జగన్ గురించి రాహుల్ ఎందుకు మాట్లాడాలి?
ఔను!. వైసీపీ అధినేత జగన్ గురించి కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటులో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడాలి?.;
ఔను!. వైసీపీ అధినేత జగన్ గురించి కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటులో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడాలి?. ఇదే ఇప్పుడు రాజకీయంగా జరుగుతున్న చర్చ. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ జరిగింద ని ఆరోపిస్తూ.. రాహుల్‌గాంధీ ఉద్యమానికి తెరదీశారు. గురువారం రాత్రి దేశంలో క్యాండిల్ ర్యాలీలను కూడా నిర్వహించారు. ఈ క్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. దేశం మొత్తం గురించి.. రాహుల్ మాట్లాడాడని, కానీ, ఏపీలోనూ ఓట్ల చౌర్యం జరిగిందని.. దీనిని ఎందుకు పట్టించుకోవడం లేదన్నది జగన్ మాట.
ఇదే విషయాన్ని మీడియా ముందు జగన్ వ్యాఖ్యానించారు. అయితే.. రాహుల్ ఎందుకు స్పందించాలని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ``ముందు జగన్ స్పందించాలి. రాహుల్ చేస్తున్న పోరాటానికి ఆయన మద్దతు ఇవ్వాలి. అప్పుడు రాహుల్‌ను ఆయన ప్రశ్నించడం తప్పుకాదు`` అని తెలంగాణకు చెందిన ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ కూడా చెప్పుకొ చ్చారు. మోడీ చేస్తున్న ఓట్ల చౌర్యంపై జగన్‌కు మాట్లాడే దమ్ముంటే.. ఆయన నోరు విప్పాలన్నది కాంగ్రెస్ డిమాండ్.
అంతేకాదు.. కర్ణాటక, మహారాష్ట్రలలో జరిగిన ఓట్ల చౌర్యంపై రాహుల్ ప్రశ్నించినప్పుడు జగన్ ఎందుకు స్పందించలేదన్నది కూడా ప్రధాన ప్రశ్న. దీనికి ప్రధానంగా మోడీ అంటే భయపడుతున్నారని.. ఆయన కు కేంద్రంతో ఇప్పటికీ అనుబంధం కొనసాగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీ విషయంలో రాహుల్ స్పందించాల్సిన అవసరం లేదని.. ఇక్కడ తమ పార్టీ పుంజుకునే స్థితిలో ఉందని.. అధికారంలో కి వచ్చే పరిస్థితిలో తాము లేము కాబట్టి.. ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికి ఉంటాయని నేతలు చెబుతున్నారు.
కానీ, జగన్ మాత్రం తన బాధను దేశం బాధగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు దుయ్యబడుతున్నారు. జగన్ విషయాన్ని రాహుల్ ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఈ స్థితికిరావడానికి కారణం జగన్ కాదా? అన్నది వారి ప్రధాన ప్రశ్న. తల్లికి, చెల్లికి కూడా న్యాయం చేయలేదని.. వారి ఆస్తులు కూడా పోగేసుకున్నారని కాంగ్రెస్ మాజీ ఎంపీ ఒకరు విజయవాడలో వ్యాఖ్యానించారు. సో.. ఇదీ సంగతి!.