ట్రంప్ అబద్దాలు.. రాహుల్ 5 ప్రశ్నలు.. మోడీ సర్కార్ స్పందన ఇదీ

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ ఐదు ప్రశ్నలతో కూడిన సవాలును విసిరారు.;

Update: 2025-10-16 09:13 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తాజా వ్యాఖ్యలు భారత్-రష్యా చమురు కొనుగోళ్ల అంశాన్ని మరోసారి అంతర్జాతీయ వేదికపైకి తీసుకువచ్చాయి. రష్యా నుంచి చమురు దిగుమతులు ఆపేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్‌ వెల్లడించడంతో దేశీయంగా అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ ఐదు ప్రశ్నలతో కూడిన సవాలును విసిరారు. అయితే, దీనిపై మోదీ సర్కార్ అధికారికంగా స్పందిస్తూ తమ స్వతంత్ర ఇంధన విధానాన్ని స్పష్టం చేసింది.

* ట్రంప్ వ్యాఖ్యలు: "మోదీ హామీ ఇచ్చారు"

వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన డొనాల్డ్‌ ట్రంప్‌ కీలకాంశాన్ని ప్రస్తావించారు. “భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై నేను మోదీతో చర్చించాను. ఆయన ఇకపై రష్యా చమురు కొనుగోళ్లు ఆపేస్తామని నాకు హామీ ఇచ్చారు” అని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా చమురు కొనుగోళ్లు పుతిన్‌ యుద్ధానికి నిధులుగా మారుతున్నాయని అమెరికా భావిస్తోందనే విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే అదే సమయంలో ట్రంప్, "మోదీ నా మంచి స్నేహితుడు. భారత్‌ మా సన్నిహిత భాగస్వామి" అంటూ మోదీపై ప్రశంసలు కురిపించారు.

* భారత్ స్పందన: "వినియోగదారుల ప్రయోజనాలే కీలకం"

ట్రంప్‌ వ్యాఖ్యలపై భారత్ తక్షణమే స్పందించింది. విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్ కీలక ప్రకటన చేశారు. "భారత ఇంధన విధానాలు ఎల్లప్పుడూ వినియోగదారుల ప్రయోజనాలకే కట్టుబడి ఉంటాయి." "స్థిరమైన ఇంధన ధరలు, సురక్షిత సరఫరా గొలుసులు కొనసాగించడమే మా ప్రధాన లక్ష్యం.” భారత్‌ తన ఇంధన వనరులను విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. గత దశాబ్ద కాలంగా అమెరికాతో సహా పలు దేశాల నుంచి ఇంధనం దిగుమతి చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. సరైన ధరల వద్ద సరఫరా లభిస్తేనే కొత్త ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

అయితే, రష్యా చమురు కొనుగోళ్లపై మోదీ హామీ ఇచ్చారన్న ట్రంప్‌ వ్యాఖ్యలపై మాత్రం రణధీర్ జైస్వాల్ ప్రత్యక్షంగా స్పందించలేదు, కానీ భారత్‌ తన స్వతంత్ర ఇంధన అవసరాలపైనే దృష్టి పెడుతుందని పరోక్షంగా తెలియజేశారు.

* రష్యా స్పందన: "మా చమురు భారత ఆర్థిక వ్యవస్థకు కీలకం"

ట్రంప్‌ వ్యాఖ్యలపై రష్యా కూడా స్పందించింది. భారతదేశానికి తమ చమురు సరఫరా ఆర్థికంగా కీలకమని రష్యా రాయబారి డెనిస్‌ అలిపోవ్‌ పేర్కొన్నారు. "రష్యా-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం విశ్వాసంపై ఆధారపడి ఉంది. భారత విధానాలను గౌరవిస్తూ మేము ముందుకు సాగుతాం. భారత్‌తో మా దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగిస్తాం” అని ఆయన స్పష్టం చేశారు.

* రాహుల్ గాంధీ సవాలు: మోదీకి 5 ప్రశ్నలు

ట్రంప్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “ట్రంప్‌ను చూసి మోదీ భయపడ్డారు” అని విమర్శిస్తూ, ప్రభుత్వాన్ని వివరణ కోరుతూ ఐదు ప్రశ్నలు సంధించారు..

రష్యా చమురు కొనుగోలు చేయదని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడానికి భారత్‌ ఎందుకు అనుమతిస్తోంది?

పదేపదే అవమానాలు ఎదురైనా మోదీ ప్రభుత్వం ఎందుకు నిశ్శబ్దంగా ఉంది?

ఆర్థిక మంత్రి అమెరికా పర్యటనను రద్దు చేసుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటి?

గాజా శాంతి సమావేశానికి ప్రధాని హాజరుకాకపోవడం దేనికి సంకేతం?

ఆపరేషన్‌ సిందూర్‌పై ట్రంప్‌ వ్యాఖ్యలను విభేదించకపోవడం ఎందుకు?

ఈ పరిణామాలు భారత్‌ విదేశాంగ ప్రతిష్ఠకు నష్టం కలిగిస్తున్నాయని రాహుల్‌ గాంధీ ఆరోపించారు.

* భారత్-అమెరికా వాణిజ్య కోణం

ప్రస్తుతం భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్న తరుణంలో ట్రంప్‌ వ్యాఖ్యలు మరింత సున్నితంగా మారాయి. వాణిజ్య కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్ మాట్లాడుతూ, అమెరికా నుంచి చమురు కొనుగోలుకు భారత్‌ సిద్ధంగానే ఉందని, కానీ సరైన ధర లభిస్తేనే ముందడుగు వేస్తామని చెప్పారు. గతంలో అమెరికా నుంచి $22-23 బిలియన్‌ డాలర్ల ఇంధనం కొనుగోలు చేసినట్లు, భవిష్యత్తులో ఈ విలువ $30 బిలియన్‌ డాలర్లకు చేరే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

*సున్నితమైన సమతుల్యత

రష్యా చమురు దిగుమతుల విషయంలో భారత్‌ సున్నితమైన సమతుల్యతను పాటిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా ఒత్తిడి.. తక్కువ ధరలకు లభించే రష్యా ఇంధనం ఈ రెండు అంశాల మధ్య భారత్ తన జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా స్వతంత్ర ఇంధన విధానాన్ని అనుసరిస్తున్నట్లు అధికారిక వివరణలు సూచిస్తున్నాయి. ట్రంప్‌ వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీసినప్పటికీ, భారత్ తన ఇంధన భద్రత మరియు ఆర్థిక ప్రయోజనాలకే కట్టుబడి ఉంటుందనే సందేశం ఇచ్చింది.

Tags:    

Similar News