3 నెలలు డిజిటల్ బందీగా ఉంచి రూ.7కోట్లు కొల్లగొట్టిన నలుగురు అరెస్ట్

సాంకేతికత ఎంత పెరుగుతుందో సైబర్ నేరాలు కూడా అలాగే పెరుగుతున్నాయి.;

Update: 2025-04-17 06:30 GMT

సాంకేతికత ఎంత పెరుగుతుందో సైబర్ నేరాలు కూడా అలాగే పెరుగుతున్నాయి. తాజాగా ఓ భయానక ఉదంతం వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఒక రాజస్థాన్ వ్యక్తిని మూడు నెలలకు పైగా 'డిజిటల్‌గా నిర్బంధించి' రూ. 7 కోట్ల భారీ మొత్తాన్ని దోచుకున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. ఇక్కడ బాధితుడి గుర్తింపును గోప్యంగా ఉంచారు. సైబర్ నేరగాళ్లు వివిధ చట్ట అమలు సంస్థల అధికారులుగా నమ్మించి, డిజిటల్‌గా నిర్బంధించారు. 90 రోజుల వ్యవధిలో బాధితుడి నుండి 42 వేర్వేరు పేమెంట్స్ ద్వారా ఏకంగా రూ. 7.67 కోట్లు కాజేశారు.

ఈ కేసును దర్యాప్తు చేయడానికి CBI 'ఆపరేషన్ చక్ర-వి'ని ప్రారంభించింది. వాస్తవానికి రాజస్థాన్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసును తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించారు. ఈ ఘటన ఇటీవలి కాలంలో అత్యంత కలవరపరిచే సైబర్ దోపిడీ కేసుల్లో ఒకటిగా అధికారులు అభివర్ణించారు. అధికారుల ప్రకారం, బాధితుడిపై తప్పుడు చట్టపరమైన ఆరోపణలు మోపి ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. దీంతో బాధితుడు పూర్తిగా బయటి ప్రపంచానికి దూరం అయ్యాడు. తీవ్రమైన మానసిక ఒత్తిడిలో బాధితుడు ఆ బెదిరింపులు నిజమని నమ్మి స్కామర్ల సూచనలను పాటించాడు.

CBI అధునాతన డిజిటల్ ఫోరెన్సిక్స్, డేటా విశ్లేషణ ద్వారా సేకరించిన ఆధారాలతో ఈ ముఠాలోని సభ్యులను గుర్తించింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్, సంభాల్, ముంబై, జైపూర్, పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్‌లోని 12 ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో మొరాదాబాద్ నుండి ఇద్దరు, ముంబై నుండి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

సోదాల సమయంలో మొబైల్స్, కంప్యూటర్లు, బ్యాంకు ఖాతా రికార్డులు, డెబిట్ కార్డులు, చెక్కుబుక్‌లు, డిపాజిట్ స్లిప్‌లతో సహా డిజిటల్ సాక్ష్యాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఈ సాక్ష్యాలు డబ్బు లావాదేవీలకు సంబంధించినవని భావిస్తున్నారు. అరెస్టయిన నిందితులను మరింత విచారణ కోసం ఐదు రోజుల కస్టడీకి అప్పగించారు.

Tags:    

Similar News