పిన్నెల్లి ఎక్కడ? బుధవారం అసలేం జరిగింది?

పిన్నెల్లి అక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు? లాంటి ప్రచారాలతో పోలీసులు పరుగులు తీశారు. కిందా మీదా పడ్డారు

Update: 2024-05-23 04:59 GMT

పోలింగ్ వేళ ఒక బూత్ లోకి వెళ్లి.. అక్కడి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో వెలుగులోకి రావటం.. ఇదో పెను సంచలనంగా మారటం.. ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి బరితెగింపు కొత్త సందేహాలకు తావిచ్చేలా చేసింది. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావటం.. చర్యలకు ఆదేశాలు జారీ చేయటం.. ఈ అంశంపై పురోగతిని ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మొత్తం హైడ్రామా నెలకొంది.

పిన్నెల్లి అక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు? లాంటి ప్రచారాలతో పోలీసులు పరుగులు తీశారు. కిందా మీదా పడ్డారు. పలుచోట్ల గాలింపులు.. తనిఖీలు చేపట్టారు. చివరకు పిన్నెల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కానీ.. ఆయన దొరకలేదని.. ఆయన కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకోవటం తెలిసిందే. పిన్నెల్లి తప్పించుకున్నారని.. ఆయన పోలీసుల అదుపులో లేరని ఉన్నతాధికారులు క్లారిటీ ఇస్తున్నారు. మొత్తంగా పిన్నెల్లి ఎపిసోడ్ లో హైదరాబాద్ లో బుధవారం హైడ్రామా చోటు చేసుకుంది.

Read more!

ఏపీ పోలీసులు హైదరాబాద్ లోని పిన్నెల్లి ఇంటికి సమీపంలో మాటు వేసి ఉన్నారు. ఇదిలా ఉండగా ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చిన కారును వారు వెంబడించారు. కొంత దూరం వెళ్లిన తర్వాత కారు ఆగిపోవం.. అందులో పిన్నెల్లి లేకపోవటం.. కారులో ఉన్న గన్ మ్యాన్.. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నించటం షురూ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ ను చూసిన తెలంగాణ పోలీసుల అంచనా ప్రకారం.. సినిమాటిక్ గా పక్కా ప్లాన్ తో ఇదంతాచేసి ఉంటారని.. పిన్నెల్లిని తప్పించేందుకే ఆయన కారుతో ఏపీ పోలీసుల్ని తప్పుదారి పట్టించినట్లుగా చెబుతున్నారు.

పోలింగ్ రోజున పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లి..అది పెద్ద కేసు అవుతుందని భావించి.. ఆ రోజే తన సోదరుడు (వెంకట్రామిరెడ్డి)తో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయారు. తన ప్రయాణం మధ్యలో తనకు సెక్యూరిటీగా ఉన్న గన్ మెన్లను మధ్యలో ఆపేసి వారిని కిందకు దింపేసి వెళ్లిపోయారు. దీంతో.. వారు హెడ్ క్వార్టర్ కు వచ్చి ఉన్నతాధికారుల్ని కలిసి.. జరిగింది విన్నవించారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి కేపీహెచ్ బీలోని ఇందూ విల్లాస్ లో తన ఇంట్లో ఉన్నట్లుగా చెబుతున్నారు.ఆయన సోదరుడు గచ్చిబౌలిలోని మరో ఇంట్లో ఉన్నారని.. సీసీ కెమేరా ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత ఆయన బయటకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలోఏపీ పోలీసులు సైతం పిన్నెల్లి కోసం గాలింపులు మొదలు పెట్టారు. ఆయన ఫోన్ ఆధారంగా హైదరాబాద్ లో ఉన్నట్లుగా గుర్తించి బుధవారం ఉదయమే నగరానికి చేరుకున్నారు. గురజాల డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసుల టీం ఇందూ విల్లాస్ కు చేరుకున్నారు.

4

కొంత సమయానికి అందులో నుంచి ఆయన కారు బయటకు రావటంతో దాన్నిపాలో అయ్యారు. నేషనల్ హైవే మీద వేగంగా వెళుతుండటంతో ఏపీ పోలీసులు సంగారెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన సంగారెడ్డి జిల్లా పోలీసులు జాతీయ రహదారిపై కంది కూడలి వద్ద కాపు కాశారు. తాత్కాలిక చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. అయితే.. పటాన్ చెరు దాటిన తర్వాత రుద్రారం వైపు కొంత దూరం వెళ్లిన కారు.. గణేష్ తండా వద్ద ఆగిపోయింది.

ఈ కారును ఫాలో అవుతూ వచ్చిన ఏపీ పోలీసులు కారును తనిఖీ చేయగా.. అందులో డ్రైవర్.. ఇతర సిబ్బంది ఉన్నారే తప్పించి పిన్నెల్లి లేరు. కారులోనే ఫోన్ ఉండటాన్ని చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే.. ఇంటి నుంచి బయటకు వచ్చి నేషనల్ హైవే మీదకు ఎక్కిన తర్వాత.. కొంత దూరం ప్రయాణించిన తర్వాత పిన్నెల్లి కారు దిగి.. డివైడర్ ను దాటి ఎదురు రోడ్డుకు వెళ్లారని.. అక్కడ మరో కారు సిద్ధంగా ఉండటంతో అందులో వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.

పిన్నెల్లి ఫోన్ ఆధారంగా ఆయన జాడను గుర్తించే ప్రయత్నం చేసిన ఏపీ పోలీసులు.. అందుకు తగ్గట్లే కారును ఫాలో అయ్యారు. ఆయన్ను ప్రత్యక్షంగా ఎవరూ లేరని పోలీసులు చెబుతున్నారు. ఇదంతాచూస్తే.. పిన్నెల్లి ముందుస్తుగానే హైదరాబాద్ ను విడిచిపెట్టి వెళ్లిపోయారని చెబుతున్నారు. ఏపీ పోలీసులు వస్తే.. వారిని తప్పుదారి పట్టించేలా ఏం చేయాలో ముందస్తుగానే చెప్పి ఉంటారని భావిస్తున్నారు. మరో వాదన ప్రకారం ఏపీకి చెందిన ఒక వ్యాపారి ఇంట్లో ఉన్నట్లుగా చెబుతున్నారు. హైదరాబాద్ వచ్చినంతనే ఆయన వద్ద ఆశ్రయం పొందిన పిన్నెల్లి తర్వాత మరో చోటుకు తన బస మార్చినట్లుగా భావిస్తున్నారు.

తన వీడియో బయటకు వచ్చి వైరల్ గా మారిన నేపథ్యంలో పోలీసుల చర్యలు ఉంటాయన్న ఉద్దేశంతో పక్కా ప్లాన్ తోనే పోలీసుల్ని పక్కదారి పట్టించి ఉంటారని భావిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్అయంలో.. అధికారుల అనుమానం ప్రకారం పిన్నెల్లి తమిళనాడుకు పారిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో హైదరాబాద్ లోని పిన్నెల్లి సమీప బంధువులు.. సన్నిహితుల ఇళ్లపైనా నజర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పిన్నెల్లి అరెస్టు కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దేశ వ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్టులను అలెర్టు చేశారు. దీంతో.. ఆయన జాడ కోసం భారీ ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News