రఘురామ నోట మాట.. పవన్ కు పొగడ్తా? పంచ్?
ఎప్పటిలానే పవన్ ను ఉద్దేశించి ఎవరేం అన్నా.. అందులో ఏదో ఒక నెగిటివిటినీ బయటకు లాగి.. దాన్ని తప్పుగా ప్రచారం చేసే బ్యాచ్ ఇప్పటికే రఘురామ వ్యాఖ్యను పంచ్ గా అభివర్ణిస్తున్నారు.;
నరం లేని నాలుక చేసే యేషాలు అన్నిఇన్ని కావన్నట్లుగా ఉంటాయి. మనసులోని భావాల్ని శబ్ధరూపంలో వచ్చే వేళ.. గొంతు నుంచి నాలుక ద్వారా వచ్చే మాటలు చేసే మేజిక్ అంతా ఇంతా కాదు. మనసులోని భావానికి అనుగుణంగా మాట లేకపోతే మొదటికే మోసం వచ్చే పరిస్థితి. గతంలో ఇలాంటి అనుభవాలెన్నో తెలుగు ప్రజలకు ఉన్నాయి. శుక్రవారం ఏపీ అసెంబ్లీ వేదికగా చోటు చేసుకున్న ఒక సంభాషణకు సంబంధించిన వీడియో.. వైరల్ గా మారింది. ప్లాస్టిక్ నిషేధం మీద కొనసాగుతున్న చర్చ సందర్భంగా కలుగజేసకున్న ఏపీ ఉపసభాపతి రఘరామక్రిష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సింగిల్ ప్లాస్టిక్ నిషేధానికి మీలాంటి హీరోతో యాడ్ చేయాలంటే కోట్లు ఖర్చు అవుతుందని.. సంబంధిత శాఖా మంత్రిగా హీరోగా మీరే అలా కాలర్ ఎగురవేసి.. ఒక్క పిలుపునిస్తే.. మీ జనసైనికులే రంగంలోకి దిగుతారని చెప్పటం..దీనికి ప్రతిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం ఆపుకోలేక నవ్వేశారు. సభ సైతం ఆర్ఆర్ఆర్ చేసిన వ్యాఖ్యను కాంప్లిమెంట్ గా తీసుకున్నదే తప్పించి.. తప్పుగా తీసుకున్నది లేదు.
కొన్నేళ్ల క్రితం ఏపీ రోడ్లకున్న గుంతలు పూడ్చాలని పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చినంతనే.. జనసైనికులు రంగంలోకి దిగి.. దాని సంగతి చూశారని.. అలానే సింగిల్ ప్లాస్టిక్ విషయంలోనూ ఆయన అలాంటి పిలుపును ఇవ్వాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. పవన్ ను ఉద్దేశించి రఘురామ చేసిన వ్యాఖ్య పొగడ్తా.. లేదంటే పంచ్ వేశారా? అన్నదిప్పుడు చర్చగా మారింది.
ఎప్పటిలానే పవన్ ను ఉద్దేశించి ఎవరేం అన్నా.. అందులో ఏదో ఒక నెగిటివిటినీ బయటకు లాగి.. దాన్ని తప్పుగా ప్రచారం చేసే బ్యాచ్ ఇప్పటికే రఘురామ వ్యాఖ్యను పంచ్ గా అభివర్ణిస్తున్నారు. నిజానికి ఉప సభాపతి రఘురామ సభా అధ్యక్ష స్థానంలో ఉన్న వేళలో చేసిన వ్యాఖ్యను జాగ్రత్తగా కనిపిస్తే.. పవన్ మీద ఆయనకున్న అభిమానం.. ఆయన ఇమేజ్ విషయంలో తనకున్న నమ్మకాన్ని తన మాటల రూపంలో చెప్పారని చెప్పాలి. కోట్ల రూపాయిల రెమ్యునరేషన్ మాట విషయాన్ని ప్రస్తావించటాన్ని చూసినప్పుడు.. అందులో తప్పేం ఉందన్న మాటే వినిపిస్తోంది.
నిజమే.. కమర్షియల్ మూవీస్ విషయంలో తాను ఉచితంగా చేస్తానని.. సేవా భావంతో తక్కువ ధరకే చేస్తాననిపవన్ ఎప్పుడూ చెప్పలేదు. అదే సమయంలో.. సమాజానికి పనికి వచ్చే అంశాన్ని ప్రచారం చేసేందుకు ఆయన ఒక్క రూపాయి అడిగే అవకాశం లేదు. ఆయన మైండ్ సెట్ అలాంటిది కాదు. కాకుంటే.. సమాజహితానికి సంబంధించిన అంశం మీద యాడ్ చేయాల్సి వస్తే.. పవన్ ఉచితంగానే నటిస్తారు తప్పించి.. డబ్బులు తీసుకోరు.
ఈ విషయాన్ని పవన్ గురించి తెలిసిన వారు ఎవరైనా చెబుతారు. ఇక్కడే రఘురామ చేసిన వ్యాఖ్య పవన్ తీరుకు ఏ మాత్రం అతకనట్లుగా కనిపిస్తుంది. అందుకే అంతో ఇంతో చర్చ. లేదంటే. ఆయన చేసిన వ్యాఖ్యను పొగడ్తగా తీసుకోవటమే తప్పించి.. పంచ్ గా భావించే అవసరమే ఉండదని చెప్పాలి. అందుకే అంటారు ఏదైనా విషయం మీద నలుగురి ముందు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుందని.మనసులో ఎలాంటి నెగిటివ్ భావన లేనప్పుడు.. చేసిన వ్యాఖ్యలో ఉండే ఒకట్రెండు మాటలు మొత్తం అర్థాన్ని మార్చేస్తాయంటే ఇదేనని చెప్పాలి.