టారిఫ్ ల వేళ అమెరికాకు ఇచ్చి పడేసిన మోడీ
మోదీ మాట్లాడుతూ “చరిత్రను లిఖించాల్సిన సమయం ఇది. మనం ప్రపంచ మార్కెట్‌ను పాలించాలి. తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించాలి.;
దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశభక్తి జ్వాలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ ప్రజలను ఉద్దేశించి కీలక సందేశం ఇచ్చారు. అమెరికా సుంకాల బెదిరింపులు, గ్లోబల్ ఆర్థిక సవాళ్ల మధ్య భారత వ్యాపారాలు, ఉత్పత్తులపై విశ్వాసం పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
మోదీ మాట్లాడుతూ “చరిత్రను లిఖించాల్సిన సమయం ఇది. మనం ప్రపంచ మార్కెట్‌ను పాలించాలి. తక్కువ ఖర్చుతో అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించాలి. ఆర్థిక స్వార్థం పెరుగుతున్న ఈ సమయంలో మన లక్ష్యాలను సాధించేందుకు ముందుకు సాగాలి” అని స్పష్టం చేశారు. మన శక్తిని ఇతరులను తక్కువ చేసి మాట్లాడటంలో వృథా చేయకుండా స్వీయ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు.
దేశంలోని వ్యాపారులు, దుకాణదారులు స్వదేశీ ఉత్పత్తుల విక్రయాలపై దృష్టి పెట్టాలని, ప్రపంచం భారత పురోగతిని గమనిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల్లో అవసరమైన మార్పులపై సూచనలు ఇవ్వాలని కోరుతూ రైతు వ్యతిరేక విధానాలను సహించబోమని హామీ ఇచ్చారు. రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని, వారికీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తానని మోదీ భరోసా ఇచ్చారు.
-అణు ఇంధనంలో ప్రైవేటు పెట్టుబడులు
ఇంధన స్వయం సమృద్ధి లక్ష్యంగా సూర్యశక్తి, గ్రీన్ హైడ్రోజన్, అణు ఇంధనం రంగాల్లో వేగంగా అడుగులు వేస్తున్నామని మోదీ వెల్లడించారు. అణు విద్యుత్ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ దిగుమతులపై దేశం ప్రతి సంవత్సరం లక్షల కోట్లు ఖర్చు చేస్తోందని, కొత్త ఇంధనాల అభివృద్ధితో ఈ దిగుమతులను తగ్గించడమే లక్ష్యమన్నారు. కీలక ఖనిజాల ప్రాధాన్యం పెరుగుతున్న ఈ సమయంలో, దిగుమతులు తగ్గితే స్వయం సమృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
-స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కొత్త రికార్డు
ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మోదీ మరో రికార్డు సొంతం చేసుకున్నారు. అత్యధిక కాలం స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధానిగా ఆయన నిలిచారు. ఈసారి 103 నిమిషాల పాటు ప్రసంగించి, గతేడాది తనే సాధించిన 98 నిమిషాల రికార్డును అధిగమించారు.
దేశ ప్రజలతో నిండైన సంభాషణ జరిపిన మోదీ, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యసాధనకు ప్రతి పౌరుడు తన వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.