రన్యారావు బంగారు స్మగ్లింగ్ లో భారీ ట్విస్టు

రన్యారావు గుర్తున్నారా? మర్చిపోతే.. ఈ ఒక్క లైన్ చదివితే ఆమె ఇట్టే గుర్తుకు వచ్చేస్తారు. అదేనండి.. దుబాయ్ నుంచి కేజీల కొద్దీ బంగారాన్ని సీక్రెట్ గా తీసుకొస్తూ అడ్డంగా దొరికిపోయారే.. ఆవిడే.;

Update: 2025-05-23 04:08 GMT

రన్యారావు గుర్తున్నారా? మర్చిపోతే.. ఈ ఒక్క లైన్ చదివితే ఆమె ఇట్టే గుర్తుకు వచ్చేస్తారు. అదేనండి.. దుబాయ్ నుంచి కేజీల కొద్దీ బంగారాన్ని సీక్రెట్ గా తీసుకొస్తూ అడ్డంగా దొరికిపోయారే.. ఆవిడే. ఇప్పుడు కచ్ఛితంగా గుర్తుకు వచ్చి ఉంటారు. తాజాగా ఆమె కేసును విచారిస్తున్న ఈడీ సంచలన అంశాల్ని గుర్తిస్తోంది. దీంతో.. ఈ కేసు మరింత పెద్దది అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా వెలుగు చూసిన ఉదంతం ఏమంటే.. ఆమె పెళ్లి వేళలో రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ రూ.25 లక్షల వరకు నగదుతో పాటు బహుమతుల్ని కూడా ఇచ్చినట్లుగా ఎన్ ఫోర్స మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించినట్లుగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో పరమేశ్వర్ కు తమకూరులో విద్యా సంస్థలు ఉన్నాయి. రన్యారావుకు భారీ ఎత్తున ఇచ్చిన నగదుతో పాటు.. ఆమె క్రెడిట్ కార్డు బిల్లుల్ని సదరు విద్యా సంస్థ (సిద్ధార్థ గ్రూపు విద్యా సంస్థలు) చెల్లించినట్లుగా గుర్తించారు. తాజాగా ఈ విద్యా సంస్థ మీద నిర్వహించిన దాడుల్లో ఈ కొత్త అంశాలు వెలుగు చూశాయి. పరమేశ్వర్ కు చెందిన మొత్తం 16 చోట్ల దాడులు.. సోదాలు నిర్వహించినట్లుగా ఈడీ అధికారులు వెల్లడించారు. రన్యారావుకు చెందిన క్రెడిట్ కార్డు బిల్లులు దాదాపు రూ.40 లక్షల వరకు ఈ విద్యా సంస్థల నుంచే చెల్లింపులు జరిపిన వైనం వెలుగు చూసింది.

మరోవైపు రన్యారావు పెళ్లి సందర్భంగా మంత్రి భారీగా నగదు బహుమతిగా ఇవ్వటాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ.. దాన్నో చిన్న విషయంగా తేల్చేయటం విశేషం. ‘రన్యారావు తండ్రి సీనియర్ ఐపీఎస్ అధికారి కావటం.. పరమేశ్వర్ హోం మంత్రిగా ఉండటంతో.. ఆ అనుబంధంతో బహుమతి ఇస్తే తప్పేముంది? రన్యారావు తప్పు చేసి అరెస్టు అయ్యారు. పరమేశ్వర్ ఎలాంటి తప్పు చేయరనే నమ్మకం నాకుంది’ అని డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు.

ఈడీ దాడుల నేపథ్యంలో హోం మంత్రి పరమేశ్వర్ ను ప్రశ్నించగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈడీ అధికారుల విచారణలో అన్ని విషయాలు వెలుగు చూస్తాయి. ఆ అధికారులు వివరణ అడిగితే చెబుతా’ అంటూ అసలు సమాధానాన్ని చెప్పకుండా దాటవేయటం ఆసక్తికరంగా మారింది. తమ విద్యా సంస్థలు జరిపే ప్రతి లావాదేవీకి లెక్క ఉంటుందని.. ఈడీ జరిపిన దాడుల సందర్భంలో అధికారులకు పూర్తిగా సహకరించాలని విద్యాసంస్థల నిర్వహణ బాధ్యతను నిర్వహించే వారికి తాను చెప్పినట్లుగా కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర్ వెల్లడించారు.

ఈడీ దాడులపై కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు రణదీప్ సూర్జేవాలా స్పందిస్తూ.. దళిత నేత కావటంతో ఆయన్ను టార్గెట్ చేసినట్లుగా వ్యాఖ్యానిస్తే.. హోం మంత్రి పరమేశ్వర్ మాత్రం అందుకు భిన్నంగా.. ‘నేను దళితుడ్ని కావటంతోనే దాడులు జరిగాయని భావించటం లేదు’ అని పేర్కొనటం గమనార్హం. తాజా పరిణామాలపై విపక్ష నేత ఆర్.అశోక్ కీలక వ్యాఖ్య చేశారు. అక్రమ మార్గంలో రన్యారావు సంపాదించిన నగదును సిద్ధార్థ విద్యా సంస్థల్లో మదుపు చేస్తోందని ఆరోపణలు కొత్త సంచలనంగా మారాయి.

ఇక.. రన్యారావు విషయానికి వస్తే.. దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్ పోర్టులో దొరికిపోయిన ఆమె.. కొంతకాలం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అదుపులో ఉన్నారు. ఆ తర్వాత పరప్పన అగ్రహార జైలుకు షిఫ్టు చేశారు. ఆర్థిక నేరాల్ని విచారించే ప్రత్యేక కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. కాపిఫోనా చట్టం కింద ఆమె జైలు నుంచి విడుదల కావటం సాధ్యం కాలేదు. దీంతో ఉన్నత న్యాయస్థానంలో మరో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు రన్యారావు. ఈ కేసు విచారణ జూన్ మూడుకు వాయిదా పడింది. ఇంతలోనే ఈ కొత్త అంశం వెలుగు చూడటం గమనార్హం.

Tags:    

Similar News