ఆ ఎమ్మెల్యే ఆశలు గల్లంతు చేసిన రేవంత్ రెడ్డి..?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఒకే ఒక్క కామెంట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఒకే ఒక్క కామెంట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్ ఆ ఒక్క మాటతో తన మనసులో ఉన్న మాటతో పాటు చాలా మందికి క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఆ ఒక్క సీటు మీద ఆశలు పెట్టుకున్న వారి ఆశలు గల్లంతైపోయాయి. అసలు విషయంలోకి వెళితే రేవంత్ రెడ్డి తాజాగా వరంగల్ జిల్లా పర్యటనలో ఒక బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి పరకాల నుంచి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేవూరి ప్రకాశ్‌రెడ్డే పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చేశారు. ఇక్కడే మంత్రి కొండా దంపతులకు సెగ పెట్టేసినట్లయ్యింది.
పరకాల కొండా దంపతులకు సొంత నియోజకవర్గం. అయితే కొండా సురేఖ 2014 ఎన్నికల్లో పరకాల నుంచి తూర్పు నియోజకవర్గానికి మారి అక్కడ గెలిచారు. 2018లో కాంగ్రెస్ నుంచి ఓడిపోయినా... గత ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి గెలిచి ఈ సారి రేవంత్ కేబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డితో కొండా దంపతలుకు టర్మ్స్ సరిగా లేవు. సురేఖ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్నా పరకాల మీద పట్టుకోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డితో చీటికిమాటికి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. సురేఖ అయితే.. ప్రకాశ్‌రెడ్డికి ఫోన్లో వార్నింగులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. రేవంత్ పరకాలలో జోక్యం వద్దని చెప్పినా కూడా కొండా దంపతులు మాత్రం వినడం లేదు.
వచ్చే ఎన్నికల్లో తాను తూర్పు నుంచి పోటీ చేసి కుమార్తె సుస్మితా పటేల్‌ను పరకాల బరిలో దింపుతామని అనధికారిక ప్రకటనలు చేసుకుంటూ వస్తున్నారు. ఇది అక్కడ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డికి సైతం ఇబ్బందిగానే మారింది. ఇక తాజాగా రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి మళ్లీ ప్రకాష్ అన్నే పోటీ చేస్తారని చెప్పడంతో కొండా దంపతుల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. కొండా కుమార్తెకు పరకాలలో చోటు లేదని రేవంత్ చెప్పకనే చెప్పినట్లయ్యింది. కొండా దంపతుల ఆలోచనకు భిన్నంగా రేవంత్ ఆలోచన ఉందని క్లారిటీ వచ్చేసింది.
ఒక వేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆ లెక్క వేరు.. అప్పుడు కొండా కుమార్తెకు సీటు వస్తుందేమో గాని ఇప్పుడు అయితే ఆ ఛాన్స్ లేదని రేవంత్ చెప్పేశారు. అయితే రేవంత్ ప్రకటనపై కొండా దంపతులు భగ్గుమంటున్నారట. సీట్లు డిసైడ్ చేసేది కాంగ్రెస్ అధిష్టానం అని.. ఆ విషయంలో ముఖ్యమంత్రికి సంబంధం ఏంటని ఫైర్ అవుతున్నారట. ఏదేమైనా వరంగల్ కాంగ్రెస్‌లో తేనెతుట్టెను రేవంత్ మరింత రాజేసినట్లయ్యింది. ఈ వివాదానికి ఎప్పుడు ? ఎలా ఫుల్‌స్టాప్ పడుతుంది ? కొండా దంపతులు ఏం చేస్తారన్నది చూడాలి.