పాట్నా - ఢిల్లీ విమానంలో కో-పైలట్ గా బీజేపీ ఎంపీ... పిక్స్ వైరల్!
నిత్యం ప్రజా సేవలో బిజీగా ఉండే రాజకీయ నాయకులు అప్పుడప్పుడూ తమలో ఉన్న ప్రతిభను ప్రజలకు చూపిస్తుంటారు.;
నిత్యం ప్రజా సేవలో బిజీగా ఉండే రాజకీయ నాయకులు అప్పుడప్పుడూ తమలో ఉన్న ప్రతిభను ప్రజలకు చూపిస్తుంటారు. దీంతో... ఆ విషయం అటు అభిమానులకు, ఇటు కార్యకర్తలకు సర్ ప్రైజ్ గా అనిపిస్తుంటుంది. ప్రధానంగా క్రీడల్లోనూ, రచనల్లోనూ ఎక్కువగా ఈ క్రియేటివిటీ కనిపిస్తుంటుంది. అయితే తాజాగా బీజేపీ ఎంపీ కో-పైలట్ గా మారిన విషయం హాట్ టాపిక్ గా మారింది.
అవును... భారతీయ జనతాపార్టీకి చెందిన బీహార్ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ.. కో-పైలట్ గా మారారు. ఈ సమయంలో రూడీని ప్రసంశిస్తూ కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పెట్టిన పోస్టు, షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా... పట్నా నుంచి ఢిల్లీకి వెళ్లే ఈ ప్రయాణం తనకు మరవలేనిదని శివరాజ్ సింగ్ చౌహాన్ వెళ్లడించారు.
వివరాళ్లోకి వెళ్తే... పట్నా నుంచి ఢిల్లీకి వెళ్లే విమానంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా ప్రయాణించారు. ఈ సమయంలో విమానంలో తన సహచర ఎంపీ ప్రతాప్ రూడీని చూసి ఆశ్చర్య పోయారు. అందుకు కారణం.. ఆ విమానంలో ఆయన కో-పైలెట్ గా ఉన్నారు. ఈ సందర్భంగా చౌహాన్ ఎంతో మురిసిపోతూ ఎక్స్ వేదికగా ఫోటోలు షేర్ చేశారు.
ఈ సందర్భంగా... రాజీవ్ ఈ రోజు మీరు మా హృదయాలను గెలుచుకున్నారు.. పట్నా నుంచి ఢిల్లీకి వెళ్లే ఈ ప్రయాణం నాకు మరవలేనిది.. ఎందుకంటే, ఈ విమానానికి నా ప్రియమైన స్నేహితుడు, ఛప్రా ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ కో పైలట్ గా ఉన్నారు అని శివరాజ్ సింగ్ చౌహాన్ రాసుకొచ్చారు. ఆయనతో ముచ్చటిస్తున్న ఫోటోలు పంచుకున్నారు.
ఇదే సమయంలో... రూడీని ప్రసంశిస్తూ చేతితో రాసిన లేఖను కూడా చౌహాన్ పంచుకున్నారు. అందులో.. రూడీని ఆయన ప్రశంసించారు. ఇందులో భాగంగా... ఇలాంటి వ్యక్తులు చాలా అరుదని, బిజీ షెడ్యూల్ లు ఉన్నప్పటికీ తమలో ఉన్న ప్రతిభ కోసం సమయం కేటాయిస్తారని అన్నారు. ఈ సందర్భంగా తన ప్రయాణాన్ని చిరస్మరణీయంగా మార్చినందుకు రూడీకి కృతజ్ఞతలు తెలిపారు.
కాగా... బీహార్ నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయిన ప్రతాప్ రూడి... కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. ఆయన లైసెన్స్ పొందిన వాణిజ్య పైలట్ కూడా. మూలాల ప్రకారం.. రూడీ తన లైసెన్స్ ను యాక్టివ్ గా ఉంచడానికి ఎప్పటికప్పుడు గౌరవ ప్రాతిపదికన ఇండిగో విమానాలను నడుపుతున్నారు.