పులివెందుల కూటమి బాధ్యత ఎవరిది..? ఆ బీజేపీ నేతపైనే భారం వేశారా?

కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి హోరాహోరీ పోరు జరుగుతోంది.;

Update: 2025-08-10 18:30 GMT

కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి హోరాహోరీ పోరు జరుగుతోంది. రెండు రోజుల్లో జరిగే ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టీడీపీ కూటమి, ప్రతిపక్షం వైసీపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. చతురంగ బలాలును మోహరించాయి. ప్రధానంగా వైసీపీకి ఈ ఎన్నికలు జీవన్మరణ పోరాటం కావడంతో ఎన్నిక బాధ్యతను ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకంగా చెబుతుండటం, ఆయన బెంగళూరుకే పరిమితమైపోవడంతో పులివెందులల్లో పార్టీకి కర్త, కర్మ, క్రియ అవినాశ్ రెడ్డి అవుతున్నారు. గతంలో పులివెందులలో ఏ ఎన్నిక జరిగినా వైఎస్ కుటుంబమే పర్యవేక్షించేది. అయితే తొలిసారిగా కుటుంబ సభ్యులు తలోదిక్కున ఉండటంతో గట్టి సవాల్ ఎదుర్కొంటున్నారు. మాజీ సీఎం జగన్ బెంగళూరులో ఉండగా, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి కోర్టు షరతుల కారణంగా హైదరాబాద్ లోనే ఉండిపోయారు. మరోవైపు జగన్ చెల్లెలు షర్మిల కాంగ్రెస్ తరఫున, ఇంకో చెల్లెలు సునీత పరోక్షంగా టీడీపీ పక్షాన నిలుస్తున్నట్లు చెబుతున్నారు. ఇదేసమయంలో టీడీపీ కూటమి తరఫున పులివెందుల భారం, బాధ్యత ఎవరికి అప్పగించారనేది ఆసక్తికరంగా మారింది.

పులివెందుల గెలుపు వైసీపీకి ఎంత ముఖ్యమూ.. టీడీపీ కూటమి అంతకు రెండింతలు ముఖ్యంగా చెబుతున్నారు. ఇక్కడ గెలిచి తమ పాలనకు పులివెందుల వాసులు కూడా ఓటు వేశారని చెప్పుకోవడంతోపాటు ప్రతిపక్షం వైసీపీ పనైపోయిందన్న ప్రచారం చేయడానికి కూడా ప్రభుత్వ పెద్దలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అంటున్నారు. దీంతో కేవలం 9 పంచాయతీలకే పరిమితమైన జడ్పీటీసీ ఎన్నిక కోసం సుమారు 200 మంది సీనియర్లను టీడీపీ కూటమి రంగంలోకి దింపిందని అంటున్నారు. పులివెందుల పార్టీ ఇన్చార్జి బీటెక్ రవి భార్య లతారెడ్డి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఆమెను గెలిపించే బాధ్యత పార్టీ నేతలకు అప్పగించారు సీఎం చంద్రబాబు.

పులివెందుల టీడీపీలో వర్గ విభేదాలు ఉన్నప్పటికీ ఈ ఎన్నిక సమయంలో అవేవీ కనిపించకుండా నేతలు అంతా ఏకతాటిపైకి వచ్చినట్లు చెబుతున్నారు. ప్రధానంగా ఏడాది నుంచి ఉప్పు-నిప్పులా ఉన్న బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి వర్గాలు పాలు నీలులా కలిసి పనిచేస్తున్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో మంత్రి సవిత, పొలిటిబ్యూరో సభ్యుడు, కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరితోపాటు కడప జిల్లాలో ఉన్న ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అందరికీ పులివెందుల మండలంలోని పంచాయతీలు వారీగా బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు.

అయితే అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు నువ్వా-నేనా అన్నట్లు పోరాడుతుంటే.. టీడీపీకి మద్దతుగా బీజేపీ నేతలు రంగంలోకి దిగడమే ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి కూటమిగా పోటీ చేసిన బీజేపీ-టీడీపీ గత ఎన్నికల నుంచి కలిసి పోరాడుతున్నా, పులివెందులలో టీడీపీకి మించిన రీతిలో బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కడప జిల్లా నుంచి ఇద్దరు బీజేపీ బడా నేతలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఆ ఇద్దరూ పులివెందులలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు బాధ్యతను భుజాన ఎత్తుకున్నట్లు చెబుతున్నారు. వీరిలో ముఖ్యంగా ఓ నేత ఈ ఎన్నిక తన వ్యక్తిగత పరువు ప్రతిష్టగా తీసుకోవడం పొలిటికల్ సర్కిల్స్ ను ఆకర్షిస్తోంది.

కడప జిల్లాలో బీజేపీకి ఓ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనే జమ్మలమడుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదినారాయణరెడ్డి. గతంలో వైసీపీలో ఉన్న ఆయన 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. అప్పటి నుంచి ఆదినారాయణరెడ్డిని బద్ధ శత్రువుగా వైసీపీ భావిస్తోంది. ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆదినారాయణరెడ్డిని ఇరికించే ప్రయత్నాలు జరిగాయని తాజాగా ప్రచారం జరుగుతోంది. దీంతో తీవ్రంగా రగిలిపోతున్న ఆదినారాయణరెడ్డి.. పులివెందులలో వైసీపీకి ఓటమి రుచి చూపించాలని రంగంలోకి దిగారంటున్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను మించిన స్థాయిలో ఆయన పులివెందులలో ప్రచారం నిర్వహించారు. తన అనుచర గణాన్ని మోహరించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. ఇదే జిల్లాకు చెందిన సీఎం రమేశ్ అనకాపల్లి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కూడా తన సొంత జిల్లాలో కూటమిని గెలిపించుకోవాలని తాపత్రయ పడుతున్నారు. అయితే ఈ విషయంలో అందరికంటే కాస్త ఎక్కువగా ఆదినారాయణరెడ్డి శ్రద్ధ చూపుతున్నారని అంటున్నారు. మొత్తానికి పులివెందులలో కూటమి గెలుపు సారథ్యం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీసుకోవడం విశేషంగా చెబుతున్నారు.

Tags:    

Similar News