మా కళ్లు నెత్తికెక్కాయి.. అందుకే ఓడిపోయాం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంపై ఆయన మొదటిసారి అత్యంత పారదర్శకంగా.. ఆత్మపరిశీలనాత్మకంగా స్పందించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎంపీ వద్దిరాజు నివాసంలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఓటమికి గల కారణాలను ముక్కుసూటిగా అంగీకరించారు. "మా కళ్లు నెత్తికెక్కాయి కాబట్టే మూడోసారి అధికారంలోకి రాలేకపోయాం. ఈ ఓటమిలో 100 శాతం మా తప్పులే ఉన్నాయి. ప్రజల తీర్పును గౌరవిస్తూనే.. మా లోపాలను తప్పకుండా సరిదిద్దుకుంటాం" అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓటమి విశ్లేషణ.. ఆ 1.8 శాతం ఓట్ల వ్యత్యాసం
గత ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రజలు బలంగా నమ్మారని కేటీఆర్ పేర్కొన్నారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో ఇతరులకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లు భావించారని ఆయన అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ కేవలం 1.8% ఓట్ల తేడాతో అంటే దాదాపు నాలుగు లక్షల ఓట్ల వ్యత్యాసంతోనే అధికారాన్ని కోల్పోయిందని గుర్తు చేశారు. అయితే 2018 ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి బీఆర్ఎస్ ఓటు బ్యాంకు దాదాపు 10% తగ్గడం వాస్తవమేనని ఆయన అంగీకరించారు.
కాంగ్రెస్, బీజేపీలపై విమర్శల బాణాలు
రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉంటుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాధికారం కోసం తహతహలాడుతున్న బీజేపీకి ఇక్కడ కనీసం సీఎం అభ్యర్థే లేరని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తరహా ఫలితాలే పునరావృతమవుతాయని.. బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవని జోస్యం చెప్పారు. "ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవీకాలం చివరి ఆరు నెలల్లో ఏదో మ్యాజిక్ చేసి మళ్లీ అధికారంలోకి వస్తామని పగటికలలు కంటున్నారు. కానీ, ప్రజలు కాంగ్రెస్ మార్కు మోసపూరిత ప్రయత్నాలను అస్సలు నమ్మరు." అని కేటీఆర్ అన్నారు.
మెట్రో విస్తరణ, డీలిమిటేషన్ అంశాలపై స్పష్టత
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో పనుల టెండర్లు పూర్తి చేసి, ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించామని తెలిపారు. 24 నెలల్లో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు టెండర్లను కాంగ్రెస్ రాగానే రద్దు చేసిందని, ఇప్పుడు 28 నెలల తర్వాత మళ్లీ కొత్తగా ప్రకటిస్తూ డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు.
ఇక నియోజకవర్గాల పునర్విభజన పై స్పందిస్తూ.. తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాలు పెరగడం ఖాయమన్నారు. అయితే జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ సీట్ల సంఖ్య తగ్గకుండా ఉంటేనే తాము కేంద్ర బిల్లుకు మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.
'టీఆర్ఎస్' పేరుపై వివాదం.. పార్టీనే సుప్రీం
గతకొద్ది రోజులుగా 'టీఆర్ఎస్' పేరుతో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ అవుతుందనే ప్రచారంపై కేటీఆర్ స్పందించారు. ఎవరైనా ఆ పేరును తిరిగి వాడాలని చూస్తే బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఖచ్చితంగా అభ్యంతరం వ్యక్తం చేస్తారని, ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసి ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా "తాను అయినా, మరెవరైనా సరే.. పార్టీ కంటే పెద్దవాళ్లు కాదు. పార్టీనే సుప్రీం" అని కేటీఆర్ కేడర్‌కు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు.
మొత్తానికి కేటీఆర్ చేసిన ఈ ఆత్మపరిశీలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త చర్చకు దారితీశాయి. తప్పులను ఒప్పుకుంటూనే భవిష్యత్తులో కాంగ్రెస్‌పై పోరాటానికి పార్టీని సమాయత్తం చేసే వ్యూహంతో కేటీఆర్ ఉన్నట్లు స్పష్టమవుతోంది.