అనకాపల్లికి గోదావరి గలగలలు...నాగవళికి చేరేదాకా !

ఎక్కడి గోదారమ్మ ఎక్కడి అనకాపల్లి. అయినా సరే పారేందుకు ఉరకలు వేస్తోంది. అన్ని హద్దులనూ దాటుకుంటూ దాహార్తిని తీర్చేందుకు సిద్ధమవుతోంది.

Update: 2026-07-16 03:48 GMT

ఎక్కడి గోదారమ్మ ఎక్కడి అనకాపల్లి. అయినా సరే పారేందుకు ఉరకలు వేస్తోంది. అన్ని హద్దులనూ దాటుకుంటూ దాహార్తిని తీర్చేందుకు సిద్ధమవుతోంది. సాగు నీటిని అందిస్తూ పచ్చని పంటను పండించేందుకు రెడీ అవుతోంది. గోదావరి జలాలు అనకాపల్లికి తీసుకుని వచ్చేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. ఇపుడు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది. డేటూ టైం ఫిక్స్ చేసి మరీ కూటమి ప్రభుత్వ పెద్దలు గట్టిగా చెబుతున్నారు. అనకాపల్లికి గోదావరి నీటిని అందిస్తామని బిగ్ సౌండ్ చేస్తున్నారు.

పోలవరం ద్వారా బిరబిరా :

గోదావరి బిరబిరా పారుతూ అనకాపల్లిని టచ్ చేయనుంది. ఆగస్టు 14న పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు పరుగులు తీసుకుంటూ ఈ ప్రాంతానికి రానున్నాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యాయని ఆగస్టు 14న అనకాపల్లిలో గోదావరి జలాలకు జలహారతి ఇస్తామని చెప్పారు. దాంతో అనకాపల్లి నుంచి ఇక ఉత్తరాంధ్రా జిల్లాలకు గోదావరి తల్లి పారుతూ సాగడమే మిగిలి ఉంది అని అంటున్నారు.

గోదావరి నాగావళితో :

ఇక రాష్ట్రంలో నదుల అనుసంధానం జరిగితే కరవు కాటకాలు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఉత్తరాంధ్రాలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నాగావళి నదితో గోదావరిని కలుపుతామని ఉత్తరాంధ్రాను సస్యశ్యామలం చేస్తామని ఆయన కచ్చితంగా చెబుతున్నారు. అంతే కాదు . పెన్నా-వంశధార నదుల అనుసంధానం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నదుల అనుసంధానం పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా చంద్రబాబు చెబుతున్నారు.

సాగు నీటి ప్రాజెక్టుల మీదనే :

ఇక రాష్ట్రంలో గడచిన రెండేళ్లలో సాగు నీటి ప్రాజెక్టుల కోసం 24 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చంద్రబాబు చెప్పారు. ఇదే విధంగా వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి 36 సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు చెప్పారు. అంతే కాకుండా ఇదే ఏడాది సెప్టెంబర్ నాటికి వెలుగోడు ప్రాజెక్ట్ మొదటి దశను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని కూడా బాబు వెల్లడించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆ దిశగా కూటమి ప్రభుత్వం స్పష్టమైన అజెండాతో ముందుకు సాగుతోందని బాబు చెప్పారు.

Tags:    

Similar News