స్టార్ట్ కెమెరా... రాజ్ తరుణ్ - లావణ్య కేసులో తాజా ట్విస్ట్ లో మరో ట్విస్ట్!
ఈ సందర్భంగా... రాజ్ తరుణ్ తల్లితండ్రులకు సంబంధించిన వ్యక్తులు తనపై దాడి చేశారని ఆరోపిస్తూ.. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య ఫిర్యాదు చేశారు.;
రాజ్ తరుణ్, లావణ్య మధ్య వివాదం కొన్నాళ్లుగా సైలంట్ అయిన సంగతి తెలిసిందే. ఇక అంత సద్దుమణిగినట్లేనని ఆ సమయంలో చాలా మంది భావించారు! ఇద్దరూ తమ తమ రొటీన్ లైఫ్ లలోకి వెళ్లారనే చర్చ జరిగింది. ఈ సమయంలో తాజాగా వీరి వ్యవహారం నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు చేరింది.
అవును... రాజ్ తరుణ్, లావణ్య మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా... రాజ్ తరుణ్ తల్లితండ్రులకు సంబంధించిన వ్యక్తులు తనపై దాడి చేశారని ఆరోపిస్తూ.. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో లావణ్య ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు.
ఈ సందర్భంగా తనకు రక్షణ కల్పించాలని నార్సింగ్ పోలీసులకు లావణ్య విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి లావణ్య ఇంటివద్ద బుధవారం అర్ధరాత్రి వరకూ హైడ్రామా కొనసాగింది. ఇందులో భాగంగా... కోకాపేట్ లోని విల్లా తమ కుమారుడిదేనంటూ రాజ్ తరుణ్ తల్లితండ్రులు ఆ ఇంటిముందు నిరసన చేశారు. ఈ సందర్భంగా లావణ్యతో వాగ్వాదం జరిగినట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన నార్సింగ్ పోలీసులు.. రాజ్ తరుణ్ పేరెంట్స్ ను ఇంట్లోకి అనుమతించాలని లావణ్యకు స్పష్టం చేశారు. దీంతో.. గత అర్ధరాత్రి వారిని ఇంట్లోకి అనుమతించారు లావణ్య. అయితే... ఈ ఇష్యూపైనే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు లావణ్య.
ఈ సందర్భంగా.. తాను 15 ఏళ్లుగా ఉంటున్న ఇంట్లోకి రాజ్ తరుణ్ తల్లితండ్రులు పదిహేను మందితో వచ్చి ధ్వంసం చేయాలని ప్రయత్నించారని.. తనపైనా అసభ్యంగా ప్రవర్తించారని.. బ్యాట్ తీసుకుని తన తమ్ముడిని కోట్టారని.. తలుపులు పగలకొట్టి ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ ఆమె ఫిర్యాదు చేశారు.
కాగా... రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని గతంలో లావణ్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం ఎన్నో ట్విస్టులు, జలక్కులతో ఎపిసోడ్ ఎపిసోడ్ లుగా నడిచింది. అయితే.. ఆ తర్వాత రాజ్ తరుణ్ కు క్షమాపణలు చెబుతూ అతడిపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకుంటానని చెప్పారు లావణ్య.
దీంతో... ఇకపై రాజ్ తరుణ్ - లావణ్య మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని చాలా మంది భావించారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా వాతావరణం కూడా అలానే కనిపించింది. ఈ సమయంలో.. తాజాగా విల్లా వ్యవహారం, రాజ్ తరుణ్ పేరెంట్స్ ఎంట్రీతో మరోసారి స్టార్ట్ కెమెరా అనే పరిస్థితి నెలకొందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!