ఆ విష‌యంలో జ‌గ‌న్ నెంబ‌ర్ 1: చంద్ర‌బాబు

రాష్ట్రంలో బీసీల‌కు భారీ ప్ర‌యోజ‌నం క‌ల్పించే 34 శాతం రిజ‌ర్వేష‌న్ ను అమ‌లు చేసేందుకు కూట‌మి స‌ర్కారు సిద్ధ‌మైంది.

Update: 2026-08-18 17:06 GMT

రాష్ట్రంలో బీసీల‌కు భారీ ప్ర‌యోజ‌నం క‌ల్పించే 34 శాతం రిజ‌ర్వేష‌న్ ను అమ‌లు చేసేందుకు కూట‌మి స‌ర్కారు సిద్ధ‌మైంది. తాజాగా సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యించారు. అనంత‌రం ఈ విష‌యంపై అసెంబ్లీలో చ‌ర్చ‌కు పెట్టారు. ఈ సంద‌ర్భంగా సీఎం స‌హా ప‌లువురు మంత్రులు బీసీ రిజ‌ర్వేష‌న్ అంశంపై ప్ర‌సంగించారు. బీసీల‌కు అండ‌గా ఉన్న ప్ర‌భుత్వం త‌మ‌దేన‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. స్థానిక సంస్థ‌ల్లో రిజ‌ర్వేష‌న్ల‌ను 34 శాతం అమ‌లు చేయ‌డం ద్వారా బీసీల ఆత్మ‌గౌర‌వం, రాజ‌కీయ అధికారం కూడా మ‌రింతగా పెరుగుతాయ‌ని పేర్కొన్నారు.

అతి పెద్ద నిర్ణ‌యం!

బీసీల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు రిజ‌ర్వేష‌న్ పెంపు నిర్ణ‌యం అతి పెద్ద‌ద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చామ‌ని అమ‌లు చేయ‌డం లేద‌ని.. దీనిని రాజ‌కీయ సిద్ధాంతంగానే తాము ప‌రిగ‌ణిస్తున్నామ‌ని తెలిపారు. ఒక్కొక్క సారి హామీలు ఇవ్వ‌కుండా కూడా అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. ``స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయం. ప్రతి బీసీ కుటుంబం గర్వంగా చెప్పుకొనే రోజు`` అని స‌భ్యుల క‌ర‌తాళ ధ్వ‌నుల మ‌ధ్య చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని తెలిపారు. వారికి అన్ని రూపాల్లోనూ త‌మ ప్ర‌భుత్వం అండ‌గా ఉంద‌న్నారు. ఇది సిద్ధాంతంతో ముడిప‌డిన అంశ‌మ‌ని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ నుంచి..

బీసీ స‌మాజాన్ని కొన్నిపార్టీలు ప‌క్క‌న పెట్టాయ‌ని.. గ‌త ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్ పాల‌న‌ను చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. బీసీల‌ను కేవ‌లం ఓటు బ్యాంకుగానే వాడుకుని.. వారిని రాజ‌కీయంగా దూరంగా ఉంచార‌ని తెలిపారు. కానీ.. 1983లో ఎన్టీఆర్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. బీసీల‌కు ప్రాధాన్యం పెరిగింద‌న్నారు. వారికి ప‌ద‌వులు ఇచ్చార‌ని.. టికెట్ల నుంచి అవ‌కాశాల వ‌ర‌కు అన్నీ బీసీల‌ను వెతుక్కుంటూ వెళ్లాయ‌న్నారు. 1995లో బీసీలకు ఉన్న 20 శాతం రిజర్వేషన్లను 34 శాతానికి పెంచిన‌ట్టు చెప్పారు. అయితే.. దీనిపై కొంద‌రు కోర్టుకు వెళ్లార‌ని.. ఫ‌లితంగా నాటి ఫ‌లాలకు బీసీలు దూర‌మ‌య్యార‌ని తెలిపారు.

జ‌గ‌న్ నెంబ‌ర్ 1

ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో స‌వాల్ చేయ‌కుండా అన్యాయం చేసింద‌ని.. బీసీల‌కు రాజ్యాధికారంతో పాటు ఆత్మ‌గౌరవాన్ని సైతం దూరం చేసింద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. బీసీలకు ద్రోహం చేయడంలో జగన్‌ నంబర్ 1గా ముద్ర వేసుకున్నార‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మ‌ళ్లీ బీసీల‌కు 34 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని తెలిపారు. ఈ మేర‌కు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింద‌ని స‌భ‌కు వివ‌రించారు.

Tags:    

Similar News