హలో ట్రంపూ...మరీ అలా కుళ్ళుకోకు...
రష్యా వద్ద చమురు కొనుగోలు చేయరాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ కు హుకూం జారీ చేసినా...మన మోదీ ప్రధాని అందుకు మౌనంగానే దీటుగా స్పందించారు.;
భారత్ రష్యాల మధ్య సంబంధం చాలా ప్రత్యేకమైనది...అది మా ఇరు దేశాల అభివృద్ధి కోసమే లక్షితమైంది. ఏ దేశానికీ వ్యతిరేకమైది కాదు....అయితే మా అనుబంధం కొందరికి ఇష్టం కావడం లేదు...రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటనకు వచ్చిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలివి. కేవలం రష్యాతో సన్నిహిత సంబంధాలతో ఉందన్న ముసుగులో అమెరికా... భారత్ ను ఇబ్బంది పెట్టాలని చూడ్డం సరికాదని పుతిన్ అన్నారు.
రష్యా వద్ద చమురు కొనుగోలు చేయరాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ కు హుకూం జారీ చేసినా...మన మోదీ ప్రధాని అందుకు మౌనంగానే దీటుగా స్పందించారు. ప్రతీకార సుంకాలను మనపై విధించినా...అమెరికాపై పల్లెత్తు మాట అనలేదు. భారత్ వ్యవసాయిక దేశం...రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టి దేశం ఏ పని చేయబోదు అని స్పష్టీకరించారు. రష్యాతో సంబంధాలు అలాగే కొనసాగిస్తోందన్న అసూయతో ట్రంప్ ఇండియాను డెడ్ ఎకనామీ కంట్రీగా హేళన చేశాడు. అయినా భారత్ ఏమాత్రం తగ్గలేదు...మాటల్లో కాదు చేతల్లోనే తన పస ఏంటో చూపిస్తూ వచ్చింది. కేవలం ఇండియాను టార్గెట్ చేసుకునే ట్రంప్ హెచ్1బీవీసాలను కఠినతరం చేయడం, అక్కడే పుట్టిన పిల్లలకు సిటిజెన్ షిప్ లేదని చెప్పడం లాంటి చర్యలకు పాల్పడ్డారని పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్యాధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించడం చాలా ప్రాధాన్యంగా వార్తల్లో నిలిచింది. ఇవాళ ప్రపంచం మొత్తం భారత్ రష్యాల నడుమ ఎలాంటి ఒప్పందాలు జరుగుతాయో అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో భారత్ అప్రతిహతంగా దూసుకెళుతోంది. దీన్ని సహించలేకనే రష్యాతో సన్నిహితంగా ఉందంటూ అడ్డంకులు కల్పించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. వారి సొంత అజెండా...రాజకీయ కారణాలతో భారత్ ను అణచివేయాలని చూస్తున్నారు. కానీ అది ఎప్పటికీ జరగదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టీకరించారు. ఎన్నో దశాబ్దాల కాలంగా భారత్ రష్యాల నడుమ సంబంధ బాంధవ్యాలు పటిష్టంగా ఉంటూ వచ్చాయి. ఇపుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సొంత అజెండాతో మా మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించినా అది సాధ్యపడదు. నేను భారత్ ప్రధాని మోదీ ఈ విషయంగా చాలా స్పష్టంగా ఉన్నాం. మాకు మా లక్ష్యాలేంటో తెలుసు...మా దేశాలకు ఏం చేస్తే ప్రయోజనం కలుగుతుందో తెలుసు...ఆ దిశగానే ఇరుదేశాలు ముందుకు వెళతాయని పుతిన్ కరాఖండిగా ప్రకటించారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశానికి ఉక్రెయిన్ పై యుద్ధానికి తోడ్పాటు అందిస్తోంది....భారత్ చమురు కొనుగోలు ఆపకుంటే ప్రతీకార సుంకాలు ఇంకా పెంచుతాం అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని పుతిన్ తప్పు పట్టారు. భారత్ ను చమురు కొనుగోలు చేయవద్దని సుద్దులు చెబుతున్న ట్రంప్ చేస్తున్నదేంటి? వారు కూడా మా వద్ద చమురు చవకగా కొనుగోలు చేయట్లేదా? అణు ఇంధనాల అవసరం కోసం మావద్ద ఇప్పటికే అమెరికా అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది కదా...మరి అమెరికాకు ఉన్న హక్కు భారత్ కు ఎందుకు ఉండరాదని పుతిన్ ట్రంప్ ను నిలదీశారు. పశ్చమ దేశాల ఆంక్షల వల్ల భారత్ రష్యా వద్ద చమురు కొనుగోలు కాస్త తగ్గించినప్పటికీ...అది ఇరుదేశాల సంబంధాలను బలహీనపరచబోదని పుతిన్ తెలిపారు.
భారత్ గడ్డపై రష్యా అధ్యక్షుడు చేసిన ఈ ప్రకటనలు కేవలం అమెరికాకే కాదు భారత్ పక్కనే ఉన్న చైనా...దాయాది దేశం పాకిస్తాన్ కు కూడా హెచ్చరికలా పరిగణించాలి. పాశ్చాత్య యూరోప్ దేశాలు హుకూం జారీచేస్తే వాటిని గుడ్డిగా అమలు చేసే దశను భారత్ ఎపుడో దాటిపోయింది. ఇపుడు భారత్ స్వయం శక్తిగా అవతరించింది. ఏ దేశమైనా భారత్ తో సంబంధాల కోసం ముందుకు రావల్సిందే తప్ప ...సాధించడానికి అవకాశమేలేదు. ఇదే విషయాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో వచ్చి మరీ ప్రపంచానికి చాటి చెప్పారు. మరి అమెరికా ఇతర యూరోప దేశాలు ఈ సందర్భానికి ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.