జగన్ విషయం...మోడీ మీటింగ్ లో అదే హాట్ టాపిక్
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులో బీజేపీ భాగంగా ఉంది. ఇక ప్రత్యర్ధి ఎవరు అంటే నిస్సందేహంగా జగన్ అని వేరేగా చెప్పాల్సిన పని లేదు.;
కర్నూల్ కి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అంతే కాదు ఆయన జీఎస్టీ ద్వారా ప్రజల జీవితాలలో వచ్చిన మార్పులు ప్రతీ కుటుంబంలో ఆదా అయ్యే మొత్తాల గురించి కూడా వివరించే ప్రయత్నం చేశారు. మోడీ సభకు దాదాపుగా మూడు లక్షల మంది దాకా ప్రజానీకం వచ్చారు. సభ సూపర్ హిట్ అయింది. మోడీ ఈ సభ ద్వారా అనేక విషయాలను పంచుకున్నారు
కాంగ్రెస్ ని తూర్పరా :
నరేంద్ర మోడీ కర్నూల్ సభలో కాంగ్రెస్ ని పూర్తి స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ చేసిన విధానాలు ఆ ప్రభుత్వాల పనితీరు గురించి కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలే చేశారు. కాంగ్రెస్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడిన మోడీ వైసీపీ ప్రభుత్వం మీద ఒక్క మాట మాట్లాడకపోవటంతో అదే ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. సరిగా పదహారు నెలల క్రితం వరకూ ఏపీలో జగన్ పాలన సాగింది. అయిదేళ్ళ పాటు జగన్ ఏపీని పాలించారు. నిజానికి చూస్తే ఏపీలో కాంగ్రెస్ అన్నది పెద్దగా లేదని అంటున్నారు. వైసీపీయే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది అన్నది తెలిసిందే.
ప్రత్యర్థిగా ఉన్నా :
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందులో బీజేపీ భాగంగా ఉంది. ఇక ప్రత్యర్ధి ఎవరు అంటే నిస్సందేహంగా జగన్ అని వేరేగా చెప్పాల్సిన పని లేదు. కానీ మోడీ మాత్రం ఆ విషయం మరచారా లేక ఎందుకొచ్చిన విమర్శలు అనుకున్నారా లేదా ఆ పార్టీకి అంత సీన్ లేదని భావించారో తెలియదు కానీ వైసీపీ ప్రస్తావన కానీ జగన్ గురించి కానీ ఒక్క విమర్శ కూడా లేదని అంతా అంటున్నారు.
రాయలసీమ గడ్డ నుంచి :
ఇక చూస్తే మోడీ రాయలసీమ గడ్డ నుంచి ప్రసంగించారు. నిజానికి మోడీ మూడోసారి ప్రధాని అయిన తరువాత ఏపీకి నాలుగు సార్లు వచ్చారు. అలా వచ్చిన ప్రతీ సారీ జగన్ మీద విమర్శలు చేస్తారని వైసీపీ తప్పిదాలను ఎండగడతారని అంతా అనుకున్నారు కానీ అవేమీ జరగలేదు, ఇపుడు చూస్తే రాయలసీమలో ప్రధాని సభ జరిగింది. రాయలసీమ అంటే సహజంగా వైసీపీకి పట్టున్న ప్రాంతం దాంతో తప్పనిసరిగా జగన్ మీద విమర్శలు ఉంటాయని ఆశించిన వారికి నిరాశ కలిగిందని అంటున్నారు. కూటమి పార్టీల క్యాడర్ కి కూడా ఇది ఆశాభంగం కలిగించింది అని అంటున్నారు.
ఆ ముగ్గురికీ పొగడ్తలు :
అయితే అదే సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్, లోకేష్ లను ప్రధాని పొగిడారు. వారి గురించి బాగా చెప్పారు. దాంతో కూటమి నేతలతో పాటు క్యాడర్ లోనూ జోష్ కనిపించింది. అయితే జగన్ ని మోడీ విమర్శిస్తే అది జనాలకు నేరుగా చేరుతుందని భావించిన వారికి మాత్రం ఈసారి కూడా మోడీ నిరాశనే మిగిలించారు అని అంటున్నారు. మరి ఎందుకు ఇలా అంటే ఎవరి విశ్లేషణ వారు చేసుకోవాల్సిందే.