‘చిత్రం’ మార్చేస్తున్న మోడీ.. జపాన్ టూర్ వేళ అమెరికాకు షాక్
మాటల కంటే చేతలు చేసే మేజిక్ ఎక్కువగా ఉంటాయి. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇది మరింత బాగా సూట్ అవుతుంది.;
మాటల కంటే చేతలు చేసే మేజిక్ ఎక్కువగా ఉంటాయి. అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇది మరింత బాగా సూట్ అవుతుంది. అదే పనిగా మాట్లాడే కన్నా.. చేయాల్సిన పనుల్ని గుట్టుచప్పుడు కాకుండా చేసుకుంటూ పోవటం ద్వారా ఎఫెక్టు ఎక్కువగా ఉంటుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు ఆ థియరీనే ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒక నాటి సన్నిహిత మిత్రుడు ట్రంప్.. తన పట్ల.. భారత్ విషయంలో వ్యవహరిస్తున్న ధోరణిపై నేరుగా మాట్లాడింది లేదు. పరోక్షంగా మాట్లాడినా.. అది కూడా చాలా తక్కువగానే మాట్లాడారని చెప్పాలి.
తాజాగా ఆయన విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన ఫారిన్ టూర్ లో భాగంగా తొలుత జపాన్ వెళ్లిన వేళ.. ఆయన జపాన్ లో కాలు పెట్టే సమయానికి అగ్రరాజ్యం అమెరికాకు అనూహ్య రీతిలో షాక్ తగిలింది. శుక్రవారం ఉదయం టోక్యోలో దిగిన వేళ.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తన టూర్ లో భాగంగా ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం జపాన్ ప్రధానమంత్రి ఇసిబాతో మోడీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు.
ఈ పర్యటన వేళ జపాన్ వాణిజ్య మంత్రి అమెరికా టూర్ ను రద్దు చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. వాణిజ్య చర్చల్లో పాల్గొనేందుకు జపాన్ మంత్రి ర్యోసీ అకజవా గురువారం అమెరికాకు బయలుదేరాల్సి ఉంది. అయితే.. ఆఖరి నిమిషంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు.దీంతో.. జపాన్ - అమెరికాల మధ్య జరగాల్సిన 550 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్యాకేజీ ఒప్పందం ఆలస్యం కానుంది.
ట్రంప్ సుంకాల షాకుల వేళ అమెరికాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సిద్ధమైంది. దీంతో జపాన్ మీద విధించిన 25 శాతం సుంకాల్ని 15 శాతానికి తగ్గించాలని అగ్రరాజ్యం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఒప్పందం జపాన్ వాణిజ్య మంత్రి టూర్ లో కుదరాల్సి ఉంది. ప్రస్తుతం అది కాస్తా రద్దు అయ్యింది. ఒప్పందంలో మరికొన్ని అంశాల్ని చర్చించాల్సి ఉందని.. అందుకే టూర్ రద్దు అయినట్లుగా జపాన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. అయితే.. మోడీ టూర్ వేళ ఇలాంటి సీన్ చోటు చేసుకోవటం చూస్తే.. ప్రధాని మోడీ ‘చిత్రాన్ని’ మారుస్తున్నట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రంప్ తీరుపై గుర్రుగా ఉన్న మోడీ బయటపడటం లేదు కానీ.. అమెరికాకు ప్రత్యామ్నాయంగా పావులు కదుపుతున్న తీరు రానున్న రోజుల్లో ట్రంప్ అండ్ కోకు భారీ షాక్ తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.