రాహుల్ ఆగ్రహంలో న్యాయముందా? ఆయన చెప్పినట్లే జరిగిందా?

దేశంలో వంట గ్యాస్ ధరల్ని భారీగా పెంచిన కేంద్ర సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.;

Update: 2026-05-02 05:26 GMT

దేశంలో వంట గ్యాస్ ధరల్ని భారీగా పెంచిన కేంద్ర సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ధరాభారం గురించి ముందే ఊహించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోడీ సర్కారుపై మండిపడుతున్నారు. తాను చెప్పిందే జరిగిందన్న ఆయన.. పెట్రోల్.. డీజిల్ ధరలపై తాను చెప్పినట్లే పెంపు ఖాయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఎన్నికల తర్వాత ధరాభారం ఖాయమని తాను ముందు నుంచే చెబుతున్నానని.. అందుకు తగ్గట్లే ఎన్నికల పోలింగ్ పూర్తైన వెంటనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్ని భారీగా పెంచేసిన కేంద్రం.. దీన్ని ఎన్నికల బిల్లుగా పేర్కొన్నారు. తాజాగా ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. వాణిజ్య సిలిండర్ల ధర ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా పెరిగాయని.. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు ఒక్కో సిలిండర్ మీద రూ.1380 మేర పెరిగినట్లుగా పేర్కొన్నారు.

కేవలం మూడు నెలల వ్యవధిలోనే 81 శాతం పెరిగిన వైనాన్ని వెల్లడిస్తూ.. ఎన్నికల తర్వాత ఇలా జరుగుతుందని తాను ముందే చెప్పానంటూ తన మాటల్ని గుర్తు చేశారు. టీస్టాల్స్.. ధాబాలు.. బేకరీ.. స్వీట్ షాపులు.. ఇలా అందరిపైనా భారం పెరిగిందని.. చివరకు ఆహార ఖర్చుల మీదా ప్రభావం పడుతుందన్నారు. మొదట ఎల్పీజీ గ్యాస్.. తర్వాత పెట్రోల్.. డీజిల్ బాంబ్ పేలనుందన్న విషయాన్ని పేర్కొన్నారు.

‘అలెర్టుగా ఉండండి. ఎన్నికల వల్ల కలిగిన ఉపశమనం ఇక ముగిసినట్లే. ఇంధన ధరలు తక్కువగా ఉన్నప్పుడు మోడీ సర్కారు లాభాల్ని దండుకుంది. ఇప్పుడు ధరలు పెరిగాయి. కాబట్టి ధరాభారాన్ని ప్రజలపై పెడుతోంది’ అన్న హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పెట్రోల్.. డీజిల్ ధరల పెంపు అంశంపై కేంద్రం ఒక నిర్ణయాన్ని తీసుకుందన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. పెట్రోల్.. డీజిల్ ధరల పెంపు ఉండదంటూ మోడీతో సహా కేంద్ర మంత్రులు కూడా పేర్కొన్న నేపథ్యంలో.. ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. సోమవారం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పెట్రో ధరల బాంబ్ పేలటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News