పాక్ తో ట్రంప్ బంధం వెనుక అంత పెద్ద వ్యవహారం దాగుందా..?
అవును... జపాన్ లో అమెరికా మాజీ రాయబారి రహమ్ ఇమాన్యుయేల్ తాజాగా స్పందిస్తూ... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో దశాబ్దాల ద్వైపాక్షిక దౌత్య పురోగతిని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపించారు.;
రెండోసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత పైకి భారత్ ను, భారత ప్రధాని మోడీని పొగుడుతున్నట్లు కనిపిస్తూనే.. వెనుక సుంకాలతో గిల్లుతున్న డొనాల్డ్ ట్రంప్.. మరోపక్క పాకిస్థాన్ తో రాసుకుపూసుకు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం భారత్, అమెరికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీని వెనుక ఓ బలమైన కారణం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ దేశ మాజీ రాయబారి ఒకరు.
అవును... జపాన్ లో అమెరికా మాజీ రాయబారి రహమ్ ఇమాన్యుయేల్ తాజాగా స్పందిస్తూ... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో దశాబ్దాల ద్వైపాక్షిక దౌత్య పురోగతిని విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపించారు. చైనాను ఎదుర్కోవడంలో అమెరికాకు భారత్ అత్యంత కీలకమైన భాగస్వామి అనే విషయాన్ని గుర్తించకుండా అధ్యక్షుడు అహం చూపిస్తున్నారని అంటూ.. పాక్ నుంచి ట్రంప్ కుమారుడికి పెద్ద ఎత్తున డబ్బు అందుతోందని అన్నారు.
వాస్తవానికి... ఈ ఏడాది ఏప్రిల్ లో పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్ తో అమెరికా వ్యాపారవేత్త జాక్ విట్కాఫ్ మధ్య బిజినెస్ డీల్ జరిగిన సంగతి తెలిసిందే! ఇదే సమయంలో... విట్కాఫ్ కంపెనీలో ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్, అల్లుడు జేర్డ్ కుష్నర్ వాటాదారులుగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఇమాన్యుయేల్.. పాక్ డబ్బుల కోసం భారత్ పై ఆయన కక్ష తీర్చుకుంటున్నారని అన్నారు.
ఇదే సమయంలో... అధ్యక్షుడు తాను అమలు చేసిన కాల్పుల విరమణకు నోబెల్ శాంతి బహుమతికి అర్హుడని మోడీ చెప్పరు కాబట్టి ఆయన అవన్నీ చేస్తున్నారని ఆరోపించిన ఇమాన్యుయేల్.. దీనిని ఒక పెద్ద వ్యూహాత్మక తప్పిదంగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో... వాషింగ్టన్ అనుసరిస్తున్న తప్పుడు చర్యలను బీజింగ్ అందిపుచ్చుకుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా మహాసముద్రంలో పెరుగుతున్న చైనా ఉనికిని, అమెరికా వస్తువులపై పెరుగుతున్న సుంకాలను ఆయన ఎత్తి చూపారు.
కాగా... 2009 నుండి 2010 వరకు అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా.. 2011 నుండి 2019 వరకు చికాగో మేయర్ గా పనిచేసిన ఇమాన్యుయేల్.. 2003 నుండి 2009 వరకు అమెరికా ప్రతినిధుల సభలో మూడు పర్యాయాలు కూడా పనిచేశారు.
పాడిందే పాడరా అన్నట్లుగా...!:
మరోవైపు ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ - పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం సమయంలో.. కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. ఇందులో భాగంగా... ఇరు దేశాలు యుద్ధం ఆపకపోతే 200% టారిఫ్ లు విధిస్తానని తాను హెచ్చరించానని.. వాణిజ్యంతోనే తాను ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించానని తెలిపారు. దీంతో... ఈ విషయంపై ట్రంప్ ఇప్పటికి సుమారు 50 సార్లు మాట్లాడారని అంతర్జాతీయ మీడియా నివేదించింది!