పాక్ ను వణికించిన ఎస్-400 కు మించి ఎస్-500.. ప్రత్యేకతలివే..!

అవును... ఆపరేషన్ సిందూరు లో పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించడంలో రష్యా నిర్మిత గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్ - 400 కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.;

Update: 2025-12-02 21:30 GMT

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ నెల 4, 5 తేదీల్లో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల 23వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో వాణిజ్యం, ఇతర అంశాలతో పాటు ప్రధానంగా రక్షణ రంగంపైనా చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో ఎస్-500 గురించి చర్చ మొదలైంది.

అవును... ఆపరేషన్ సిందూరు లో పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించడంలో రష్యా నిర్మిత గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్ - 400 కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే లో ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ గగనతలంలో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ దేశ విమానాలను గుర్తించి, ట్రాక్ చేసి, కూల్చేసి, పూర్తి వైమానిక శక్తి ఆధిపత్యాన్ని చూపించింది ఈ ఎస్-400.

వీటిలో ఐదు రెజిమెంట్లను 2018లో 5.43 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా మాస్కో నుంచి ఆర్డర్ చేసారు. ఇదే క్రమంలో మరో ఐదు ఎస్-400 రెజిమెంట్ల కోసం భారత్ వెతుకుతోందని అంటున్నారు. ఆ స్థాయిలో ఈ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ భారత మనసు దోచుకుంది. ఈ సమయంలో పుతిన్ భారత పర్యటన వేళ తెరపైకి ఎస్-500 చర్చ వచ్చింది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశానికి వస్తోన్న వేళ.. ఇరు దేశాల మధ్య రక్షణ వ్యవస్థలకు, సహకారాలకు సంబంధించి చర్చ జరగనుంది! ఈ నేపథ్యంలో.. భారత్ నుంచి ఫుల్ మార్కులు కొట్టిన ఎస్-400 ఉన్నత వారసుడు ఎస్-500 గురించి చర్చ మొదలైంది. ఇది కేవలం ఎస్-400 కి అప్ గ్రేడ్ మాత్రమే కాదు.. విస్తరించిన సామర్థ్యాలతో కూడిన భిన్నమైన ఆయుధ వ్యవస్థ అని చెబుతున్నారు.

వాస్తవానికి ఎస్-400 ఒప్పందంలా కాకుండా ఎస్-500ను సహ ఉత్పత్తి ఒప్పందంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఫలితంగా... రష్యాకు చెందిన అల్మాజ్ ఆంటేతో కలిసి భారత్ క్షిపణి భాగాలను స్థానికంగా తయారు చేయొచ్చని అంటున్నారు. ఈ క్రమంలో... భారతదేశానికి వైమానిక ఆధిపత్యాన్ని ఎస్-400 ఇస్తే.. వైమానిక, క్షిపణి, అంతరిక్ష సమీప ఆధిపత్యాన్ని ఎస్-500 అందించనున్నది చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాలను పరిశీలిద్దామ్..!

* ఎస్-400 క్షిపణి 400 కి.మీ. వరకూ లక్ష్యాలను ఛేధించగలదు. ఎస్-500 సుమారు 500-600 కి.మీ వరకూ లక్ష్యాలను ఛేధించగలదు.

* ఎస్-400 క్షిపణి సుమారు 30 కి.మీ ఎత్తు వరకూ లక్ష్యాలను ఛేధించగలగ్గా.. ఎస్-500 క్షిపణి సమీప అంతరిక్ష పొరల్లో దాదాపు 180 నుంచి 200 కి.మీ వరకూ లక్ష్యాలను ఛేధించగలదు.

* ఎస్-400 విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను ఎదుర్కొంటుంది. ఎస్-500 లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులన్నింటినీ ఎదుర్కొంటుంది. ఇదే క్రమంలో.. హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్స్ కు వ్యతిరేకంగా కూడా ప్రభావవంతంగా ఉంటుంది!

Tags:    

Similar News