జగన్ తో జగడం.. ఆ సీక్రెట్ ఎట్టకేలకే చెప్పిన రఘురామ
మాజీ ముఖ్యమంత్రి జగన్, డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు మధ్య వైరం జగమెరిగిన సత్యం. కానీ, వారిద్దరి మధ్య వైరానికి కారణమేంటి? అన్నది చాలా మందికి తెలియదు.;
మాజీ ముఖ్యమంత్రి జగన్, డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు మధ్య వైరం జగమెరిగిన సత్యం. కానీ, వారిద్దరి మధ్య వైరానికి కారణమేంటి? అన్నది చాలా మందికి తెలియదు. వైసీపీపై విమర్శలు చేయటం వల్లే రఘురామ, జగన్ మధ్య దూరం పెరిగిందని అంతా అనుకుంటారు. కానీ, ఏదైనా సరే ఎక్కడో ఒకచోట మొదలవుతుంది. అలా జగన్, రఘురామ మధ్య వివాదం మొదలవ్వడానికి కారణం ఏంటన్నది తాజాగా బయటపెట్టారు డిప్యూటీ స్పీకర్.. నరసారావుపేటలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ విగ్రహావిష్కరణకు వెళ్లిన రఘురామరాజు.. తనకు జగన్ కు మధ్య వివాదానికి కారణమైన అసలు విషయం వివరంగా చెప్పారు.
ఐదేళ్లపాటు వైసీపీ పాలకులకు పంటి కింద రాయిలా, కంట్లో నలుసులా రఘురామ తయారవ్వడానికి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కారణమని చెప్పారు రఘురామరాజు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని చెబుతుంటారు. శత్రువైనా మరణించిన తర్వాత క్షమించి వదిలేయాలని, కానీ, వైసీపీ పాలకులు కోడెల మరణించిన తర్వాత ఆయనపై నీచంగా మాట్లాడటాన్ని తాను తట్టుకోలేకపోయానని రఘురామ చెప్పారు. ఇదే విషయాన్ని తాను పార్టీ అధినేత, అప్పటి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లానని వివరించారు.
అయితే జగన్ కూడా కోడెలపై చకవబారు వ్యాఖ్యలు చేశారని, అది విని తాను తట్టుకోలేకపోయానని చెప్పారు. అనవసరంగా మాట్లాడోద్దని తాను సూచిస్తే.. తనపై తన సొంత నియోజకవర్గం నేతలను ఉసిగొల్పారని వివరించారు. తాను నియోజకవర్గంలో అడుగుపెట్టలేని వాతావరణం సృష్టించారని వెల్లడించారు. ఇక అప్పటి నుంచి తనకు వైసీపీ అధినేత జగన్ కు బాగా గ్యాప్ వచ్చిందని.. అసలు విషయాన్ని తెలిపారు. ఈ క్రమంలోనే తనపై వేధింపులు, కేసులు, కస్టోడియల్ టార్చర్ చూపించారని గుర్తు చేశారు రఘురామ.
వాస్తవానికి రాజకీయాల్లోకి రావాలని తాను ఎప్పుడూ కోరుకోలేదని, కానీ వైసీపీ అధినేత జగన్ నరకం చూపించిన తర్వాత వైసీపీ మళ్లీ గెలవకూడదని కంకణం కట్టుకుని పనిచేశానని అన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ కాకముందే తాను అనేక మందికి ఎన్నికల్లో పోటీ చేసేలా టికెట్ ఇప్పించానని చెప్పారు రఘురామ. తనకు రాజకీయంగా శత్రువులు లేకపోయినా, కోడెలను అవమానిస్తున్నారన్న కారణంగా జగన్ తో శత్రుత్వం ఏర్పడిందని రఘురామ వెల్లడించారు.