హైదరాబాద్‌లో జనసేన సభపై కాంగ్రెస్ ఫైర్.. పవన్ అప్పుడు భోజనమే మానేశారు కదా? మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు
జనసేన ఆధ్వర్యంలో నవ నిర్మాణ సభ నిర్వహణపై మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'నవనిర్మాణ సభ' రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. జనసేన చీఫ్, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేస్తూ తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను గాయపరిచిన పవన్ కళ్యాణ్, ఇక్కడ సభ పెట్టే ముందు స్పష్టమైన వివరణ ఇవ్వాలని, క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
నాడు అన్నం మానేసి నేడు సభలా?
జనసేన ఆధ్వర్యంలో నవ నిర్మాణ సభ నిర్వహణపై మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో తాను అన్నం మానేసినట్లు జనసేనాని చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తాను తీవ్రంగా కలత చెందానని, ఏకంగా 11 రోజుల పాటు అన్నం మానేశానని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారని మంత్రి పొన్నం మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును అంతగా వ్యతిరేకించిన వ్యక్తి, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని హైదరాబాద్‌లో నవనిర్మాణ సభ నిర్వహిస్తారు?" అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించని వారికి ఇక్కడ సభలు పెట్టే హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు.
డబ్బులిస్తే ఎలాంటి నటనైనా..
పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ ఒక నటుడని, ఆయన రాజకీయాలు కూడా స్క్రిప్ట్ ప్రకారమే సాగుతాయని విమర్శించారు. ‘డబ్బులిస్తే ఏ నటన అంటే ఆ నటన చేస్తారు’ అంటూ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని, ఆయన రాజకీయ వైఖరిని మంత్రి ఎండగట్టారు. ప్రజాసేవ కోసం కాకుండా కేవలం ప్యాకేజీల కోసమే ఆయన రాజకీయం చేస్తున్నారనే కోణంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణను బీజేపీకి తాకట్టు పెడతారా?
ఇటీవల కాలంలో జనసేన పార్టీ బీజేపీతో నడుస్తున్న తీరును పొన్నం ప్రభాకర్ తప్పుబట్టారు. తెలంగాణ ప్రయోజనాలను పక్కనబెట్టి, రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టు పెట్టడమే పవన్ కళ్యాణ్ చెప్పే 'నవ నిర్మాణమా?' అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో పొత్తుల రాజకీయం చేస్తూ, తెలంగాణలో ఉనికి కోసం ప్రయత్నించడం వెనుక ఉన్న ఆంతర్యమేంటో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ‘తెలంగాణ సెంటిమెంట్‌ను అవమానించిన పవన్ కళ్యాణ్.. ముందు ఇక్కడి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆ తర్వాతే హైదరాబాద్ వేదికగా నవనిర్మాణ సభ గురించి ఆలోచించాలి.’ అంటూ మంత్రి పొన్నం డిమాండ్ చేశారు.
వేడెక్కుతున్న రాజకీయం
హైదరాబాద్‌లో జనసేన సభ ద్వారా తెలంగాణలో మళ్లీ యాక్టివ్ అవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తుండగా, అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవడం హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన ఈ వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఏదేమైనా పవన్ హైదరాబాద్ సభతో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడే వేడి మొదలైంది. ఇప్పటికే పవన్ పార్టీపై కొందరు సీనియర్ జర్నలిస్టులు, మేథావులు ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఆధ్వర్యంలో ‘నవ నిర్మాణ సభ’లో ఆయన ప్రసంగం ఎలా ఉండనుందనే విషయం కూడా ఉత్కంఠ రేపుతోంది.