'రీల్'లో కోట్లు.. రియాలిటీలో రోకలిపోటు... ఒకే ఒక్క ఫేక్ వీడియోతో జీవితాలు నాశనం
సోషల్ మీడియా వచ్చాక ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్.. దానికి తోడు ఉచితంగా దొరికే డేటా చేరిపోయాయి.
సోషల్ మీడియా వచ్చాక ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్.. దానికి తోడు ఉచితంగా దొరికే డేటా చేరిపోయాయి. దానికంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే.. తలలో కనీస ‘కామన్ సెన్స్’ లేని కొందరు వ్యక్తుల చేతికి ఈ డిజిటల్ జ్ఞానం చిక్కడం.. లైక్స్, వ్యూస్ కోసం నెట్‌లో ఏది పడితే అది పోస్ట్ చేసే వాళ్లు ఒకవైపు ఉంటే ఆ చెత్తను వేదవాక్కులా నమ్మి దారుణాలకు ఒడిగట్టే "మేధావులు" మరొకవైపు ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఒక భయంకరమైన అదే సమయంలో విస్తుగొలిపే ఘటన ఈ సామాజిక మాధ్యమాల పైత్యానికి పరాకాష్ఠగా నిలిచింది.
రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోదామని..
అసలేం జరిగిందంటే.. సోషల్ మీడియాలో ఏ మహానుభావుడు అప్‌లోడ్ చేశాడో గానీ ఒక రీల్ నెట్‌లో బాగా వైరల్ అయింది. మగవారి ప్రైవేట్ పార్ట్స్ ఒక్కొక్కటి బ్లాక్ మార్కెట్‌లో ఏకంగా రూ.1.2 కోట్లకు అమ్ముడవుతాయనేది ఆ వీడియో సారాంశం. సాధారణంగా ఇలాంటి పిచ్చి వీడియోలు చూస్తే ఎవరైనా నవ్వి ఊరుకుంటారు, లేదా స్క్రోల్ చేసి పక్కకు వెళ్ళిపోతారు. కానీ భోపాల్‌కి చెందిన 20 ఏళ్ల జోహెబ్ ఖాన్ అనే రత్నానికి మాత్రం ఆ వీడియోలో ‘స్వర్గం’ కనిపెట్టినంత పనైంది. కష్టపడకుండా రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోవచ్చనే దివ్యమైన ఆలోచన అతడి బుర్రలో పుట్టింది.
తాను ఒక గొప్ప వైద్య విద్యార్థినని ఊరంతా బిల్డప్ ఇచ్చుకునే ఈ జోహెబ్ ఖాన్.. తన మాటలతో 18 ఏళ్ల ఆమిర్ ఖురేషితో పాటు మరికొందరు మైనర్లను కూడా ఈ క్రిమినల్ గ్యాంగ్‌లోకి లాగాడు. "ఒక్కొక్క పార్ట్ అమ్మితే రూ. 1.2 కోట్లు రాబోతున్నాయిరా బాబు, ఇక మన జీవితాలు సెట్.." అని వాళ్లకు కలలు చూపెట్టాడు. ఈ పచ్చి అబద్ధాన్ని గుడ్డిగా నమ్మేసిన ఈ గ్యాంగ్.. తమ ప్లాన్ అమల్లో పెట్టడానికి ఒక 17 ఏళ్ల అమాయక బాలుడిని టార్గెట్ చేసింది.
రీల్స్ వర్సెస్ రియాలిటీ.. సీన్ అడ్డంగా రివర్స్
ఆగస్టు 6న పథకం ప్రకారం ఆ బాలుడిని కిడ్నాప్ చేసి.. దారుణంగా హత్య చేశారు. అనంతరం అనుకున్నట్లుగానే శరీరం నుండి అవయవాలను తొలగించి.. వాటిని బ్లాక్ మార్కెట్‌లో అమ్మి కోట్లు నొక్కేద్దామని ప్రయత్నించారు. అయితే అప్పుడే అసలు సినిమా మొదలైంది. నెట్‌లో చూసిన రీల్స్ వేరు.. బయట రియాలిటీ వేరు అని పాపం ఆ మేధావులకు అప్పటికప్పుడు అర్థం కాలేదు. తీరా అవయవాలను పట్టుకుని మార్కెట్‌లోకి వెళ్దామంటే.. అసలు వాటిని కొనే నాథుడే లేడు.. పోనీ వైద్యపరంగా చూసినా అది సాధ్యపడే పని కాదని.. ఆ వైరల్ వీడియో పచ్చి అబద్ధమని తెలుసుకునే సరికి వారి మైండ్ బ్లాంక్ అయిపోయింది.
చేసేదేమీ లేక సాక్ష్యాలు దొరక్కుండా శవాన్ని ఆగస్టు 10న ఒక చెరువులో పడేసి చేతులు దులుపుకోవాలని చూశారు. కానీ మన పోలీసులు డిటెక్టివ్‌ల కంటే స్పీడ్‌గా రంగంలోకి దిగారు. చెరువులో మృతదేహం లభించిన కొద్ది గంటల్లోనే కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు, ఈ డిజిటల్ వీరుల భాగోతమంతా బయటపడింది. పోలీసులు నిందితులందరినీ క్యూలో నిలబెట్టి కటకటాల వెనక్కి నెట్టారు.
కామన్ సెన్స్ వాడకపోతే కటకటాలే గతి!
లగ్జరీ కార్లు, బంగ్లాలు కొందామని కన్న కలలన్నీ ఇప్పుడు జైలు గోడల మధ్య కరిగిపోయాయి. రూ.1.2 కోట్లు సంపాదిద్దామని అనుకున్న ఈ ముఠా.. ఇప్పుడు జైలు కూడు తింటూ జీవితాంతం పశ్చాత్తాపపడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది.
సోషల్ మీడియాలో డబ్బులు, డిపాజిట్లు, అవయవాల విక్రయం, క్షణాల్లో ధనవంతులు కావడం లాంటి సంచలనాత్మక వీడియోలు వస్తే.. వాటిని కనీసం ప్రాథమిక పరిజ్ఞానంతో ఆలోచించాల్సిన బాధ్యత నెటిజన్లపై ఉంది. స్క్రీన్ మీద కనిపించే ప్రతి చెత్తను నమ్ముతూ పోతే ఇలాగే జీవితాలు నడిరోడ్డుపై పడతాయని భోపాల్ ఘటన సమాజానికి ఒక గట్టి హెచ్చరికలా నిలిచింది.