టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కు డ్రగ్ పాజిటివ్ : ఈగల్ ఎస్పీ గిరిధర్
ఈ సమయంలో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నమీద్ మిశ్రా గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.;
తెలంగాణలో సంచలనంగా మారిన మొయినాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులకు డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్‌కు కూడా డ్రగ్స్ పాజిటివ్ అని నిర్ధారణ కావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ విషయాన్ని ఈగల్ విభాగం ఎస్పీ గిరిధర్ అధికారికంగా వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని ఆజీజ్‌నగర్ ప్రాంతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాం హౌస్‌లో శనివారం రాత్రి అనుమతి లేకుండా భారీ స్థాయిలో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందింది. దీంతో రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో ఈగల్ టీమ్, ఎస్‌వోటీ సిబ్బంది, స్థానిక పోలీసులు కలిసి ఫాం హౌస్‌పై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
పోలీసులు అక్కడికి చేరుకున్న వెంటనే అక్కడ ఉన్నవారు భయంతో గందరగోళానికి గురయ్యారు. ఈ సమయంలో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నమీద్ మిశ్రా గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఆ తుపాకీ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డిదిగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఆ సమయంలో ఫాం హౌస్‌లో మొత్తం 11 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఢిల్లీ వ్యాపారి నమీద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి సహా పలువురు వ్యాపారవేత్తలు మరియు ఒక మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు నిర్వహించిన ప్రాథమిక డ్రగ్స్ పరీక్షల్లో మొదటగా పైలట్ రోహిత్ రెడ్డి, నమీద్ మిశ్రా, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డిలకు డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. అయితే శనివారం రాత్రి నిర్వహించిన తొలి పరీక్షల్లో ఎంపీ పుట్టా మహేష్‌కు నెగిటివ్ వచ్చినప్పటికీ ఆదివారం ఉదయం నిర్వహించిన తదుపరి పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. శరీరంలోని మెటబాలిజం ప్రభావం కారణంగా ఈ మార్పు వచ్చినట్లు ఈగల్ ఎస్పీ గిరిధర్ వివరించారు.
దర్యాప్తులో భాగంగా నిందితులు ఇటీవల సిమ్లా , గోవా పర్యటనలకు వెళ్లిన సమయంలో డ్రగ్స్‌ను సేకరించి తీసుకువచ్చి ఈ పార్టీలో వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఫాం హౌస్‌లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 2 గ్రాముల కొకైన్ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ నమూనాలను మరింత పరీక్షల కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించారు.
ఈ ఘటనలో పాల్గొన్న వారిపై పోలీసులు పలు చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఎంతటి పెద్దవారు ఉన్నా సరే ఎంపీలు అయినా మాజీ ఎమ్మెల్యేలు అయినా చట్టం ముందు అందరూ సమానమేనని ఎస్పీ గిరిధర్ స్పష్టం చేశారు. చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎంపీ డ్రగ్స్ కేసులో పట్టుబడటం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ఒకవైపు ప్రభుత్వాలు డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు చేపడుతుంటే ప్రజాప్రతినిధులే డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న వార్తలు బయటకు రావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ కేసు రాజకీయ వర్గాల్లోనే కాకుండా సామాజికంగా కూడా పెద్ద చర్చకు దారి తీసింది.