పిఠాపురంలో ఫ్యాన్ స్విచాఫ్...మ్యాటరేంటో ?
ఏపీలో ఎపుడూ హాట్ టాపిక్ గా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలలో అగ్ర స్థానంలో పిఠాపురం ఉంటుంది.;
ఏపీలో ఎపుడూ హాట్ టాపిక్ గా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాలలో అగ్ర స్థానంలో పిఠాపురం ఉంటుంది. మరి అక్కడ ఎమ్మెల్యే ఎవరు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కదా. అంతే కాదు ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడు. ఇక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కీలకమైన శాఖకు చేతిలో ఉన్నాయి. అటు చంద్రబాబుకు పక్క సీటు, ఇటు కేంద్రంలో మోడీకి సన్నిహితుడు. దాంతో గాజు గ్లాస్ తో పెట్టుకుంటే సీన్ సితారే అన్నట్లుగా వైసీపీ శిబిరంలో ఉందిట.
ఇక చూస్తే 2024 మేలో సార్వత్రిక ఎన్నికలు అయిపోయాక ఫ్యాన్ పార్టీ స్విచాఫ్ అయిపోయింది అని అంటున్నారు. ఇప్పటికి పదమూడు నెలలు గడుస్తున్నా ఫ్యాన్ రెక్కల కదలిక లేదంటే ఆశ్చర్యమే అంటున్నారు. మంచో చెడో రాజకీయం అంతా కూటమి పార్టీల చుట్టూ తిరుగుతోంది అని అంటున్నారు. జనసేన వర్సెస్ టీడీపీగా బలంగా అల్లుకుని రాజకీయం సాగుతోంది.
ఈ మధ్యలో ఎక్కడ చోటు లేక ఇమడలేక వైసీపీ ఫుల్ సైలెంట్ అయిపోయింది అని అంటున్నారు. ఏపీలో మొత్తం 174 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక ఎత్తు. పిఠాపురం మరో ఎత్తు అని అంటున్నారు. ఇక్కడ పవన్ కి ఎదురు నిలిచి రాజకీయం చేయలేమని వైసీపీ నేతలు అంటున్నారుట. ఇప్పటికే చాలా మంది నేతలు జనసేన కండువా కప్పేసుకుని సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే అయిన పెండెం దొరబాబు జనసేనలోకి చేరిపోయారు. ఆయనతో పాటు బలమైన అనుచర వర్గాన్ని కూడా వెంట తీసుకుని పోయారు.
ఇక 2024 ఎన్నికల్లో పోటీ చేసిన వంగా గీత అయితే పిఠాపురంలో వైసీపీ ఉనికిని నిలబెట్టేందుకు ఆపసోపాలు పడుతున్నారు. వైసీపీ అధినాయకత్వం పై స్థాయిలో ఇచ్చిన ఏ పిలుపునకూ క్యాడర్ అందుబాటులోకి రావడం లేదుట. చాలా నైస్ గా తప్పించుకుని సైడ్ అయిపోతున్నారుట. తమ వ్యాపారాలు వ్యవహారాలు అన్నీ కూడా ఉన్నాయని కూటమికి ఎదురెళ్ళి పాలిటిక్స్ చేస్తే పర్సనల్ గా రిస్క్ లో పడతామని నేతలు అంటున్నారుట.
అటు జనసేనలోకి వెళ్లలేక ఇటు టీడీపీలో చేరే దారి లేక ఉన్న వారే ప్రస్తుతం జనసేనలో ఉన్నారని అంటున్నారు. వారంతా ఎందుకొచ్చిన రాజకీయం అని ప్రస్తుతానికి తమ సొంత బిజినెస్ లు చేసుకుంటున్నారుట. ఆఖరికి పిఠాపురం ఇంచార్జిగా ఉన్న వంగా గీత స్వయంగా పిలిచి మరీ పార్టీ యాక్టిటీస్ లో పాలు పంచుకోవాలని కోరినా సున్నితంగా లేదు కాదు అనేసి పక్కకు పోతున్నారుట.
దీంతో సీన్ మొత్తం అర్ధమైన గీత కూడా తూతూ మంత్రంగానే పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు అని అంటున్నారు. ఇక పిఠాపురంలో మొత్తం స్థానిక సంస్థలలో ఉన్న ప్రజా ప్రతినిధులలో కూటమి వైపు వెళ్ళిన వారు పోగా మిగిలిన వారు తమ పదవీ కాలం పూర్తి అయిపోతోంది అని ఇక కొన్నాళ్ళ పాటు రాజకీయాలకు దూరం అని కొత్త స్టైల్ ని ఫాలో అవుతున్నారుట.
మరో నాలుగేళ్ళ తరువాత అప్పటి రాజకీయ పరిస్థితులను చూసి యాక్టివ్ కావచ్చు అని వారు భావిస్తున్నారుట. అనవసరంగా గొంతు పెంచుకుని చొక్కా చించుకుని వీధులలోకి వస్తే బతుకు బస్టాండ్ అయిపోతుందన్న ముందస్తు తెలివిడితోనే ఇలా చేస్తున్నారు అని అంటున్నారు. దీంతో పిఠాపురంలో ఫ్యాన్ రెక్కలు తిరిగే దారి కనబడడం లేదు అని అంటున్నారు. అదన్న మాట మ్యాటర్.