ఏపీకి ఇంకో భారీ పెట్టుబడి.. విశాఖ మెడలో మరో ఆభరణం!
ఇది విశాఖకు మరో ఆభరణం కానుందని అంటున్నారు. ఇందులో భాగంగా... ప్రముఖ నిర్మాణ సంస్థ కె.రహేజా కార్పొరేషన్ భారీ పెట్టుబడులతో రాబోతోంది.;
విశాఖలో గూగుల్ సంస్థ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోన్న సంగతి తెలిసిందే. దీనికి అనుబంధంగా భారీ సంఖ్యలో ఇతర సంస్థలు పెట్టుబడులతో వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో అనుకున్నట్లుగానే ఏపీకి మరో భారీ పెట్టుబడి రాబోతోంది. ఇది విశాఖకు మరో ఆభరణం కానుందని అంటున్నారు. ఇందులో భాగంగా... ప్రముఖ నిర్మాణ సంస్థ కె.రహేజా కార్పొరేషన్ భారీ పెట్టుబడులతో రాబోతోంది.
అవును... విశాఖకు ప్రముఖ నిర్మాణ సంస్థ కె.రహేజా కార్పొరేషన్ భారీ పెట్టుబడులతో రాబోతోంది. ఈ సందర్భంగా... ఐటీ సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాల సముదాయాలు నిర్మించేందుకు ఆ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. దీనికోసం రూ.2,172.26 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుండగా... సుమారు 9,681 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది. దినికోసం 27.10 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది.
ఈ సందర్భంగా రహేజా సంస్థ తన ప్రతిపాదనలో భాగంగా... 2028 నాటికి వాణిజ్య భవనాలను, 2030 నాటికి నివాస సముదాయాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో... మొదటి దశ పనులకు రూ.663.42 కోట్లు ఖర్చు చేసి, 9.59 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.
ఇక రెండో దశ విషయానికొస్తే... 2031 నాటికి వాణిజ్య భవనాలను, 2035 నాటికి నివాస సముదాయాలను పూర్తి చేయాలని యోచిస్తోంది. దీనికోసం రూ.1,418.84 కోట్లు వెచ్చించి, 19.06 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని అభివృద్ధి చేయనుంది. అంటే... సంస్థ 2028 – 2035 మధ్య రెండు దశల్లో భారీ నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టనుంది.
ఊహించినట్లుగానే గూగుల్ ఎఫెక్ట్!:
విశాఖలో గూగుల్ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోన్న నేపథ్యంలో... దీనికి అనుబంధంగా భారీ సంఖ్యలో ఐటీ కంపెనీలు వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో వాటన్నింటికీ ఆఫీస్ స్పేస్ అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో... కొత్తగా వచ్చే కంపెనీలకు ఆఫీస్ స్పేస్ ను అందుబాటులోకి తేవాల్సి ఉంది. రహేజా రెండు దశల్లో చేపట్టే ప్రాజెక్టు ద్వారా సుమారు 28.65 లక్షల చ.అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుంది.
కాగా... ప్రస్తుతం ఉన్న మిలీనియం టవర్ 1, 2లో ఉన్న సుమారు 6 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ తదితర సంస్థలకు ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే.