4,5 తేదీల్లో భారత్ కు పుతిన్.. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారి
పుతిన్ రెండు రోజుల పాటు భారత్ లో ఉండనున్నారు. ఉక్రెయిన్ పై యుద్ధం మొదలు పెట్టిన గత నాలుగేళ్లలో ఆయన చైనా, ఒకప్పటి సోవియట్ దేశాల్లో తప్ప మిగతా ఏ దేశాల్లోనూ పర్యటించలేదు.;
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఖరారైంది. ఉక్రెయిన్ పై యుద్ధానికి ముందు చివరిసారిగా మన దేశానికి వచ్చిన ఆయన.. ఇప్పుడు మళ్లీ పర్యటన చేయనున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఎడాపెడా ఆంక్షల కారణంగా అమెరికాతో విభేదాలు నెలకొన్న వేళ, ఉక్రెయిన్ పై యుద్ధం నిర్ణయాత్మక దశకు చేరుకుంటున్న సమయంలో పుతిన్ భారత పర్యటనకు రానుండడం ఆసక్తికరంగా మారింది. పుతిన్ భారత్ కు వస్తున్నట్లు కొన్ని నెలల కిందటే ఖరారైంది. అయితే, ఇప్పుడు సమయం ఎప్పుడా? అని స్పష్టత వచ్చింది. 1999 -2000 ప్రాంతంలో రష్యాకు అధ్యక్షుడు అయిన పుతిన్ తర్వాతి కాలంలో ఎదురులేని నేతగా ఎదిగారు. రాజ్యాంగ నిబంధనల కారణంగా మధ్యలో కొన్నాళ్లు ప్రధానిగా పనిచేసిన పుతిన్.. తర్వాత మళ్లీ అధ్యక్షుడు అయిన తిరుగులేని నేత అయ్యారు. మరోవైపు అధ్యక్షుడు అయిన కొత్తల్లో 2000 దశకం ప్రారంభంలో భారత పర్యటనకు వచ్చారు పుతిన్. అప్పట్లో ఢిల్లీలో పర్యటించారు. ఈ 25 ఏళ్లలో అనేకసార్లు భారత్ కు వచ్చినా.. ఇప్పుడు చేపడుతున్న పర్యటన మాత్రం చాలా భిన్నమైనది అన్ని చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై విధిస్తున్న ఆంక్షలు, ఉక్రెయిన్ పై రష్యా చేపట్టిన యుద్ధం, చాలా విషయాల్లో ట్రంప్ ఏకపక్ష ధోరణి తదితరాలతో పుతిన్ రాక ప్రాధాన్యం సంతరించుకుంది.
రెండు రోజులు భారత్ లో
పుతిన్ రెండు రోజుల పాటు భారత్ లో ఉండనున్నారు. ఉక్రెయిన్ పై యుద్ధం మొదలు పెట్టిన గత నాలుగేళ్లలో ఆయన చైనా, ఒకప్పటి సోవియట్ దేశాల్లో తప్ప మిగతా ఏ దేశాల్లోనూ పర్యటించలేదు. ఇప్పుడు మాత్రం భారత్ ను తన టూర్ కు ఎంచుకున్నారు. డిసెంబరు 4, 5 తేదీల్లో పుతిన్ భారత పర్యటను రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ఖరారు చేసింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాది మే నెలలో రష్యాలో పర్యటించిన భారత ప్రధాని మోదీ... పుతిన్ ను మన దేశానికి ఆహ్వానించారు. ఇక పుతిన్ కు భారత రాష్ట్రపతి ముర్ము గౌరవ విందు ఇవ్వనున్నారు.
పలు ఒప్పందాలకు ఆస్కారం..
పుతిన్ భారత పర్యటనలో పలు అంశాలపై ఒప్పందాలు కుదరనున్నట్లు తెలుస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థకు కీలకమై భవన నిర్మాణం, జౌళి, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ లలో నిపుణుల కొరత ఉంది. ఈ రంగాలపై ఒప్పందాలు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీనిప్రకారం 70 వేలమందికిపైగా భారతీయులకు రష్యాలో ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు.
ఐదేళ్ల తర్వాత..
దాదాపు ఐదేళ్ల తర్వాత పుతిన్ భారత్ వస్తున్నారు. 2021లో చివరిసారిగా ఆయన పర్యటించారు. అప్పటికి ఉక్రెయిన్ పై యుద్ధం మొదలుకాలేదు. గత ఏడాది జూలైలో మోదీ రష్యా వెళ్లారు. అక్టోబరులో బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు. షాంఘై సహకార సంస్థ సదస్సులోనూ ఇద్దరు నేతలు కలుసుకున్నారు.