ఇంకా ఐసీయూలోనే పాక్ ఎయిర్ బేస్ లు... లేటెస్ట్ నోటమ్ ఇదే!

అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదులపై భారత్ ఆపరేషన్ సిందూర్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 9 ఉగ్ర శిబిరాలతోపాటు సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.;

Update: 2025-07-19 11:30 GMT

జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలోని బైసరన్ లోయలో ఆహ్లాదంగా గడుపుతున్న పర్యాటకులపై ఉగ్రమూకలు దాడి చేసి నరమేథం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీంతో.. తొలుత ఉగ్రమూకలకు, తదుపరి పాక్ కు ముచ్చెమటలు పట్టించింది. అయితే.. నాడు భారత్ కొట్టిన దెబ్బకు పాక్ ఇంకా రిపేర్లు చేసుకుంటూనే ఉందనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదులపై భారత్ ఆపరేషన్ సిందూర్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 9 ఉగ్ర శిబిరాలతోపాటు సుమారు 100 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ సమయంలో తగుదునమ్మా అంటూ పాక్ సైన్యం రంగంలోకి దిగింది.. దీంతో భారత సైన్యం క్షిపణులతో విరుచుకుపడింది. పాక్ లోని కీలక ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసింది.

ఈ విధంగా నాడు భారత్ కొట్టిన దెబ్బ నుంచి పాకిస్థాన్ ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ జరిగి సుమారు రెండు నెలలు దాటినా.. రహీమ్ యార్‌ ఖాన్ ఎయిర్‌ బేస్‌ వద్ద ఉన్న ఒకే ఒక్క రన్‌ వే ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. దీంతో... ఆ విమానాశ్రయ మూసివేతను మూడోసారి పొడిగించింది పాకిస్థాన్. ఈ మేరకు తాజాగా నోటమ్ విడుదల చేసింది.

ఇందులో భాగంగా.. ఆగస్టు 5 వరకు రహీమ్ యార్‌ ఖాన్ ఎయిర్‌ బేస్‌ వద్ద ఉన్న రన్‌ వే మూసివేసి ఉంటుందని తెలిపింది. అయితే ఆ మూసివేతకు గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. వాస్తవానికి మే 10న భారత్‌ దాడి చేసిన నేపథ్యంలో తొలి నోటమ్ జారీ అయింది. దాంతో పంజాబ్ ప్రావిన్స్‌ లో ఉన్న ఈ ఎయిర్‌ బేస్‌ ఒక వారం రోజుల పాటు అందుబాటులో ఉండదని మాత్రం చెప్పింది.

ఆ తర్వాత జూన్ 4న రెండో నోటమ్ జారీ చేసింది. అందులో... ఎయిర్ బేస్ మూసివేతను జులై 4 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో తాజా నోటమ్ లో దాన్ని.. ఆగస్టు 5 వరకూ మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఇలా వరుస పొడిగింపుల వేళ.. భారత్ ఆపరేషన్ సిందూర్ దెబ్బకు పాక్ ఇంకా కోలుకున్నట్లు లేదనే చర్చ బలంగా జరుగుతోంది.

కాగా... ఈ ఎయిర్‌ బేస్‌ గురించి భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... భారత్ దెబ్బకు పాకిస్థాన్ లోని రహీమ్ యార్‌ ఖాన్‌ ఎయిర్‌ బేస్ ఐసీయూలో ఉందని రాజస్థాన్‌ లోని ఓ సభలో ఆయన ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో తాజాగా.. ఆ ఎయిర్ బేస్ ఇంకా ఐసీయూలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News