రాహుల్ దూకుడుకు ఈసీ ఎండ్ కార్డు ?
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈసీ మీద చాలా తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే అన్ స్టాపబుల్ అన్నట్లుగా ఆయన వైఖరి సాగుతోంది.;
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈసీ మీద చాలా తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే అన్ స్టాపబుల్ అన్నట్లుగా ఆయన వైఖరి సాగుతోంది. ఆగస్టు 7న ఆయన మొదలెట్టారు. ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ ఈసీ మీద తన తుపాకులు ఎక్కుపెట్టారు. ఓట్ల చోరీ అన్నారు నిజానికి ఇది చాలా తీవ్రమైన పదం, అంతే కాదు అభ్యంతరకరమైన పదం. ఇక ఈసీకి ఆయన పక్షపాతం ఉందని కూడా భారీ అభియోగం మోపారు. ఈసీ బీజేపీకి సహకరిస్తోంది అని అతి పెద్ద ఆరోపణలు చేశారు
ఈసీ తీరు అలా :
దేశంలో 1952 నుంచి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికి కొన్ని వందల సార్లు వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈసీ హయాంలో జరిగాయి. అలాగే దాదాపుగా రెండు పదుల సార్లు కేంద్రంలో ప్రభుత్వం కోసం ఎన్నికలు జరిగాయి. ఇన్ని సార్లు ఎన్నికలు జరిగినా ఈసీ మీద ఈ స్థాయిలో ఎవరూ ఆరోపణలు చేయలేదు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు ఈసీ మూలాలనే ప్రశ్నిస్తున్నాయి. ఈసీ ఉనికి మీదనే అవి సవాల్ చేసేలా ఉన్నాయి. అయినా ఈసీ పెద్దగా రియాక్ట్ కావడం లేదు అన్న చర్చ అయితే అంతటా ఉంది.
రాహుల్ రెట్టిస్తున్నా :
ఈసీ అంటే సర్వ స్వతంత్ర సంస్థ. అంతే కాదు ఈసీ రాజ్యాంగ బద్ధ సంస్థ. అలాంటి సంస్థ మీద ఒక బాధ్యతాయుతమైన పార్టీకి చెందిన నాయకుడు. ఈ దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నారు, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ వ్యవహరిస్తున్నారు. అలాంటి రాహుల్ గాంధీ ఈసీ మీద వరసబెట్టి విమర్శలు చేస్తున్నారు ఓట్ల చోరీ జరిగింది అని తనకు ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. ఆన్ లైన్ లో ఓట్ల తొలగింపు జరిగిందని అంటున్నారు. ఇక ట్వీట్లతో ఆయన ఈసీని మరింతగా రెట్టిస్తున్నారు. తెల్లవారు జామున లేచి కొన్ని ఓట్లు డిలిట్ చేయడమే వారి పని అంటూ ఎకసెక్కమాడుతున్నారు. ఎక్కడో ఉండి మరెక్కడో ఓట్లు తీసేస్తున్నారు అని అంటున్నారు.
ఒక ప్రెస్ మీట్ కొన్ని ట్వీట్లు :
ఈసీ అయితే ఆగస్టు 17న ఒకసారి ప్రెస్ మీట్ పెట్టింది. రాహుల్ గాంధీ చేసిన విమర్శలు తప్పు అని ఎన్నికల ప్రధానాధికారి ఖండించారు. ఆయన దగ్గర ఆధారాలు ఉంటే అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కోరారు. లేకపోతే క్షమాపణలు చెప్పాలని అన్నారు ఆ తరువాత మళ్ళీ ఎవరూ ప్రెస్ ముందుకు రాలేదు. ఇక ట్వీట్లతోనే ఖండిస్తున్నారు తాజాగా కూడా రాహుల్ గాంధీ మరిన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు వాటి మీద కూడా తీరు అలాగే ఉంది.
ప్రజలకు క్లారిటీ ఇవ్వరా :
ఇక ఈసీ మీద రాహుల్ విమర్శలు చేస్తూంటే బీజేపీ నేతలు ముందుకు వచ్చి రాహుల్ మీద విరుచుకుపడుతున్నారు. ఆయనకు రాజ్యాంగం మీద గౌరవం లేదని ఆయన మాటలకు అర్థాలు కూడా లేవని ఏవేవో విమర్శలు చేస్తున్నారు. దాంతో రాహుల్ అన్నట్లుగా ఈసీ బీజేపీ బంధం బలంగా ఉందని జనాలు అర్ధం చేసుకోవాలా అన్న మరో చర్చకు ఆస్కారం ఇచ్చేలా ఈ విధానం ఉందని అంటున్నారు. రాహుల్ గాంధీ ఆరోపణలను అలా లైట్ తీసుకుని ఊరుకుంటారా లేక వాటి మీద ఈసీ చెప్పాల్సింది చెప్పేశాం కాబట్టి అవి రాజకీయ విమర్శలుగా జమకట్టి ఊరుకుంటారా అన్న సందేహాలు అయితే కలుగుతున్నాయి.
ఈసీ రాహుల్ కి కాదు దేశంలో వంద కోట్ల ఓటర్లకు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది అని అంటున్నారు. అంతే కాదు, ఈ రోజు రాహుల్ రేపు మరొకరు ఎవరైనా ఆరోపణలు చేస్తే ఇలా ఖండించి ఊరుకుంటారా లేక తప్పు ఒప్పు ఇదీ అని చెబుతారా అన్నది కూడా జనం మదిలో మెదిలే ప్రశ్నలుగా ఉన్నాయి. ఎండ్ కార్డ్ ఈ ఇష్యూకి వేయాలి అంటే ఈసీ రాహుల్ విషయంలో యాక్షన్ కి దిగాల్సి ఉందని అంటున్నారు. ఆయనది తప్పు అయినపుడు ఈసీ చర్యలు చేపట్టాలి. లేకపోతే రాహుల్ దే కరెక్ట్ అని జనాలు అనుకునే పరిస్థితి కూడా ఉంటుంది అని అంటున్నారు. ఎన్నికలు వస్తాయి పోతాయి, రాజకీయ పార్టీలు కూడా గెలుస్తాయి, ఓడుతాయి, కానీ ప్రజాస్వామ్యం ఎపుడూ గెలవాలి అది జరగాలి అంటే ఈసీ అన్న వ్యవస్థ బలంగా ఉండాలి, అనుమానాలు ఏ మాత్రం ఆ వ్యవస్థ మీద పడకూడదు, అది జరగాలి అంటే ఈసీ ఏమి చేయాలో అది చేయాలని అంతా కోరుతున్నారు.