తర్వాతి పోప్ ఫ్రాన్సిస్ ఎవరు? రేసులో ఐదుగురు కార్డినల్స్!
రోమన్ కాథలిక్ చర్చి అధిపతి పోప్ ఫ్రాన్సిస్(88) కన్నుమూశారు. సోమవారం ఉదయం 7:35 గంటలకు వాటికన్ సిటీలోని జెమెల్లి ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు;
రోమన్ కాథలిక్ చర్చి అధిపతి పోప్ ఫ్రాన్సిస్(88) కన్నుమూశారు. సోమవారం ఉదయం 7:35 గంటలకు వాటికన్ సిటీలోని జెమెల్లి ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు.ఈ విషాద వార్తను వాటికన్ కామెర్లెంగో కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 12 ఏళ్ల వయస్సు నుంచే చర్చి, సమాజం, అట్టడుగు వర్గాల కోసం ఎంతో అంకితభావంతో పని చేశారు. ఆయన జీవితం విలువలతో నిండి ఉందని, విశ్వాసం, ధైర్యం, సార్వత్రిక ప్రేమకు ఆయన ప్రతీక అని కార్డినల్ ఫెర్రెల్ తెలిపారు.
1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో జన్మించిన పోప్ ఫ్రాన్సిస్, 2013 మార్చి 13న 266వ పోప్‌గా ఎన్నికయ్యారు. ఆయన వాటికన్ ఆర్థిక వ్యవస్థ, పాలనను సంస్కరించడంలో కీలక పాత్ర పోషించారు. వలసదారులు, పేదలు, ఖైదీలు, అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన కృషి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంది. పర్యావరణ పరిరక్షణ, అణు ఆయుధాలపై వ్యతిరేకత, శాంతియుత జీవన విధానంపై ఆయన చేసిన ప్రచారం ఎందరికో మార్గదర్శకంగా నిలిచింది. చర్చిలలో మహిళలకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
పోప్ ఫ్రాన్సిస్ మరణంతో తర్వాతి పోప్ ఎవరు అవుతారనే చర్చ ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. రోమన్ కాథలిక్ చర్చి చరిత్రలో కీలకమైన ఈ పరిణామంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తర్వాతి పోప్ అయ్యే అవకాశాలు ఉన్న ఐదుగురు కార్డినల్స్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
పోప్ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు
లూయిస్ టగ్లే (ఫిలిప్పీన్స్): ఆసియా ఖండం నుంచి పోప్ రేసులో ముందున్న వారిలో కార్డినల్ లూయిస్ టగ్లే ఒకరు. పేదలు, అణగారిన వర్గాల పట్ల ఆయనకున్న సానుభూతి, వాటికన్ సిటీలో ఆయనకున్న అనుభవం ఆయనకు కలిసి వచ్చే అంశాలు.
పెయెట్రో పారోబిన్ (ఇటలీ): వాటికన్ సిటీలో కీలక పదవులు నిర్వహించిన కార్డినల్ పెయెట్రో పారోబిన్ కూడా పోప్ రేసులో ఉన్నారు. ఆయనకు వాటికన్ వ్యవహారాలపై లోతైన అవగాహన ఉండటం, సమర్థవంతమైన పరిపాలనా అనుభవం ఉండటం ఆయనకు అనుకూల అంశాలు.
జీన్-మార్క్ అవెలీన్ (ఫ్రాన్స్): ఫ్రాన్స్‌కు చెందిన కార్డినల్ జీన్-మార్క్ అవెలీన్ కూడా పోప్ రేసులో ఉన్నారు. ఆయన ఆధునిక దృక్పథం, సంభాషణల ద్వారా సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం ఆయనకు కలిసి వచ్చే అంశాలు.
విలెమ్ బల్క్ (నెదర్లాండ్స్): నెదర్లాండ్స్‌కు చెందిన కార్డినల్ విలెమ్ బల్క్ కూడా ఈ రేసులో ఉన్నారు. ఆయన పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం వంటి అంశాలపై తనదైన ముద్ర వేశారు.
మాల్కమ్ రంజిత్ (శ్రీలంక): ఆసియా ఖండం నుంచి మరో ప్రముఖ కార్డినల్ మాల్కమ్ రంజిత్ కూడా రేసులో ఉన్నారు. ఆయనకు ఆసియాలోని కాథలిక్ చర్చిల వ్యవహారాలపై లోతైన అవగాహన ఉంది.
పోప్ ఫ్రాన్సిస్ తర్వాత తర్వాతి పోప్‌ను ఎన్నుకునే ప్రక్రియ కాన్‌క్లేవ్ (Conclave) ద్వారా జరుగుతుంది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్డినల్స్ పాల్గొంటారు. రహస్య బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరుగుతుంది. మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించిన కార్డినల్‌ను పోప్‌గా ఎన్నుకుంటారు. రోమన్ కాథలిక్ చర్చి ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉంది.