రాందేవ్ బాబాను ఎత్తి కుదేశాడుగా....

ఇంతకూ రాందేవ్ బాబాపై ఆ వ్యక్తి ఎందుకు ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు...చాలా ఆసక్తికరంగా ఉంది కదూ...;

Update: 2025-12-20 12:03 GMT

అదో టీవీ డిబేట్...చాలా ఆసక్తికరంగా సాగుతోంది. అందులో పాల్గొన్న ప్రముఖ పంతంజలి ఫేం రాందేవ్ బాబాను అందరూ చూస్తుండగానే తన తోటి ప్యానలిస్ట్ ఎత్తి కుదేశాడు...హోస్ట్ తో సహా స్టూడియోలో ఉన్నవారు ...టీవీలో చూస్తున్నవారు నోరెళ్లబెట్టారు. ఇదేం డిబేట్...ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోవడం అందరి వంతైంది. వాస్తవానికి ఈమధ్యన టీవీ డిబేట్లు మాటల యుద్ధం దశదాటి మల్లయుద్ధం దాకా వచ్చేస్తున్నాయి. తమ మాటల్లో ఘాటు తగ్గిందనుకుంటే...కాళ్లకు, చేతులకు పనిచెబుతున్నారు. హోస్ట్ పై వాటర్ బాటిల్ విసిరేయడం...పక్కనున్న ప్యానిలిస్ట్ చొక్కాలు పట్టేసుకోవడ ఇవన్నీ ఈ మధ్య కాలంలో రసవత్తర కసరత్తులుగా మారుతున్నాయి. అరే సభా మర్యాద ఉండక్కర్లేదా అంటే...అలా చేయడమే మర్యాద అంటున్నారు. మరీ వాదిస్తే టీఆర్పీ అంటున్నారు. ఇంతకూ రాందేవ్ బాబాపై ఆ వ్యక్తి ఎందుకు ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు...చాలా ఆసక్తికరంగా ఉంది కదూ...

అమర్ ఉజాలా లైవ్ డిబేట్ సందర్భంగా ఈ గందరగోళం జరిగింది. మొదట రాందేవ్ బాబా కొన్ని ఆసనాలు వేసి చూపించాడు. హర్యానాలో ఈ ఆసనాలు చాలా ఫేమస్ అన్నాడు. అంతవరకు బాగుంది. ఆ తర్వాత ఛాలెంజి విసిరి సాటి ప్యానలిస్ట్ పై పిడిగుద్దులు గుద్దసాగాడు. అందరూ ఆశ్చర్యపోయారు. సహనం కోల్పోయిన సాటి ప్యానలిస్ట్ ఊరుకుంటాడా...రాందేవ్ పై లంఘించాడు. అతణ్ని పట్టుకుని ఎత్తి స్టూడియో ఫ్లోర్ పైకి కుదేశాడు. ఇలా ఒకరినొకరు బాహాబాహీగా తలపడ్డారు. ఇంత జరుగుతున్నా వారిద్దరు నవ్వుతుండటంతో అక్కడున్న చాలా మందికి అనుమానాలు వచ్చాయి. ఇదేదో డ్రామాలా ఉందనుకున్నారు. వారనుకున్నదే నిజమైంది.

ఆ తర్వాత రాందేవ్ బాబా అతనికి శక్తి లేదు చప్పట్లు అని అక్కడున్నవారిని ఉత్సాహపరచడంతో అందరూ ఓహో జోక్ చేశారా అని నిట్టూర్చారు. చప్పట్లు కొట్టారు. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అయినా జోక్ చేయడానికి వేరేదేం దొరకలేదా అని కొందరు విమర్శిస్తున్నారు. మరీ ఇంతగా బరితెగించడం అవసరమా అంటున్నారు. పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తారా? ఎవరికైనా గాయాలైనా...కాలో చేయో విరిగినా ఏం గతి? మరి ఇంత ప్రాంక్ చేస్తారా అంటూ ఘాటుగానే విమర్శిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ తీరు చూస్తుంటే...పిచ్చిముదిరింది తలకు రోకలి చుట్టండి అన్నట్లుంది. కేవలం టీఆర్పీ కోసం ఏ గిమ్మిక్ చేయడానికైనా సిద్ధంగా ఉంటున్నారు. కొందరు డెయిలీ డిబేట్లలో కూడా ఈ చీప్ ట్రిక్స్ వాడుతున్నారు. గెస్టులకు హోస్టులు ముందస్తుగానే బ్రీఫింగ్ ఇస్తున్నారు. పది నిమిషాలు తర్వాత వాదన పెంచుదామని, అపుడు మీరు చేతిలో ఏదుంటే దాన్ని నాపై పడేయండి అని హోస్టులే సూచిస్తున్నారంటే పరిస్తితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు.

ప్రముఖ యోగా గురువు, పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకుడు రాందేవ్ బాబా మొదట్నుంచి వివాదాస్పదంగా వార్తల్లో నిలుస్తున్నారు. గతంలొ పతంజలికి చెందిన దివ్య ఫార్మసీ విధానాలపై ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారాలు, ప్రకటనులు ఉన్నాయంటూ కేరళ హైకోర్టు రాందేవ్ బాబా, అతని సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేసింది. ఈ తప్పుడు ప్రచారాల నేపథ్యంలోనే పతంజలికి చెందిన పది దివ్య ఫార్మసీ ఉత్పత్తుల తయారీ లైసెన్సు రద్దయ్యింది. హమ్‌దార్డ్ లాబొరేటరీస్ (భారతదేశం) తయారుచేసిన ప్రసిద్ధ మూలికా పానీయం రూహ్ అఫ్జా గురించి రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలను చాలా మంది విమర్శించారు. కోవిడ్ మహమ్మారి వ్యాపించిన సమయంలో రామ్‌దేవ్ "అల్లోపతి మందుల వల్ల భారతదేశంలో లక్షల మంది చనిపోయారు" అంటూ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసి అందరి కంటపడ్డారు. రామ్‌దేవ్ హోల్డింగ్ కంపెనీ పతంజలి ఆయుర్వేద్ 2006లో ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఉన్న ఇది 2024 ఫైనాన్సియల్ సంవతర్సరంలో రూ.9,335 కోట్ల ఆదాయాన్ని, రూ.2,901 కోట్ల లాభాన్ని గడించింది.

తాజాగా డిబేట్ లో రాందేవ్ బాబా ఫీట్లు మరోసారి ఆయన్ను వివాదాస్పద వ్యక్తిగా నిలబెట్టాయి. ఈ వయసులో ఇది అవసరమా అని చాలా మంది వ్యాఖ్యానిస్తుండగా...వ్యాపారం కోసం అతను దేనికైనా దిగజారుతాడని మరికొందరు అంటున్నారు.



Tags:    

Similar News