బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. అసాధ్యమని తెలిసి ప్రభుత్వ నిర్ణయం! చంద్రబాబు వ్యూహమేంటి?

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

Update: 2026-08-18 16:30 GMT

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నిర్ణయం అమలు చేయడం అసాధ్యమని తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకే వెళ్లాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశం అవుతోంది. ఎన్నికల హామీని అమలు చేస్తామని నిరూపించుకునేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని చెబుతున్నారు. ప్రస్తుతం అన్నివర్గాలకు కలిసి 50 శాతానికి దగ్గర్లో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని అంటున్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచాలంటే, ప్రస్తుత పరిస్థితుల్లో అదనంగా 3 నుంచి 4 శాతం పెంచే వీలుందని అంటున్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 11 శాతం పెంచి 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భావించడం పెద్ద సాహసంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత అనుభవాలు, తెలంగాణ స్థానిక ఎన్నికల ముందు ఎదురైన పరిణామాలు పరిశీలిస్తే ఈ విషయంపై స్పష్టత వస్తుందని అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేసిందని, ఆ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిందని గుర్తు చేస్తున్నారు. అయితే కోర్టు జోక్యం చేసుకుని 50 శాతం రిజర్వేషన్లు దాటుతున్నాయనే కారణంతో ఎన్నికల నోటిఫికేషన్ కొట్టివేసిందని చెబుతున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేసినా కోర్టుల్లో నిలిచే అవకాశం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో వెనక్కి తగ్గకూడదు అన్నట్లుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని చెబుతున్నారు. కోర్టులలో నిలబడదని తెలిసి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ లక్ష్యాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఎన్నికల్లో హామీ ఇచ్చామని, ఇప్పుడు కోర్టులు అడ్డుకుంటాయనే అనుమానంతో ఆ దిశగా ప్రయత్నించకుండా ఎన్నికలకు వెళితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, విపక్షానికి అవకాశం కల్పించిన పరిస్థితి వస్తుందనే ఆలోచనతో ప్రభుత్వం మొండిగా 34 శాతం రిజర్వేషన్ల అంశంపై ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

పంచాయతీ రాజ్ చట్టంలో రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు ఉందని కారణం చూపుతూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా ఎలా చూస్తారనేది ప్రశ్నకు ప్రభుత్వం నుంచి జవాబు లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ప్రభుత్వ జీవో ప్రకారం ఎన్నికలకు వెళితే, అక్టోబరులో ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎవరైనా కోర్టుకు వెళితే, తెలంగాణ మాదిరిగా ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడొచ్చని అంటున్నారు. అప్పుడు మళ్లీ పాత రిజర్వేషన్ రోస్టర్ మేరకే ఎన్నికలు నిర్వహించాల్సివుంటుందని అంటున్నారు. ఏదిఏమైనా ఎన్నికల హామీపై విమర్శలు లేకుండా చూసుకునేందుకే కూటమి ప్రభుత్వం రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి ఈ నిర్ణయం అధికారికంగా అమలయ్యే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News