మార్పు దిశ‌గా రాప్తాడు.. స‌క్సెస్ మంత్రం ఎవ‌రిది?

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాలు చాలానే క‌నిపిస్తున్నాయి.

Update: 2026-08-18 17:30 GMT

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాలు చాలానే క‌నిపిస్తున్నాయి. వీటిలో ముందు వ‌రుసులో ఉన్న నియోజ‌క‌వ‌ర్గం.. రాప్తాడు. ఇక్క‌డ నుంచి ప్ర‌స్తుతం ప‌రిటాల సునీత ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. 2019లో ఆమె ఓడిపోయినా.. గ‌త ఎన్నిక‌ల్లో కూట‌మి హ‌వా నేప‌థ్యానికి తోడు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేపై ఉన్న వ్య‌తిరేక‌త కూడా సునీత‌కు క‌లిసి వ‌చ్చింది. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లోనే ఆమె పోటీకి విముఖ‌త వ్య‌క్తం చేశారు. త‌మ వార‌సుడు శ్రీరాంకు టికెట్ ఇవ్వాల‌ని సూచించారు.

కానీ.. పోటీ తీవ్రంగా ఉన్న నేప‌థ్యంలో సునీత వైపే అప్ప‌ట్లో చంద్ర‌బాబు మొగ్గు చూపించారు. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఖ‌చ్చితంగా మార్పు చేసే ఎమ్మెల్యేల జాబితాలో సునీత పేరు ముందు వ‌రుస‌లో ఉంది. దీంతో శ్రీరాంకు టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. మ‌రి ఈ నేప‌థ్య‌లో నియోజ‌క‌వ‌ర్గంలో ఎలాంటి ప‌రిస్థితి ఉంది? ఆయ‌న ఏం చేస్తున్నారు? అనే విష‌యాల‌పై పార్టీ ప‌రంగా అంచ‌నా వేసుకుంటున్నారు. ఇప్ప‌టికే అనంత‌పురం జిల్లాలోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల నివేదిక‌ల‌ను చంద్ర‌బాబు తెప్పించుకున్న‌ట్టు తెలిసింది.

దూకుడు త‌గ్గింది..!

ప‌రిటాల శ్రీరాం..యువ‌నేత‌గా గ‌తంలో దూకుడు ప్ర‌ద‌ర్శించారు. అంతేకాదు.. త‌న‌కు ధ‌ర్మ‌వ‌రం టికెట్ కావాల‌ని ప ట్టుబ‌ట్టారు. కానీ, దీనిని బీజేపికి రిజ‌ర్వ్ చేసేసిన నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ దీనిని ఆ పార్టీకే కేటాయించే అవకాశం ఉంది. దీంతో రాప్తాడుపై దృష్టి పెట్టారు. కానీ, గ‌తంలో ఉన్న దూకుడు త‌గ్గించారు. ఇది పార్టీప‌రంగానే కాకుండా.. శ్రీరాంకు వ్య‌క్తిగ‌తంగా కూడా మేలు చేస్తోంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఇంటింటికీ టీడీపీ కార్య క్రమాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. నాయ‌కులతోనూ క‌లివిడిగా ఉంటున్నారు.

ఓటు బ్యాంకుగా మారాలి..!

రాప్తాడులో ప‌రిటాల ఫ్యామిలీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకు ఉంది. అయితే.. తొలిసారి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ఖాయ‌మ‌నే మాట వినిపిస్తున్న నేప‌థ్యంలో యువ‌నేత‌గా త‌న ఓటు బ్యాంకును కూడా క్రియేట్ చేసుకోవాల్సిన అవ‌స‌రం శ్రీరాంకు ఏర్ప‌డింది. యువ‌త‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంతో పాటు.. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకును కూడా ఒడిసి ప‌ట్టుకునే వ్యూహాలు వేయాలి. కేవ‌లం జెండా మోయ‌డమే కాదు.. మోస్తున్న వారిని గుర్తించాలి. దిగువ స్థాయి కార్య‌క‌ర్త‌ల‌కు కూడా చేరువ కావాలి. ఇలా.. ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తే.. భారీ మెజారిటీతో శ్రీరాం గెలిచేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్న అంచ‌నాలు వ‌స్తున్నాయి.

Tags:    

Similar News