పొలిటికల్ సమ్మర్.. ఏపీలో కాక.. !
ఇదే సమయంలో అనూహ్యంగా ఏపీలో పొలిటికల్ `సమ్మర్` కూడా ప్రారంభమైంది. కారణాలు ఏవైనా ఇప్పుడు దాదాపు అన్ని పార్టీల నాయకులు ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నాయి.;
సాధారణంగా వేసవి ప్రారంభం నుంచి ప్రజలకు.. ఎండలు ఠారెత్తుతాయి. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరికి గురవుతారు. వేసవి నుంచి తప్పించుకునేందుకు పలు చర్యలు కూడా చేపడతారు. అయితే.. ఇదే సమయంలో అనూహ్యంగా ఏపీలో పొలిటికల్ `సమ్మర్` కూడా ప్రారంభమైంది. కారణాలు ఏవైనా ఇప్పుడు దాదాపు అన్ని పార్టీల నాయకులు ఉక్కిరిబిక్కిరికి గురవుతున్నాయి. దీనిలో ఎవరినీ మినహాయించేందుకు అవకాశం లేకపోవడం గమనార్హం.
వైసీపీ: ప్రధాన ప్రతిపక్షం కోసం పట్టుబడుతున్న వైసీపీకి ఇప్పటి వరకు ఏడాది అయినప్పటికీ ఊరట లభించలేదు. దీనికితోడు పార్టీ నుంచి నాయకుల జంపింగులు ఎప్పుడే ఏక్షణంలో ఎలా ఉంటుందోనన్న ఉక్కబోత కనిపిస్తోంది. మరోవైపు.. ప్రజల నుంచి సానుభూతి పవనాలు వీస్తాయని.. ఊరట లభిస్తుందని అనుకున్నా.. అది ఎక్కడా కనిపించడం లేదు. ఇవన్నీ అంతర్గత సమస్యలు అనుకున్నా.. కేసులు-కోర్టులు-జైళ్ల జపంతో నాయకులు.. తట్టుకోలేక పోతున్నారు. మొత్తంగా వైసీపీలో సమ్మర్ సెగలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.
టీడీపీ: కీలకమైన అధికార భాగస్వామిగా ఉన్న టీడీపీలోనూ పొలిటికల్ సమ్మర్ సెగలు పుట్టిస్తోంది. నాయ కులు ఎవరూ కూడా.. ఎవరికీ సహకరించడం లేదు. ముఖ్యంగా పదే పదే చంద్రబాబు చెబుతున్నా.. నాయకులు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. ఇక, ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్‌పై కూడా ప్రజల్లో పార్టీ అనుకున్నంత రేంజ్‌లో అయితే.. గ్రాఫ్ కనిపించడం లేదు. దీనికితోడు నామినేటెడ్ పదవుల వ్యవహారం మరింతగా తలనొప్పి తెచ్చి పెట్టింది. దీంతో టీడీపీలోనూ సమ్మర్ సెగ కనిపిస్తోంది.
జనసేన: ప్రభుత్వ భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేనలో చిత్రమైన వ్యవహారం కనిపిస్తోంది. ఆధిపత్య రాజకీయాలకు నియోజకవర్గాలు కేంద్రంగా మారాయి. పిటాపురం, తాడేపల్లి గూడెం సహా జనసేన గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న 21 నియోజకవర్గాల్లో 10 చోట్ల ఆదిపత్య రాజకీయాలు సాగుతున్నాయి. పైకి అందరూ బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నా.. టీడీపీ నేతలతో విభేదిస్తున్న తీరు.. సెగ పుట్టిస్తోంది. అదేసమయంలో జనసేన అధినేత సనాతన ధర్మ పరిరక్షణ అజెండాను భుజాన వేసుకోవడంతో.. జనసేనలోనూ కాక పెరిగింది.