'కృతజ్ఞతలు'.. రాజీనామా ఆమోదంపై రాజాసింగ్ రియాక్షన్
అయితే.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్నదే తన లక్ష్యమని.. ఈక్రమంలో ఎంతో మంది కార్యకర్తలు..అలుపెరుగ కుండా పనిచేస్తున్నారని..;
బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి తాను చేసిన రాజీనామాను హైకమాండ్ ఆమోదించడం పట్ల.. తెలంగాణ కమలం పార్టీ నాయకు డు, ఫైర్‌బ్రాండ్, ఘోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. `కృతజ్ఞతలు` అంటూ.. ఆయన పోస్టు చేశారు. అయితే.. ఈ సందర్భంగా ఆయన తన ఫ్యూచర్ ప్లాన్‌ను పేర్కొన్నారు. తాను హిందూత్వ కోసమే పుట్టానని.. తన చివరి శ్వాసవరకు కూడా హిందూత్వ కోసమే పనిచేస్తానని తెలిపారు.
11 సంవత్సరాల కిందట తొలిసారి తాను బీజేపీలో చేరానని.. అనేక ఇబ్బందులు పడ్డా.. హిందూత్వ కోసం పనిచేశానని రాజా సింగ్ తెలిపారు. పార్టీ తనకు మూడు సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చిందన్న ఆయన ఘోషా మహల్ ప్రజలు తనను మూడు సార్లూ గెలిపించారని.. పేర్కొన్నారు. తనకు మూడుసార్లు టికెట్ ఇవ్వడం పట్ల బీజేపీ జాతీయ నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాను చేసిన రాజీనామాను ఆమోదించడం పట్ల తనకు బాధలేదన్నారు.
అయితే.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్నదే తన లక్ష్యమని.. ఈక్రమంలో ఎంతో మంది కార్యకర్తలు..అలుపెరుగ కుండా పనిచేస్తున్నారని.. ఈ విషయాన్ని జాతీయ నాయకత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశమే తనకు ఉందన్నారు. కానీ.. ఆ పనిచేయలేక పోయానన్నారు. తాను పదవుల కోసం.. అధికారం కోసం పార్టీని వదులు కోలేదని చెప్పారు. చివరి శ్వాస వరకు హిందుత్వం కోసమే పనిచేస్తానని తెలిపారు. తాను హిందువుగా పుట్టినందుకు.. ఆ సమాజం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు.
ఇలాంటి ఫైర్ ఉంటుందా?
రాష్ట్ర విభజన నేపథ్యంలో బీజేపీలో చేరిన రాజాసింగ్ అప్పటి వరకు ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా, ఏబీవీపీ నాయకుడిగా వ్యవహరిం చారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో వరుస విజయాలు దక్కించుకున్నారు. ఒకానొక సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఒక్కరే బీజేపీ తరఫున విజయం సాధించారు. అయినా.. అసెంబ్లీలోబలమైన వాణి వినిపించారు. ఫైర్ బ్రాండ్ రాజకీయాలను బీజేపీకి పరిచయం చేసిన ఘనత కూడా ఆయనదే.
అంతేకాదు.. విషయం ఏదైనా తనదైన శైలిలో విరుచుకుపడడం, ఏటికి ఎదురీడడం రాజా స్టయిల్. రాజకీయాల్లో నాయకులు ఎంతో మంది వస్తుంటారు..పోతుంటారు. పార్టీల్లోనూ అంతే. కానీ.. రాజాసింగ్ వంటి ముక్కుసూటి నాయకుడు.. ఫైర్ ఉన్న నేతలు లభించడమే కాదు.. వారిని తట్టుకోవడం కూడా.. పార్టీలకు కష్టమే!. ఇదే.. రాజా రాజకీయాలకు ఒకరకంగా ప్లస్ అయితే.. మరికొన్ని రకాలుగా మైనస్ అయిందనేది పరిశీలకులు చెబుతున్న మాట.