వాసిరెడ్డికీ అమరావతికీ తీయని బంధం

అలా తనకంటూ ఒక పేజీని చరిత్రలో కేటాయించుకున్న రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు జయంతి ఈ రోజు.;

Update: 2026-04-27 12:11 GMT

ఈ రోజున ఏపీకి రాజధానిగా అమరావతిని చేసుకున్నాం. తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేసి మరీ రాజముద్ర వేసింది. అలా ఏపీకి క్యాపిటల్ గా అమరావతి ఉంది. కానీ చరిత్రలో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనే రాజు ఉండేవారు. ఆయన కృష్ణా గుంటూరు ప్రాంతాలను పాలించేవారు. అప్పట్లో తన రాజ్యానికి రాజధానిగా అమరావతిని చేసుకుని ఆయన మంచి పాలన అందించారు. ఆయన గొప్ప పరిపాలకుడిగా చరిత్రలో పేరు తెచ్చుకున్నారు. ఎన్నో దానాలు చేశారు. ఎన్నో సంస్కరణలను చేపట్టారు. అలా తనకంటూ ఒక పేజీని చరిత్రలో కేటాయించుకున్న రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు జయంతి ఈ రోజు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారికంగా ఆయన జయంతిని ఈ ఏడాది నుంచి నిర్వహిస్తోంది.

గొప్ప పాలనా దక్షుడు :

ఇదిలా ఉంటే 1761 ఏప్రిల్ 27 వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జగ్గ భూపతి, అచ్చమాంబ దంపతులకు జన్మించారు. ఆయన 1783 నుంచి రాజ్య భారాన్ని మోస్తూ 1816 వరకూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన గుంటూరు జిల్లాలో ఉన్న పాత అమరావతిని రాజధానిగా చేసుకొని కృష్ణా, గుంటూరు ప్రాంతం పరిపాలించిన జమీందారుగా వాసికెక్కారు. వాసిరెడ్డి కవి పండిత పోషకునిగా వందకు పైగా దేవాలయాలను నిర్మించిన వారుగా పేరు తెచ్చుకున్నారు. వాసిరెడ్డి వంశీకులు 1413 నుండి ఆంధ్ర రాష్ట్రం తీర ప్రాంతంలో కీలకమైన భూమిక పోషించారు.

పాలనలో మేటిగా :

ఇక వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1783లో పాలనా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పాలనలో కృష్ణా జిల్లాలో 204 గ్రామాలు. గుంటూరు జిల్లాలో 344 గ్రామాలు, రాజమండ్రి జిల్లాలో 4 గ్రామాలు మొత్తం 552 గ్రామాలు ఉండేవి. 1791-92లో తన రాజ్యంలో వచ్చిన భయంకర ఉప్పెనలో తీరాంధ్ర గ్రామాలలో వేలమంది ప్రజలు మరణించారు. ఆ మరుసటి సంవత్సరం తీవ్రమైన కరవు వచ్చింది. ఈ సందర్భంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ప్రజల కోసం ఎంతగానో తపించి పనిచేశారు ఖజానాలోని మూడున్నర లక్ష్లల బంగారు నాణాలు ప్రజల కోసం వినియోగించి ప్రజా నేతగా గుర్తింపు పొందారు.

అమరావతిని కట్టిన వైనం :

తన రాజధానిగా గుంటూరు మండలంలోని ధరణి కోట వద్ద అమరావతి అనే పేరుతో నూతన పట్టణాన్ని వాసిరెడ్డి కట్టించారు. అమరావతిలో ఎన్నో రాజ భవనాలు కట్టించి రాజధానిని 1796 లో చింతపల్లి నుండి వాసిరెడ్డి తరలించారు. 1797లో అమరావతి పట్టణం దర్శించిన కోలిన్ మెకంజీ అనే విదేశీ పర్యాటకుడు అమరావతిలోని భవనాలను నగర నిర్మాణాన్ని తాను రాసిన ఆసియాటిక్ జర్నల్ లో ప్రస్తావించి పూర్తి స్థాయిలో కొనియాడారు

సంపదలతో నిండుగా :

ఇక రాజా వాసిరెడ్డి వారి ఏలుబడిలో ఆయన రాజ్యం సంపదలతో తులతూగేదని చరిత్ర చెబుతోంది. అమరావతి, చేబ్రోలు, చింతపల్లిలలో వెంకటాద్రి నాయుడు నిర్మించిన భవనాలు సంపదతో తులతూగేవని గొప్పగా చెప్పుకునేఅవరు. ఇక పండుగలు వస్తే కవి పండితులకు గ్రామ పెద్దల కుటుంబాలకు పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలు వాసిరెడ్డి కానుకలుగా అందిస్తూ ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అంతే కాదు ఆయన రాజ్యంలో నిరంతరం అన్న దానాలు జరుగుతుండేవని చెబుతారు.

శత్రు భయంకరుడుగా :

ఎంత గొప్ప పాలనాదక్షుడో అంత సమర్ధుడైన రాజు. శత్రువులను తన రాజ్యంలో లేకుండా చూసిన సాహసి. ఇక్ తన రాజ్యం మీద 1816లో పిండారీ దండులు ప్రవేశించి అల్లకల్లోలం చేస్తున్న నేపధ్యంలో పిండారీలను సమర్థవంతంగా అణచివేసిన ఘనత నాయుడుది. పిండారిలతో పాటు స్థానికంగా చెంచుల దారిదోపిడులను కట్టడి చేసి ప్రజలకు రక్షణ కల్పించారు.

దేవాలయాల నిర్మాత :

ఇదిలా ఉంటే వేంకటాద్రి నాయుడు 1809 లో నిర్మించిన మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం గొప్పది అంతే కాదు కృష్ణా డెల్టా ప్రాంతమందు 108 దేవాలయాలు కట్టించారు. చేబ్రోలులో చతుర్ముఖాలయం ఆయన నిర్మించినదే. ఇలా ఎన్నో రకాలుగా జనరంజకమైన పాలన చేసిన ఆయన 1817లో మరణించారు. ఆయన స్మారకార్థం దేశానికి స్వాతంత్రయం వచ్చిన తరువాత ధరణికోట అమరావతిలో 1968 లో స్థాపించిన కళాశాలకు రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు కళాశాలగా పేరు పెట్టారు. అంతే కాదు మంగళ గిరి ఆలయంలో ప్రధాన ద్వారంలో వాసిరెడ్డి చిత్ర పటము ఈ రోజుకీ భక్తులను పలకరిస్తుంది.

చంద్రబాబు నివాళి :

వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు జయంతి సందర్భంగా ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. వాసిరెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుకు వాసిరెడ్డికి ఇక్కడ ఒక పోలిన ఉంది. పాత అమరావతి పట్టణాన్ని వాసిరెడ్డి నిర్మిస్తే బాబు కొత్త అమరావతి రాజధానిగా ఏపీకి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి స్పూర్తితో ఏపీ ముందుకు సాగాలని అంతా కోరుకుంటున్నారు.

Tags:    

Similar News