ముద్రగడ వారసత్వం ఎవరిది?
ముద్రగడ పద్మనాభం దిగ్గజ నాయకుడు. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహాలు అవసరం లేదు.
ముద్రగడ పద్మనాభం దిగ్గజ నాయకుడు. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహాలు అవసరం లేదు. కాపులకు నాయకుడిని అని ఆయన చెప్పుకున్నా ఆయనను అంతా అభిమానించారు. అంతే కాదు ఆయన సీఎం మెటీరియల్ అని కూడా అంటారు. ఆయన అధికారం కోసం రాజకీయంగా వ్యూహాలు సక్రమంగా చేసుకోలేదు, ఆయనకు ఆ ఆసక్తి కూడా లేదు, ఆయన ఎంత సేపూ తన వ్యక్తిత్వం నిజాయతీ, నిరాడంబరత అంతే కాదు తన సామాజిక వర్గంలో పేదల కోసం ఏదైనా చేయాలి అని తపించి తన జీవితంలో అత్యధిక కాలాన్ని వెచ్చించారు. ఆయన అందులో సాధించారు, అదే ప్రజల హృదయాలలో స్థానం. అందుకే ముద్రగడ కాపు సామాజిక వర్గంలో ఆరాధ్య నాయకుడిగా నిలిచిపోయారు. ఇపుడు ఆయన గతించారు.
ధీటుగా నడిపించేలా :
అయితే ఆయన వారసత్వం ఎవరిది అన్నదే చర్చగా ఉంది. వారసుడు అంటే ఆయన చిన్న కుమారుడు గిరిబాబు ఉన్నారుగా అని అంటారు. ఆయన రాజకీయ వారసుడిగా కూడా ఉన్నారు పత్తిపాడు నుంచి ఆయన వైసీపీ ఇంచార్జిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎటూ పోటీ చేస్తారు. అయితే ముద్రగడ వారసత్వం అంటే అది కాదు ఆయన బలమైన కాపు జాతికి గొప్ప నాయకుడిగా నిలిచారు. ఆ వారసత్వం ఆ నాయకత్వం అందుకునేది ఎవరు అన్నదే ప్రశ్న. వంగవీటి మోహన రంగా కాపులకు ఎలా ఐకాన్ లీడర్ గా ఉన్నారో ముద్రగడ కూడా అలాగే నిలిచిపోయారు. ఆయన సుదీర్ఘ కాలం పాటు చేసిన పోరాటాలు అలాంటివి. మరి ఆయన మాదిరిగా రాజకీయాలకు అతీతంగా ఇది నా కులం, నేను వీరి కోసమే పనిచేస్తాను అని కష్టమైనా నిష్టూరమైనా నిలబడి ఎవరితోనైనా కలబడే నాయకుడు ఉన్నారా లేక రేపటి నాటికైనా తయారు అవుతారా అంటే ప్రస్తుతానికి అది మిలియన్ డాలర్ ప్రశ్నగానే చూడాలని అంటున్నారు.
వ్యూహ ప్రతివ్యూహాలు :
ఇక ఒక అనుభవం కలిగిన నాయకుడు మరణించిన వేళ ప్రశాంతంగా జరగాల్సిన ఆయన అంత్యక్రియలు కూడా కొంత వివాదాస్పదం అయ్యాయి అని అంటున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ముద్రగడ బతికి ఉన్నపుడు ఆయన కూటమికి ప్రత్యర్ధి నాయకుడు కావచ్చు. దివంగతులు అయ్యాక ఆయన కోసం ప్రభుత్వం అధికార లాంచనాలతో చివరి క్రతువు ముగించాలని ఆదేశించింది. ఇక్కడ కూడా వ్యూహం ఉందని అంటున్నారు. ముద్రగడ కంటే కాపుల అభిమాన నేత. దాంతో ఆయనకు ఆ విధంగా మేలు చేయడం ద్వారా తమ ఉదారతను చాటుకుంటూ కూటమిలోని టీడీపీ జనసేన కాపుల సంపూర్ణ అభిమానాన్ని దక్కించుకోవాలని ఆలోచించారు అని ప్రత్యర్ధి వైసీపీ నేతల భావన.
వద్దు అంటూ చెప్పడం వెనక :
ఇక ముద్రగడ అంత్యక్రియలు అధికార లాంచనాలతో చేయవద్దు అసలు అవసరం లేదు అని వైసీపీ కూడా అంతే వేగంగా స్పందించింది. ముద్రగడ కుటుంబ సభ్యులు దానిని తిరస్కరించారు అని కూడా వైసీపీ నేతలు చెప్పారు. దాంతోనే అంత్య క్రియల వేళ వివాదం మొదలైంది. ఆఖరుకు పోలీసులు అధికార లాంచనాలకు అక్కడికి చేరుకోవడం వారిని వద్దు అంటూ వైసీపీ నేతలు వారిస్తూ వాదించడం దాకా వ్యవహారం వెళ్ళింది. మొత్తం మీద ముద్రగడ మరణించినా రాజకీయ వ్యూహాలు మాత్రం ఏపీలో అధికార విపక్షాల మధ్య ధీటుగానే నడిచాయని అంటున్నారు.
కాపుల మద్దతు కోసం :
ఇక ముద్రగడ విషయం తీసుకుంటే ఆయన చివరి రోజులలో గడిపిన పార్టీ వైసీపీ కాబట్టి ఆయన వైసీపీ వారే అన్నది ఆ పార్టీ భావన. అదే ప్రయత్నం కూడా అంత్యక్రియల సందర్భంగా కనిపించింది. ఇక కుమారుడు గిరి కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేస్తారు అన్నది తెలిసిందే. అయితే ముద్రగడ ఈ రోజున దూరం అయ్యారు కాబట్టి కూటమి వైపు నుంచి ఆయన మీద ఇక మీదట ఏ రకమైన వ్యతిరేకత ఉండకపోవచ్చు. ఆయన జయంతులు వర్ధంతులు కూడా ఎవరైనా నిర్వహించే వీలుంది. అంతిమంగా ముద్రగడను అభిమానించే వారు కాపులు ఎవరి వైపు ఉంటారు అన్నదే ప్రశ్న. అంతే కాదు ముద్రగడ ఆశయాలకు ఆయన మాదిరిగా కాపులకు కాపు కాసే వారసుడు ఎవరు అన్నది కూడా కాలమే తేల్చాల్సి ఉంది.