార్క్ ని అక్కడ ఏర్పాటు చేయాలన్న ఆలోచన సైతం ఎవరూ చేయలేకపోతున్నారు. భారీ పరిశ్రమలు అంటే కోస్తా వైపే పాలకులు వేలు చూపిస్తున్నారు నారు. మరి ఎందుకో సీమను అలా వదిలేశారు దాంతో ఈ రోజుకీ అత్యంత వెనకబడిన ప్రాంతంగా సీమ నిలిచి ఉంది. సీమ ఓట్లతో గెలిచి సీమకు న్యాయం చేయకపోతే ప్రజలు ఎవరితో చెప్పుకుంటారు అన్నదే ప్రశ్న. సీమకు సీఎం పదవులు దక్కుతున్నాయి. కానీ అక్కడ మాత్రం దైన్యం వీడడం లేదు అంటే ఇది కదా అసలైన రాజకీయ చిత్రం అనిపించకమానదు. ఈ పాపాలకు శాపాలకు కారణం ఎవరు అన్నదే సీమ జనులు సంధించే అసలైన ప్రశ్న. దీనిని జవాబు కూడా తెలుసు. కానీ ఇన్ని దశాబ్దాల తరువాత ఇప్పటికైనా సీమ ప్రగతికి పరిష్కారాలు చూపిస్తేనే సార్ధకత ఉంటుంది.