మాజీ ఎంపీ రాజ్యసభకు...బీజేపీ కొత్త లెక్కలు ?
భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో బలపడాలని చూస్తోంది. నిన్నటి దాకా ఒక ఎత్తు ఇప్పటి నుంచి మరో ఎత్తు అన్నదే కమల విధానం.;
భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలలో బలపడాలని చూస్తోంది. నిన్నటి దాకా ఒక ఎత్తు ఇప్పటి నుంచి మరో ఎత్తు అన్నదే కమల విధానం. అయితే తెలంగాణాలో 2028లో అధికారంలోకి రావాలని భారీ లక్ష్యం పెట్టుకున్న బీజేపీ ఏపీ విషయంలో మాత్రం నిదానమే ప్రధానంగా అడుగులు వేస్తోంది. దానికి కారణం పార్టీ బలం చాలా తక్కువగా ఉండడం అంతే కాదు కలసి వచ్చిన రాజకీయం పరిమితంగా ఉండడం. దాంతో 2024 నుంచి 2029 ఎన్నికలకు తమ సీట్లను రెట్టింపు చేసుకోవడం కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఏపీ ఎంపీ సీట్లు ఎక్కువగా ఉపయోగపడతాయని ఆలోచనలో ఉండడం వంటివి బీజేపీ ప్లాన్స్ లో ఉన్నాయి.
బీసీ కార్డుతో :
ఇదిలా ఉంటే ఏపీలో బీసీ కార్డుతో బీజేపీ ఆలోచనలు చేసింది. ఉత్తరాంధ్ర కు చెందిన బీసీ నేత పీవీఎన్ మాధవ్ కి ఏపీ బీజేపీ సారథ్యాన్ని కట్టబెట్టింది. అదే సమయంలో ఇతర సామాజిక వర్గాలను కూడా దగ్గర చేసుకుంటోంది. బలమైన క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన విశాఖ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజుకు ఏపీ అసెంబ్లీలో పార్టీ పక్ష నేతగా బాధ్యతలు అందించింది. అలాగే భీమవరానికి చెందిన నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మకు కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించింది. అలాగే ఏపీలో కోటాలో గతంలో దక్కిన రెండు రాజ్యసభ సీట్లలో ఒకటి బీసీ నేత ఆర్ క్రిష్ణయ్యకు కేటాయించింది. ఇక కాపుల నుంచి బలమైన గొంతుకగా పార్టీకి ఆర్ ఎస్ ఎస్ నుంచి నిబద్ధతతో పనిచేస్తూ వస్తున్న సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది.
ఆయనకు సైతం :
ఇక జాతీయ స్థాయిలో బీజేపీలో పలుకుబడి కలిగిన నాయకుడిగా ఉన్న జీవీఎల్ నరసింహారావుకు ప్రస్తుతం ఒక కీలక బాధ్యతను పార్టీ అప్పగించింది. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న బడ్జెట్ గురించి ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయడానికి జీవీఎల్ ని ఎంపిక చేశారు. ఆయన దక్షిణాది రాష్ట్రాలకు కో ఆర్డినేటర్ గా ఉంటూ కేంద్ర బడ్జెట్ మీద సెషన్లు సమావేశాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయా రాష్ట్రాల పార్టీ శాఖలతో కలసి ముందుకు సాగుతారు.
పెద్దల సభకు :
ఒక విధంగా 2024 లో రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేసిన జీవీఎల్ కి ఇది ఒక అవకాశంగా చెబుతున్నారు. జాతీయ పార్టీ ఆయన సేవలను మరింతగా వినియోగించుకోవాలన్నది చూస్తే కనుక ఆయన పట్ల సానుకూల వైఖరితో ఉందని అంటున్నారు. దాంతో పాటుగా మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. తొందరలో ఏపీ కోటాలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ సీట్లలో బీజేపీ వాటాగా దక్కే ఒక సీటుని జీవీఎల్ కి ఇస్తారు అని. ఆయన సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకుంటూనే ఏపీలో మరో బలమైన సామాజిక వర్గానికి సమ న్యాయం చేసే ఉద్దేశ్యంతో జీవీఎల్ ని ప్రోత్సహిస్తున్నారు అని అంటున్నారు. అదే జరిగితే జీవీఎల్ మళ్ళీ లైం లైట్ లోకి వచ్చినట్లే అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేయాలని జీవీఎల్ భావించినా ఆ సీటు పొత్తులో టీడీపీకి వెళ్ళింది. దాంతో ఆయనకు ఎక్కడా అవకాశాలు దక్కలేదు, ఇపుడు రాజ్యసభకు ఆయనకు చాన్స్ ఇస్తే జీవీఎల్ కి రాజకీయంగా దశ తిరిగినట్లే అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో.