మాధవ్ కి అనుకుంటే ఆయనకు దక్కింది ?
బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కి రాజ్యసభ సీటు కచ్చితంగా దక్కుతుందని ఆయన అభిమానులు అనుకున్నారు చాలా మంది కూడా అది జరగాలని కోరుకున్నారు.
ఇద్దరూ ఒకే జిల్లా ఒకే సామాజిక వర్గం. రాజకీయంగా చూస్తే ఒకాయన సీనియర్. అయితే వేరు వేరు పార్టీలు. ఇద్దరూ వారసులుగానే ఎంట్రీ ఇచ్చి తన ప్రతిభను చాటుకుంటూ వస్తున్నారు. ఇద్దరూ ఒకే పదవి ఆశించారు అని ప్రచారం అయితే సాగింది. కానీ చివరికి ఒకరికి ఆ పదవి వరించింది. రాజ్యసభ సీట్ల ఎంపిక విషయంలో ఎన్నో ప్రచారాలు ఎన్నో విశేషాలు అలా చూస్తే వాటిలో ఇది కూడా ఒకటిగా ఉందని అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు ఈసారి రాజ్యసభ సీటు దక్కింది. చాలా ఏళ్ళ తరువాత ఆ పదవి విశాఖను వరించింది అని చెప్పాలి. అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ కి రాజ్యసభ గౌరవం టీడీపీ అందించింది. అయితే ఈ పదవి కోసం ఇదే జిల్లా నుంచి మరొకరి పేరు కూడా వినిపించింది అని అంటున్నారు.
ఆయనకే అంటూ :
బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కి రాజ్యసభ సీటు కచ్చితంగా దక్కుతుందని ఆయన అభిమానులు అనుకున్నారు చాలా మంది కూడా అది జరగాలని కోరుకున్నారు. బీజేపీ కోటాలో వాటాలో ఆయనకే ఈసారి ఈ లక్కీ చాన్స్ అని కూడా భావించారు. కానీ ఆయనకు మాత్రం దక్కలేదు. అయితే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా పార్టీని డెవలప్ చేసే బాధ్యతలో మాధవ్ ఉన్నారని అందువల్ల ఆయన ఈ సీటు ఆశించలేదని చెబుతున్న వారూ ఉన్నారు. కానీ అపుడెపుడో 2017లో ఎమ్మెల్సీగా ఉత్తరాంధ్ర నుంచి నెగ్గిన తరువాత మాధవ్ మళ్ళీ చట్ట సభలోకి అడుగు పెట్టలేదని గుర్తు చేసిన వారూ ఉన్నారు ఆయనకు కూటమి ప్రభుత్వంలో కచ్చితంగా కీలక పదవి దక్కుతుందని అధికార హోదాతో ఆయన ఉంటారని ఆశించిన వారికి మాత్రం ఇది కొంత నిరాశను కలుగచేసింది అని అంటున్నారు.
ఏడాది పూర్తిగా :
ఇక మాధవ్ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా ఏడాది కాలం పూర్తి చేసుకుంటున్నారు. బీజేపీ నిబంధనల ప్రకారం ఆ పదవి రెండేళ్ళు ఉంటుంది. మరి ఆయనకే మరోసారి పార్టీ పదవి అప్పగిస్తార 2029 ఎన్నికల దాకా ఆయనే కొనసాగుతారా అన్నది కూడా చర్చగా సాగుతోంది. అదే విధంగా వచ్చే ఏడాది ఏకంగా 18 దాకా ఎమ్మెల్సీ ఖాళీలు ఏపీలో ఉండబోతున్నాయి. అందులో బీజేపీ కోటా కింద మాధవ్ కి కచ్చితంగా ఒక సీటు వస్తుందని ఆ మీదట ఆయనకు లక్ ఉంటే మంత్రి చాన్స్ కూడా ఉండొచ్చు అన్నది కూడా ఆయన అభిమానుల మాటగా ఉంది.
పోటీకి రెడీనా :
ఇక ఇవీ అవీ కాకపోతే 2029 ఎన్నికల్లో మాధవ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని అంటున్న వారూ ఉన్నారు. ఆయనకు 2014లోనే విశాఖ ఉత్తర నియోజకవర్గం సీటు రావాల్సి ఉందని అనివార్య కారణాల వల్ల మిస్ అయిందని అంటున్నారు. 2029లో మాత్రం ఆయనకు అక్కడ నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ఏది ఏమైనా పీవీఎన్ మాధవ్ బీజేపీలో చురుకైన యువ నేతగా బీసీ నాయకుడిగా ఉన్నారు. ఉత్తరాంధ్రా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు అధికార హోదా దక్కాలని అభిమానులు అయితే గట్టిగానే కోరుకుంటున్నారు. మరి ఆ ముచ్చట ఎపుడు అంటే జరిగేటప్పుడు అని జవాబు కూడా ఎవరికి వారే చెప్పుకుంటున్నారు ఇంతకీ మాధవ్ మదిలో ఏముందో మాత్రం ఎవరికీ తెలియదు అని అంటున్నారు. అధినాయకత్వానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న మాధవ్ కి ఏ పదవి ఇవ్వాలో కేంద్ర పెద్దలకు బాగా తెలుసు అని అంటున్నారు.