ఆకాశంలో అద్భుతం

సంపూర్ణ చంద్ర గ్రహణం ఈ దశాబ్దంలోనే ఒక అరుదైన సంఘటన గా నిలవనుంది. ఆకాశంలో అద్భుతాన్ని ఆవిష్కరించనుంది.;

Update: 2025-09-07 19:20 GMT

సంపూర్ణ చంద్ర గ్రహణం ఈ దశాబ్దంలోనే ఒక అరుదైన సంఘటన గా నిలవనుంది. ఆకాశంలో అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. ఆదివారం రాత్రి ఖగోళ శాస్త్రంలోనే వినూత్నమైన అనుభూతిని కలగ చేయనుంది. ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం విశిష్టత ఏమిటి అంటే ప్రపంచం మొత్తం మీద ఏకంగా 80 శాతం ప్రాంతాలకు కనిపించడమే. అంతే కాదు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వీక్షకులకు సైతం ఒక అద్భుతమైన ప్రదర్శన కాబోతోంది.

సుదీర్ఘమైన గ్రహణం :

ఈసారి వచ్చిన చంద్ర గ్రహణం సంపూర్ణమైనది. అంతే కాదు ఇది ఈ దశాబ్దానికే అతి పొడవైనది, సుదీర్ఘమైనది. ఈ గ్రహణం ఏకంగా 82 నిముషాల పై దాటి ఉంటుంది. గ్రహణం ఈ రాత్రి రాత్రి 8:58 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 2:25 గంటలకు ముగుస్తుంది. ఈ గ్రహణం దశాబ్దంలో అత్యంత పొడవైన వాటిలో ఒకటి, మొత్తం 82 నిమిషాలు ఉంటుంది మొత్తం సంఘటన ఐదు గంటలకు పైగా ఉంటుంది.అంతే కాదు ఇది చాలా దేశాలకు సుస్పష్టంగా కనిపిస్తుంది. భారత దేశం వాసులకు ఈ గ్రహణం బాగా ఈసారి కనిపిస్తుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు వంటి నగరాలతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, తూర్పు ఆఫ్రికా, యూరప్‌లోని కొన్ని ప్రాంతాలతో సహా భారతదేశం అంతటా గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

భూమి నీడలోనే :

ఈ గ్రహణం సమయంలో చంద్రుడు భూమి నీడలో దాదాపుగా గంటన్నర పాటు ఉంటాడు. ఇది నిజంగా ఒక అరుదైన సందర్భంగా చెబుతున్నారు. చంద్ర గ్రహణాలు మామూలుగా ఎలా ఏర్పడుతాయి అంటే భూమి సూర్యుడు చంద్రుల మధ్యకు వచ్చి చంద్రుడిపై ఆ నీడ పడినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. ఇది ఈ ఏడాది చివరిలో వచ్చిన రెండవ గ్రహణం. చివరి గ్రహణం కూడా అని చెబుతున్నారు.

గ్రహణ సమయంలో నిషిద్ధం :

గ్రహణాల సమయంలో చాలా వాటికి నిషిద్ధం ఉంటుంది. ఆధ్యాత్మిక భాషలో దాన్ని సూతక కాలం అంటారు. అంటే గ్రహణం ఏర్పడడానికి ముందు పన్నెండు గంటల ముందే ఆ సూత కాలం మొదలవుతుంది. దేశంలోని ఆలయాలు అన్నీ ఆదివారం మధ్యాహ్నం 12.57 గంటల నుంచి మూసివేశారు. తెలుగు నాట చూస్తే ఆదివారం మధ్యాహ్నం 3.30 నుంచి సోమవారం తెల్లవారుజాము 3 గంటల వరకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యాహవాచనం నిర్వహిస్తారు. అదే విధంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అలయంతో పాటు ఉప ఆలయాలన్నింటినీ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవరం ఉదయం వరకూ మూసివేశారు.

శాస్త్ర ప్రకారం చూస్తే :

ఆధ్యాత్మిక ప్రకారం చూస్తే గ్రహణాలు అశుభకరంగా చెబుతారు. ఆ గ్రహణ సమయంలో ఏమీ చేయరాదు అని నిషిద్ధం విధిస్తారు. ఇది నమ్మకాలు ఆచారాలకు సంబంధించిన విషయం కాబట్టి ఆ సెంటిమెంట్లను గౌరవించాల్సిందే. అదే సమయంలో సైన్స్ ఏమి చెబుతోంది అంటే ఇది సాధారణ ప్రక్రియ అని. ఎందుకంటే ఖగోళ శాస్త్రంలో గ్రహణాలు ఏర్పడడం ఒక సర్వ సాధారణమైన ప్రక్రియగా భావిస్తారు. మామూలుగా చూస్తే ఖగోళంలో సూర్యుడు, చంద్రుడు భూమి ఉంటాయి. ఇక సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాడు. అలాగే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యడు చుట్టూ తిరుగుతుంది. ఇక చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టూ తిరుగుతాడు. ఇలా మూడు తిరుగుతున్నప్పుడు ఒకానొక సమయంలో ఒకే వరుసలోకి వస్తాయి అన్నది సైన్స్ ప్రకారం చెబుతున్న విషయం.

అలా . సూర్యుడు వెలుగు నేరుగా చంద్రుడిపై పడకుండా భూమి మధ్యలోకి అడ్డుగా వస్తుంది. అప్పుడు చంద్రుడు పూర్తిగా కనిపించకుండా పోతాడు. దాన్నే చంద్ర గ్రహణంగా ఖగోళ శాస్త్రం పేర్కొంటుంది. ఇలా జరిగే ప్రక్రియ వల్ల ఈ గ్రహణాలు ఎవరి ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం చూపదని సైంటిస్టులు చెబుతారు. అనవసరమైన ఆచారాలు, పద్ధతులు పాటించాల్సిన అవసరం లేదని వారు పేర్కొంటారు. అయితే సూర్యుడుని చంద్రుడిని దేవుళ్ళుగా ఆరాధించే హిందూ సంప్రదాయంలో గ్రహణాల వేళ పద్ధతులు అన్నీ విధిగా పాటిస్తారు. గ్రహ శాంతులు కూడా చేస్తారు. గ్రహణం విడిచిన తరువాత ఆలయాలకు వెళ్ళి తమ రాశులకు గ్రహణం పట్టిందని గ్రహ నివారణ కోసం దోష పరిహారార్ధం చేయాల్సిన కార్యక్రమాలు చేస్తారు. ఏది ఏమైనా ఈసారి చంద్రగ్రహణం మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోంది అని చెప్పాల్సి ఉంది.

Tags:    

Similar News