మోడీకి మ‌రో సీఎం దొరికాడు: కేర‌ళ‌లో ఆడేసుకుంటున్నారు!

ప్రస్తుతం కేరళవ్యాప్తంగా అధికార పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు, ధర్నాలకు పిలుపునిచ్చారు. ఇది జాతీయ రాజకీయాల్లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.;

Update: 2025-10-13 07:00 GMT

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ‌న్‌ వర్సెస్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నట్టుగా రాజకీయాలు మారిపోయాయి. ప్రస్తుతం కేరళవ్యాప్తంగా అధికార పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు, ధర్నాలకు పిలుపునిచ్చారు. ఇది జాతీయ రాజకీయాల్లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. మరి ఇలా ఎందుకు జరిగింది? అసలు ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి కి మధ్య ఉన్న వివాదం ఏంటి? అనేది చూస్తే.. వచ్చే ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేప‌థ్యంలో అధికార వామపక్ష కూటమి పార్టీలను బలోపేతం చేసే దిశగా సీఎం పిన‌రయి విజ‌య‌న్‌.. ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా విదేశాల్లో ఉన్న మలయాళీ ప్రజలను ఏకం చేసేందుకు వారి ద్వారా రాష్ట్రంలో ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో గల్ఫ్ దేశాలైన దుబాయ్, అబుదాబి, ఖతార్ సహా ఇతర దేశాల్లో ఆయన పర్యటించి.. అక్కడి కేరళ ప్రవాశీయులను కలిసి ప్రచారం చేయాలని భావించారు. వాస్తవానికి రాజకీయంగా ఎవరు ఎలాంటి వ్యూహాలైనా వేసుకోవచ్చు. ఎవరు ఎలాంటి ప్రయత్నాలు అయినా చేసుకోవచ్చు.

కానీ, కేరళ‌లో బలమైన పార్టీగా అవతరించాలని భావిస్తున్న బిజెపి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పిన‌ర‌యి విజ‌య‌న్ విదేశీ పర్యటనలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి అడ్డు తగిలింది. వాస్తవానికి ఈ ఏడాది మొదట్లో విజయన్‌ విదేశీ పర్యటన పెట్టుకున్నారు. దీనికి సంబంధించి అనుమతి కోరుతూ కేంద్ర హోంశాఖ అలాగే విదేశాంగ శాఖకు ఆయన లేఖ రాశారు. అప్పట్లోనూ కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. ఈ క్రమంలో ఈనెల 16వ తేదీ నుంచి వరుసగా వారం రోజులు పాటు ఆయన విదేశాల్లో పర్యటించడానికి సిద్ధమై కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరారు.

దీనికి కూడా కేంద్రం అనుమతించలేదు. అయితే, సహజంగా ప్రస్తుతం ఉన్న విదేశీ వ్యవహారాల నేపథ్యంలో కేంద్రం అడ్డుపడిందని అనుకుంటే మంచిదే. కానీ, అలాంటి పరిస్థితి ఏమీ లేదు. పైగా ఏపీ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు విదేశీ పర్యటనలకు ఇదే నెలలో అనుమతించిన కేంద్ర ప్రభుత్వం కేరళ ముఖ్యమంత్రి విషయంలో మాత్రం అడ్డుపడుతోంది అన్నది ప్రధాన విమర్శ. ఈ నేపథ్యంలోనే కేరళలో రాజకీయ విమర్శలు.. అధికార పార్టీ వర్సెస్ బిజెపి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో బలమైన ప్రతిపక్షంగా ఎదగాలన్నది బిజెపి ఆలోచనగా ఉంది. పార్టీ పెట్టిన తర్వాత గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక ఎంపీ స్థానాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రభావంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం రెండు అంకెల సంఖ్యలో అయినా పదవులు దక్కించుకోవాలని బిజెపి భావిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనలకు అడ్డు తగులుతోందన్నది అధికార కూటమి నాయకులు చెబుతున్న మాట. కానీ, బిజెపి మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉంది. మరోవైపు విజయ‌న్‌ కు అనుమతి ఇవ్వడం లేదన్నది వాస్తవమేన‌ని విదేశాంగ ప్రకటించింది. దీనికి కారణాలు చెప్పకపోవడం కూడా వివాదానికి దారితీసింది.

Tags:    

Similar News