పవన్ వర్సెస్ ముద్రగడ.... సీన్ రిపీట్ అవుతుందా ?
ఇక ముద్రగడ కాపు సామాజిక వర్గంలో పెద్దాయనగా ఈ రోజుకీ గుర్తింపు అందుకుంటునే ఉన్నారు.;
ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం అంటే తెలియని వారు లేరు. కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసి తెలుగుదేశం బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ ఇలా ముద్రగడ పద్మనాభం అర్ధ శతాబ్దం రాజకీయం అంతా సాగింది. ఇక ఆయన తీరు చూస్తే ట్రెడిషనల్ పొలిటీషియన్ కాదని అంటారు. ఆయన ఒక బలమైన సామాజిక వర్గం ఆకాంక్షల సాధన కోసం పోరు బాట పట్టారు అలా రాజకీయంగా పీక్స్ లో ఉన్న వేళ ఉప ముఖ్యమంత్రి స్థాయి పదవులు అందుకునే చాన్స్ ని సైతం మిస్ చేసుకుని ఆయన తాను అనుకున్న పంధాలోనే ముందుకు సాగారని చెబుతారు.
పెద్దాయన గా :
ఇక ముద్రగడ కాపు సామాజిక వర్గంలో పెద్దాయనగా ఈ రోజుకీ గుర్తింపు అందుకుంటునే ఉన్నారు. ఏడు పదుల వయసు చేరువలో ఉన్న ముద్రగడ ఆ మధ్య అంతా అనారోగ్య సమస్యలతో సతమతం అయ్యారు అయితే తాను బాగానే ఉన్నాను అని కూడా ఇటీవల కాలంలో చెప్పారు. జగన్ ని 2029లో సీఎం గా చేయడానికి తన వంతుగా కృషి చేస్తాను అని ముద్రగడ చెప్పి ఉన్నారు ఆయనకు వైసీపీ కూడా పార్టీ అత్యున్నత వేదిక అయిన రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు కల్పించింది. ఇక ముద్రగడ కుమారుడు గిరికి ప్రత్తిపాడు సీట్లో ఇంచార్జి గా నియమించింది.
పవన్ మీదకే అస్త్రం :
అయితే వైసీపీ అధినాయకత్వం గోదావరి జిల్లాలో క్రమంగా మారుతున్న సామాజిక రాజకీయ పరిణామలను దృష్టిలో ఉంచుకుని ముద్రగడ కుటుంబం మీదనే పెను భారం పెడుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ముద్రగడ కుమారుడు గిరిని ప్రత్తిపాడు కంటే కూడా పిఠాపురం నుంచి పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉందని అంటున్నారు. ముద్రగడకు పిఠాపురంలోనూ పట్టు ఉంది. ఆయన అనుచర వర్గం పెద్ద ఎత్తున పిఠాపురంలో ఉంది. దాంతో కుమారుడికి టికెట్ ఇస్తే ముద్రగడ రంగంలోకి దిగితే ఇక పిఠాపురంలో వైసీపీ రాజకీయం నల్లేరు మీద నడక మాదిరిగా సాగిపోతుంది అని కొత్త ఆలోఅనలు వైసీపీ పెద్దలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఆమె అవుట్ :
ఇక ప్రస్తుతం పిఠాపురం వైసీపీ ఇంచార్జిగా ఉన్న వంగా గీత పెర్ఫార్మెన్స్ మీద వైసీపీ పెద్దలు పెదవి విరుస్తున్నారు అని అంటున్నారు. మరో వైపు వంగా గీత సైతం తనకు పిఠాపురం అసెంబ్లీ సీటు వద్దని వేరే చోటకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారని కూడా ప్రచారంలో ఉంది. అయితే ఆమెకు ఇంకో చోట చాన్స్ ఇస్తారా లేదా అన్నది పక్కన పెడితే పిఠాపురంలో మాత్రం వంగా గీత అవుట్ అయినట్లే అని అంటున్నారు. ముద్రగడ పద్మనాభం ఫ్యామిలీనే ఈసారి రంగంలోకి దించి పవన్ కళ్యాణ్ ని దెబ్బ కొట్టాలని మాస్టర్ స్కెచ్ గీస్తున్నారు అని అంటున్నారు.
మోజు తీరిపోతుందనా :
పవన్ కళ్యాణ్ రొటీన్ రెగ్యులర్ పొలిటీషియన్ కాదని వైసీపీ భావిస్తోంది. ఆయన మీద మోజుతో 2024 ఎన్నికల్లో గెలిపించారని ఇప్పటికే కాపులలో అంతర్మధనం మొదలైందని కూటమి పాలన పట్ల అసంతృప్తి కూడా నెమ్మదిగా పెరుగుతోందని అది కాస్తా 2029 ఎన్నికల నాటికి పీక్స్ కి చేరుకుంటుందని అంచనా వేస్తోంది. అలా కనుక జరిగితే మాత్రం పిఠాపురంలో ఫ్యాన్ గిర్రున తిరిగే అవకాశాలు కూడా కొట్టి పారేయలేమని అంటున్నారు. ఒక వేళ అది జరగకపోయినా గట్టి పోటీ ఇచ్చి అయినా పవన్ ని కట్టడి చేస్తే మిగిలిన నియోజకవర్గాలలో వైసీపీకి అది ఎంతో ఉపయోగంగా ఉంటుందని కూడా భావిస్తున్నారుట. మొత్తానికి పవన్ వర్సెస్ ముద్రగడగా సీన్ ని రిపీట్ చేయాలని ఆరాటపడుతోంది అని అంటున్నారు. మరి దీనికి పెద్దాయన ముద్రగడ ఏ మేరకు స్పందిస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు.