రాముడు ఎప్పటికీ ఉత్తమ కధానాయకుడే !

యుగాలు మారినా కాలాలు కరిగిపోతున్నా ఎప్పటికీ లోకానికి ఆదర్శంగా శ్రీరాముడినే కొలుస్తూ వస్తున్నారు.;

Update: 2026-03-27 05:17 GMT

యుగాలు మారినా కాలాలు కరిగిపోతున్నా ఎప్పటికీ లోకానికి ఆదర్శంగా శ్రీరాముడినే కొలుస్తూ వస్తున్నారు. అంతలా రామ నామం లోకమంతా పాకిపోయింది. మరి ఎపుడో త్రేతా యుగంలో కదా రాముడి అవతారం. ఈ కలియుగంలో అయిదు వేల సంవత్సరాల తరువాత కూడా ఎందుకు ఆరాధిస్తున్నారు రాముడు ఈ తరానికి ఎందుకు పూజ్యనీయుడు అయ్యాడు అంటే అదే రామ మహిమ అని సులువుగా చెప్పవచ్చు. కానీ అది మహిమ కాదు రాముడు కూడా సామాన్యుడిగా నరుడిగానే ఈ భూమి మీదకు వచ్చాడు. ఏ రకమైన మహిమలూ చూపించకుండా ఒక మనిషి తన శక్తియుక్తులతో ఏమి చేయవచ్చో అన్నీ చేసి చూపించాడు. ఎటువంటి పరిస్థితులలో అయినా ధర్మానికి కట్టుబడి ఉండాలన్నది రామ నీతి. ఆఖరుకు కుటుంబ బంధాలు రక్త సంబంధాలు సైతం పక్కన పెట్టి ధర్మం కోసం ఎందాకైనా సాగేందుకు సిద్ధం కావడమే రాముడు లోకానికి చెప్పిన నైతిక సూత్రం. తాను ఆచరించి చూపించిన సత్యం.

అన్నింటికీ ఆయనే :

ఒక అన్న ఎలా ఉండాలి అంటే రాముడినే ఉదాహరణగా చూపిస్తారు. భర్త కూడా రాముడిగానే ఉండాలి, కొడుకుగా ఆయననే చూపిస్తారు. గురువులు మెచ్చిన ప్రియ శిష్యుడిగా రాముడు కనిపిస్తారు. ఉత్తమ పరిపాలకుడిగా రాముడినే అంతా అనుసరిస్తారు. రామ రాజ్యం అన్నది యుగాలుగా ఒక ప్రమాణంగా కొలమానంగా ఉంది అంటే రాజుగా రాముడు సాధించిన విజయంగా దానిని అంతా చూస్తారు. కేవలం మనుషులకే కాదు స్వజనులకే కాదు అందరికీ రాముడు నచ్చాడు అంటే అది ఆయనలోని ఉన్న గొప్ప లక్షణం. అడవులలో వానరులు సైతం రాముడిని ప్రేమించారు, పశు పక్షాదులు సైతం రామా అంటూ పరవశించి ఆయన వశమైపోయాయి అంటే అదే రామ తత్వం అని చెప్పాలి.

ఇచ్చిన మాట కోసం :

రామ బాణం అంటే ఆయుధం కాదు అస్త్రం అంతకంటే కాదు ఇచ్చిన మాటను నెరవేర్చడం. అది తనదైనా తన తండ్రిది అయినా నెరవేర్చేందుకు రాముడు సిద్ధపడిన తీరు సమస్త లోకాలకు యుగాలకు అతీతమైన ధర్మం. తెల్లారితే సువిశాలమైన రాజ్యానికి మహా రాజు కాబోయే జాతకాన్ని మార్చేసింది తండ్రి దశరధుడు కైకేయికి ఇచ్చిన మాట. ఆ మాట కోసం కట్టు బట్టలతో రాముడు వన వాసానికి పయనం అయ్యాడు. నిజానికి రాముడు స్వయంగా ఇచ్చిన మాట అది కాదు, తాను ఎందుకు దానిని పాటించాలి అని అనుకోవచ్చు. తనకు సంబంధం లేదని తప్పించుకోవచ్చు. కానీ అక్కడ ఉన్నది రాముడు. అందుకే అలా చేయలేదు, తండ్రి వారసత్వం అంటే అధికారం ఆస్తులు మాత్రమే కాదు, ఆయన ఇచ్చిన మాట కూడా అని భావించి శిరసా వహించి అడవుల బాట పట్టాడు. అక్కడే రాముడు నర మానవుడికి మించి పోయాడు. మహనీయుడుగా అవతరించాడు.

ఓర్పు సహనం :

రాముడు తలచుకుంటే రావణుడిని వధించి సీతను తెచ్చుకోవడం కష్టమేమీ కాదు, కానీ ఆయన మహిమలు ఏవీ ఉపయోగించలేదు, ఒక మనిషికి కష్టం వస్తే ఎలా దానిని అధిగమించేందుకు ప్రయత్నం చేస్తాడో అలాగే చేశాడు. ఓపికతో సహనంతో సమస్యలను సవాళ్ళను ఎదుర్కొన్నాడు. పోరాటానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పరాక్రమం నిండుగా మెండుగా ఉన్నప్పటికీ సమయం సందర్భం కోసం ఎదుచూశాడు. రావణుడికి తగినంత సమయం ఇచ్చాడు. చివరికే బాణం వదిలాడు. దీనిని బట్టి మానవాళి అర్ధం చేసుకోవాల్సింది సమస్యలు వస్తే కృంగి పోవడమో లేక ఎవరైనా ఆదుకుంటారేమో ఎదురు చూడడం కాదు, ఓపికతో ఉంటూ ఎదుర్కోవడం అన్నది రామ రీతి చెప్పిన సత్యం.

మనిషి కోసం :

రాముడు ఒక అవతారం. దేవుడిగా ఉంటే ఏదైనా సాధ్యమే అని జనాలు భావిస్తారు కాబట్టి తాను మనిషిగానే భువికి వచ్చాడు. ఒక మనిషి పడే కష్టాలు అన్నీ తానూ పడ్డాడు. పరిష్కారాలను కూడా సాటి మనుషుల మాదిరిగానే కనుగొన్నాడు. అలా యుగాలకు సరిపడ ధీమాను ఆత్మ స్థైర్యాన్ని ధైర్యాన్ని మానవాళికి అందించాడు. రాముడి దగ్గర ఉన్నది నీతి, ధర్మం. అదే అద్భుతమైన శక్తిగా లోకానికి చాటి చెప్పాడు. సత్య వ్రతాన్ని పాటించే వారు ఎవరైనా సంక్షోభాలను సవాళ్ళను తృణప్రాయంగా ఎదుర్కోగలరని ఆచరణాత్మకంగా చూపించాడు. అందుకే రాముడు దేవుడు అయ్యాడు. సమస్త మానవాళి రాముడి మార్గంలో కనుక ముందుకు సాగితే విజయం వరిస్తుందని అది కూడా నైతికతతో కూడినదై సుసంపన్నుడిని అసాధ్యుడిని చేస్తుంది అని చెప్పినదే రాముడి యావత్తు జీవితం. అందుకే రామాయణం ఎప్పటికీ లోకానికి ఆదర్శనీయం అయింది. రాముడు ఎపుడూ ఉత్తమ కధానాయకుడిగా జనం మదిలో కొలువు తీరి ఉంటున్నారు.

Tags:    

Similar News