అలుపెరుగని మోడీ.. నేటి నేతలకు స్ఫూర్తి!
అనంతరం 11 గంటల సమయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు.ఇక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్ర మాలకు శ్రీకారం చుట్టి 42 నిమిషాల పాటు ప్రసంగించారు.;
75 ఏళ్ల వయసు.. దేశ ప్రధానిగా అనేక బాధ్యతలు.. పైగా రాజకీయ వ్యూహాల్లో అవిశ్రాంత శ్రమ. నిన్న మొన్నటి వరకు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఎన్నికల హడావుడి. దీంతో సహజంగానే ఏ నాయకుడు అయినా.. అంతో ఇంతో రెస్టు తీసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, ప్రధాని మోడీ విషయంలో `రెస్ట్` అన్న పదం ఆదివారం ఎక్కడా కనిపించలేదు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఆయన రాష్ట్రాల పర్యటన రాత్రి 12 గంటల వరకు నిరాఘాటంగా సాగిందంటే ఆశ్చర్యం వేస్తుంది. కేవలం ఒకటి రెండు సమావేశాలకు హాజరు కావడానికే అలసిపోయేనేతలకు ప్రధాని మోడీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
రాజకీయాలను పక్కన పెడితే.. మోడీ ఆది నుంచి కూడా అలుపెరుగని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన మాతృ మూర్తి మృతి చెందిన రోజు కూడా ఆయన అంత్యక్రియలకు హాజరైన రెండు గంటల్లోనే ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో అప్పట్లో ఆయనను బీజేపీ నాయకులు `కర్మయోగి` అని పిలిచారు. తాజాగా ఆదివారం మోడీ పర్యటనలు.. ఆయన అలుపెరుగని ఉత్సాహం చూస్తే.. ఎవరికైనా ఆశ్చర్యం వేయకమానదు. ఉదయం 7 గంటలకు ఢిల్లీలో ప్రారంభమైన మోడీ పర్యటన 9 గంటలకు బెంగళూరుకు చేరుకుంది. ఇక్కడ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ నాయకులు నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్నారు. 40 నిమిషాలపాటు ప్రసంగం దంచి కొట్టారు.
అనంతరం 11 గంటల సమయంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు.ఇక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్ర మాలకు శ్రీకారం చుట్టి 42 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ కార్యక్రమం అయి అవడంతోనే హైదరాబాద్‌లో వాలిపోయారు. ఇక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దాదాపు 35 నిమిషాల పాటు ప్రసంగించారు. అనంతరం.. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. ఆ తర్వాత 6 గంటల సమయంలో సికింద్రాబాల్‌లో రోడ్‌లో షో నిర్వహించారు. ఆ వెంటనే భారీ బహిరంగ సభలో మరో 40 నిమిషాల పాటు ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని ముగించిన తర్వాత.. నేరుగా ఢిల్లీ వెళ్లి రెస్టు తీసుకున్నారని అనుకుంటే తప్పులో కాలేసినట్టే.
హైదరాబాద్ నుంచి నేరుగా రాత్రి 10గంటల సమయంలో ప్రధాని తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు చేరుకున్నారు. ఇక్కడి జాంనగర్ లో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం.. నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు ముగిసే సరికి అర్ధరాత్రి 12 గంటలైంది. అప్పటికి కానీ.. మోడీ విశ్రాంతికి ఉపక్రమించలేదు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఆయన పాల్గొన్న కార్యక్రమాల్లో దాదాపు అన్నీ నిలబడి ఉండాల్సినవే. 4 సభల్లోనూ(బెంగళూరులో 2, హైదరాబాద్, సికింద్రాబాద్‌లో 2) ప్రధాని నిలబడే ప్రసంగించారు. అయినా.. ఎక్కడా ఆయనలో అలుపు అన్నమాటే వినిపించలేదు. మొహంలోనూ కనిపించలేదు. మరి నేటి నేతలు.. మోడీ రాజకీయాలను పక్కన పెట్టి ఆయన పనితీరును నేర్చుకునే ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి. ప్రస్తుతం మోడీ వయసు 75 ఏళ్లు కావడం గమనార్హం.