నేరుగా రైతుల ఇంటికే ప్రభుత్వం

ఈ క్రమంలో తాజాగా ఒక కార్యక్రమం ప్రకటించింది. ఇది ఆకర్షణీయంగానే కాదు, ఆసక్తికరంగా ఉంది.;

Update: 2025-11-21 06:09 GMT

రైతులు ఈ దేశానికి వెన్నెముక. వారు లేనిదే ఏమీ లేదు, ఈ రోజుకీ నూటికి అరవై నుంచి డెబ్భై శాతం ఉపాధి అవకాశాలు వ్యవసాయ రంగం నుంచే వస్తున్నాయన్నది అందరికీ తెలిసిందే. విభజిత ఆంధ్రా కూడా పూర్తిగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అందుకే రైతులకు టాప్ ప్రయారిటీ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఒక కార్యక్రమం ప్రకటించింది. ఇది ఆకర్షణీయంగానే కాదు, ఆసక్తికరంగా ఉంది.

రైతన్నా...మీకోసం :

ఈ కార్యక్రమం పేరే ఎంతో క్యాచీగా ఉండేలా చూసుకున్నారు. రైతుల కోసం పూర్తిగా డిజైన్ చేసిన ఈ కార్యక్రమాన్ని ఏడు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ నెల 24 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. రైతుల ఇంటికే నేరుగా ప్రజా ప్రతినిధులు అధికారులు వెళ్తారు, వారి గురించి పూర్తిగా తెలుసుకోవడమే కాకుండా వారికి లాభసాటిగా వ్యవసాయం ఉండేలా దిశా నిర్దేశం చేస్తారని అంటున్నారు.

వ్యవసాయంలో పంచ సూత్రాలు :

వ్యవసాయంలో ఎన్నో కొత్త పద్ధతులు వచ్చాయి. గిట్టుబాటు కలిగిన పంటలకు ప్రాధాన్యత ఇస్తే ఆటోమేటిక్ గా దానికి ఎగుమతులకు అవకాశాలు విస్తృతంగా ఉంటాయి. అదే సమయంలో రైతులకు కూడా పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. దాంతో రైతులకు ఇలాంటి విషయాల మీద అవగాహన తీసుకుని వచ్చేందుకే ఈ కార్యక్రమం తీసుకుని వస్తున్నారు. రైతన్నా మీ కోసం కార్యక్రమమంలో ప్రధానంగా అగ్రిటెక్‌పై రైతుల్లో చైతన్యం తీసకువస్తారని అంటున్నారు.

వర్క్ షాపులతో సహా :

ఇక దేశంలోనే కాదు ప్రపంచంలోనూ వ్యవసాయ రంగంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. దాంతో సాగును లాభసాటి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను ఇప్పటికే చేపడుతోంది. ఇందులో భాగంగా పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై ప్రస్తుతం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఈ నెల 24 నుంచి కార్యక్రమాలు చేపట్టనుంది. 24వ తేదీ నుంచి 29వ ప్రతీ రైతు ఇంటికి ప్రజాప్రతినిధులు, అధికారులు వెళ్లనున్నారు. ఇక డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్ షాపులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొననున్నారు.

పూర్తి అవగాహన కోసం :

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతలకు అనేక రకాలుగా మేలు జరుగుతుంది అని అంటున్నారు. వాటికి మరింత మేలు చేకూర్చేలా రైతన్నా మీ కోసం కార్యక్రమంలో పంచ సూత్రాలను ప్రకటిస్తున్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్ధతు అనే అంశాలతో పంచ సూత్రాల విధానాన్ని రతిలకు తెలియచేస్తారు. ఈ పంచసూత్రాలను ప్రతి రైతుకే కాకుండా రైతు కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పిస్తారు. రైతులతో పాటు పాడి రైతులు, పౌల్ట్రీ, గొర్రెల పెంపకం దారులు, ఆక్వా, ఉద్యాన, సెరీ కల్చర్ రైతులకు కూడా అవగాహన కల్పిస్తారు.

ప్రకృతి సేద్యం గురించి :

రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా ఆధునిక పద్ధతుల ద్వారా పంటలకు మరింత విలువ జోడించేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నది కూటమి ప్రభుత్వం ఆలోచన. శాస్త్రీయ వ్యవసాయంతోనే రైతుకు గిట్టుబాటు అవుతుందని, అలాగే ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహించాలని కూడా వివరిస్తారు. దీని వల్ల భూసార రక్షణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని వారికి తెలియచెబుతారు. కేవలం రైతులకే కాకుండా రైతు బజార్లలోనూ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మరింత ప్రమోట్ చేయాలన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉంది.

పెట్టుబడి ఖర్చు తగ్గించేలా :

ఏపీలో రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గాలన్నది ప్రభుత్వం విధానంగా ఉంది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తే ఉత్పత్తులకు మేలు కలుగుతుందని భావిస్తున్నారు. ఇక రైతులు ఏ ఏ పంటలు సాగు చేశారు అలాగే వారికి ఎటువంటి సాయం కావాలనేది నేరుగా తెలుసుకునే వీలు కల్పిస్తారు. సాగులో పురుగు మందుల వినియోగం వల్ల జరిగే నష్టాలను రైతులకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించాలన్నది కూడా రైతన్న మీ కోసంలో ముఖ్య భాగంగా ఉంది. దీంతో పాటు తక్కువ వినియోగం వల్ల కలిగే లాభాలను అలాగే, సేంద్రియ సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ ఏ స్థాయిలో ఉందనేది అధికారులు ప్రజా ప్రతినిధులు రైతులకు వారి ఇళ్ళ వద్దనే వివరిస్తారు.

Tags:    

Similar News