సీఎం రేవంత్ 11 నిమిషాల స్పీచ్ తర్వాత ఇంత జరిగింది

అనవసరమైన చెత్తకు సంబంధించిన అంశాలకు ఇచ్చే ప్రాధాన్యత.. చరిత్రగతిని.. రాష్ట్ర రూపురేఖల్ని మార్చే సందర్భాలకు మీడియా.. సోషల్ మీడియా.. జర్నలిస్టులు ఇచ్చే ప్రాధాన్యత కొన్నిసార్లు పరిమితంగా ఉంటుంది.;

Update: 2026-02-21 04:17 GMT

అనవసరమైన చెత్తకు సంబంధించిన అంశాలకు ఇచ్చే ప్రాధాన్యత.. చరిత్రగతిని.. రాష్ట్ర రూపురేఖల్ని మార్చే సందర్భాలకు మీడియా.. సోషల్ మీడియా.. జర్నలిస్టులు ఇచ్చే ప్రాధాన్యత కొన్నిసార్లు పరిమితంగా ఉంటుంది. నిజానికి జర్నలిజంలో ‘న్యూస్ నోస్’ అనే మాటను తరచూ ప్రస్తావిస్తుంటారు. మిగిలిన వారికి చురుకైన జర్నలిస్టులకు మధ్య ఉండే తేడా ఏమంటే.. ఏ అంశం అయితే ఇంపాక్ట్ (ప్రభావం) చూపిస్తుందో దాన్ని అంతే ప్రభావవంతంగా చూపించాల్సిన అవసరం ఉంటుంది.

ఏఐ లాంటి చరిత్రగతిని తిప్పే సాంకేతిక అంశంలో భారత విజన్ ఎలా ఉండాలన్న విషయాన్ని ఆ దేశంలోని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభావవంతంగా ప్రస్తావించటం.. తనకు కేటాయించిన పదకొండు నిమిషాల స్వల్ప సమయంలో అందరూ ఆలోచించేలా చెప్పటం ఒక ఎత్తు అయితే.. తన ప్రసంగం తర్వాత కూడా తాను ప్రస్తావించిన అంశాల్ని రోడ్ మ్యాప్ తరహాలో అటు పాలసీ మేకర్లు మాత్రమే కాదు.. టెక్ దిగ్గజాలు సైతం ప్రస్తావించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సాధించిన విజయంగా చెప్పాలి.

నిజానికి ముఖ్యమంత్రి హోదాలో ఇంతకాలం సాగింది ఒక ఎత్తు అయితే.. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఆయన చేసిన ప్రసంగం తర్వాత నుంచి ఆయన్ను చూసే తీరు.. ఆయనకు లభించే గౌరవ మర్యాదల లెక్కలు మారిపోతాయని చెప్పకతప్పదు. చదివినంతనే అతిశయోక్తిగా అనిపించినా.. జరిగిన పరిణామాల్ని నిశితంగా గమనిస్తే.. ఈ వాదనలో నిజం ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

ఏఐ సమ్మిట్ లో సీఎం రేవంత్ తన ప్రసంగాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ఆయన్ను అభినందించిన తీరు ఒక ఎత్తు అయితే.. రేవంత్ రెడ్డి తనకు కేటాయించిన కుర్చీ వైపు వెళ్తుండగా.. ఆయన్ను దగ్గరకు పిలిచి కరచాలనం చేయటం.. వెన్ను తట్టి మెర్చుకోవటమే కాదు.. ఆయన్ను తన పక్కన అరగంట పాటు కూర్చోబెట్టుకున్న వైనం చూస్తే.. సీఎం రేవంత్ తన స్పీచ్ తో ఎంత ఇంపాక్ట్ చూపించారో అర్థమవుతుంది. ఆ అరగంట ఎంతో ఉత్సాహంగా ఏఐ అంశాల గురించి మాట్లాడుకోవటం కనిపించింది.

ఈ సెషన్ ముగిసిన తర్వాత హాల్లో ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. బ్రెజిల్ అధ్యక్షుడు లులా డా సిల్వా వంటి వారు రేవంత్ వద్దకు వచ్చి ఆయన ప్రసంగాన్నిప్రశంసించటం చూస్తే.. ఆయన సాధించిన విజయం ఎంతన్నది అర్థమవుతుంది. ఈ సదస్సు విరామ సమయంలో గూగుల్ సీఈవో.. అడోబ్ సీఈవో.. ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్ మాన్ లు సీఎం రేవంత్ తో విడిగా మాట్లాడటం చూస్తే.. ఆయన ప్రసంగం టెక్ దిగ్గజాలకు సైతం ఎంతటి ప్రభావాన్ని చూపిందో అర్థమవుతుంది.

ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి. నిజానికి కాంగ్రెస్ వాసన దగ్గరకు రానిచ్చేందుకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఇష్టపడరు. అలాంటిది ఒక కాంగ్రెస్ సీఎం చేసిన ప్రసంగానికి ముగ్దుడు కావటమే కాదు.. లేచి నిలబడి చప్పట్లు కొట్టటం.. దగ్గరకు తీసుకొని వెన్ను తట్టటం చూస్తే.. భారత సమాఖ్య వ్యవస్థ సరైన రీతిలో నడిస్తే ఎలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా ప్రధాని మోడీ నిలుస్తారు. ఈ విషయంలో రేవంత్ గొప్పతనాన్ని గుర్తించేందుకు ఆయన అస్సలు మొహమాట పడలేదు సరికదా.. తమ దేశంలో పాలసీ మేకర్లు ఎంతటి విజనరీగా ఉంటారన్న విషయాన్ని తన చేతలతో ప్రధాని నరేంద్ర మోడీ ప్రదర్శించారని చెప్పాలి.

ఇదంతా ఒక ఎత్తు అయితే శుక్రవారం సాయంత్రం ప్రధాని మోడీ అంతర్జాతీయ ప్రతినిధుల గౌరవార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ విందులోనూ ప్రధాని మోడీ స్వయంగా రేవంత్ ను ఇతర దేశాధినేతలకు పరిచయం చేయటం ఆయనకు దక్కిన అరుదైన గౌరవంగా చెప్పాలి. ఇలాంటివన్నీ తెలుగు ప్రజలు తెలుసుకోవాల్సిన ఆసక్తికర అంశాలు కదా? చరిత్రలో నమోదు కావాల్సిన వాస్తవాలు కదా? వీటికి ఎలాంటి ప్రాదాన్యతను ఇవ్వకపోవటం చూస్తే.. తెలుగులోని దిగ్గజ మీడియా సంస్థలకు న్యూస్ నోస్ మిస్ అయ్యిందని చెప్పక తప్పదు. కాదంటారా?

Tags:    

Similar News