ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు: ఈడీ విచారణకు రానా దగ్గుబాటి తాత్కాలిక విరామం

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి వాయిదా వేయాలని కోరారు.;

Update: 2025-07-23 07:42 GMT

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి వాయిదా వేయాలని కోరారు. జూలై 23న విచారణకు హాజరుకావాల్సి ఉన్న రానా, తన సినిమా షూటింగ్‌ల కారణంగా హాజరుకాలేనని ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. దీనిపై అధికారులు త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామని పేర్కొన్నారు.

ఈ కేసులో రానా మాత్రమే కాకుండా పలువురు సినీ ప్రముఖుల పేర్లు ఈడీ విచారణలో బయటపడుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌కు జూలై 30న, యువ హీరో విజయ్ దేవరకొండకు ఆగస్టు 6న, నటి మంచు లక్ష్మికి ఆగస్టు 13న హాజరు కావాలని నోటీసులు పంపారు. వీరంతా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను బ్రాండ్ డీల్స్ లేదా డిజిటల్ ప్రమోషన్ల ద్వారా ప్రచారం చేసినట్లు సమాచారం.

ఈడీ ఇప్పటికే ఈ కేసులో ఈసీఐఆర్‌లు (ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేసింది. ప్రముఖులు ప్రచారం చేసిన ఈ యాప్‌లు దేశంలోని చట్టబద్ధమైన ఆర్థిక నిబంధనలకు విరుద్ధంగా పనిచేసి ఉండవచ్చన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. డబ్బు ప్రవాహం, కాంట్రాక్టు వివరాలు, ఫైనాన్షియల్ రూల్స్ ఉల్లంఘన వంటి అంశాలపై ఈడీ దృష్టి సారించింది.

ఈ కేసులో ప్రముఖులు ప్రశ్నించబడుతున్న నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమలో దీనిపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రానా దగ్గుబాటి తన కొత్త తేదీ కోసం ఎదురుచూస్తుండగా.. మిగిలిన సినీ ప్రముఖులు కూడా ఈ కేసు పరిణామాలను గమనిస్తున్నారు. ఈ కేసు త్వరలో మరిన్ని వార్తలకు దారితీసే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Tags:    

Similar News