రెండు పథకాలు ప్రారంభించిన మోడీ.. రైతులకు కీలక సుచనలు!

అవును.. ఈ రోజు (శనివారం) న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ వ్యవసాయ రంగంలో రెండు ప్రధాన కార్యక్రమాలను ఆవిష్కరించారు.;

Update: 2025-10-11 10:38 GMT

దేశం వికసిత్‌ భారత్‌ వైపు అడుగులు వేయడంలో రైతులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. తాజాగా న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కృషి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... వ్యవసాయం, దాని అనుబంధ రంగాలలో రూ.42 వేల కోట్లకు పైగా విలువైన బహుళ ప్రాజెక్టులు, పథకాలను ప్రారంభించారు! ఈ సందర్భంగా రైతులకు కీలక సూచనలు చేశారు మోడీ.

అవును.. ఈ రోజు (శనివారం) న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ వ్యవసాయ రంగంలో రెండు ప్రధాన కార్యక్రమాలను ఆవిష్కరించారు. అవి 'పీఎం ధన్ ధాన్య కృషి యోజన', 'పప్పుధాన్యాలలో ఆత్మ నిర్భరత మిషన్‌' కాగా... ఈ రెండింటికీ 35 వేల కోట్ల రూపాయలకు పైగా వ్యయం అవుతుంది.

ఇందులో భాగంగా... దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 జిల్లాల్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం.. పంట వైవిధ్యీకరణ.. స్థిరమైన వ్యవసాయ పద్ధతులను పెంచడం.. నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం.. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణ లభ్యతను సులభతరం చేయడం వంటివి లక్ష్యంగా రూ.24 వేల కోట్లతో ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన ప్రారంభించబడింది.

ఇదే సమయంలో... పప్పుధాన్యాలలో ఆత్మనిర్భరత మిషన్‌ ను 11 వేల 440 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. ఈ సమయంలో... దేశంలో పప్పుధాన్యాల ఉత్పాదకత స్థాయిలను మెరుగుపరచడం.. పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని విస్తరించడం.. సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ వంటి పనులను బలోపేతం చేయడంతో పాటు నష్టాలను తగ్గించడం దీని లక్ష్యం.

అదేవిధంగా... ఇదే కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం, పశుసంవర్ధకం, మత్స్య, ఆహార ప్రాసెసింగ్ రంగాలలో రూ.5,450 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. మరోవైపు సుమారు 815 కోట్ల రూపాయల విలువైన అదనపు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రసంగించిన ప్రధాని.. రైతులకు కీలక సూచనలు చేశారు.

ఇందులో భాగంగా... భారత్‌ ఇతర దేశాల దిగుమతులపై ఆధారపడకుండా ఉండాలంటే.. కేవలం వరి, గోధుమ పంటల పైనే కాకుండా ప్రొటీన్‌ అధికంగా లభించే పప్పులకు సంబంధించిన సాగును మరింత పెంచాలని రైతులకు సూచించారు. దేశంలో పంటల ఉత్పత్తికి అయ్యే ఖర్చులు తగ్గించి, రైతుల ఆదాయం పెంచే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఈ క్రమంలో.. తమ ప్రభుత్వం పదేళ్లలో రైతులకు రూ.13 లక్షల కోట్లకు పైగా సబ్సిడీలు ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్‌ హయాంలో పదేళ్లలో వ్యవసాయ రంగంలో కేవలం రూ.5 లక్షల కోట్ల సబ్సిడీలు మాత్రమే ఇచ్చిందని మోడీ అన్నారు. ఇదే సమయంలో.. దేశంలోని 100కు పైగా జిల్లాలను వెనకబడిన జిల్లాలుగా ప్రకటించి, ఆపై వాటిని పూర్తిగా మరిచిపోయాయని మండిపడ్డారు.

Tags:    

Similar News